Share News

చి‘వరి’కి ఆశలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:37 AM

రుతుపవనాలు మే నెలాఖరులోనే రాగా, వానాకాలం ముందస్తుగా మురిపించింది. ఆ తరువాత మోస్తరుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలతో వానాకాలం సాగుపనులు ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడింది.

చి‘వరి’కి ఆశలు

వారంలో రోజులుగా భారీ వర్షాలు

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతన్నలు

ఈ నెల 15 వరకు వరి నాట్లకు అవకాశం

ఆరుతడి పంటలకు జీవం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రుతుపవనాలు మే నెలాఖరులోనే రాగా, వానాకాలం ముందస్తుగా మురిపించింది. ఆ తరువాత మోస్తరుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలతో వానాకాలం సాగుపనులు ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడింది. దీంతో ఇప్పటివరకు సాగు సగమే అయింది. వానాకాలంలో 4.40లక్షల ఎకరాల సాగు అంచనాకు ఇప్పటివరకు 3,23,152 ఎకరాల్లో రైతులు పలు పంటలు సాగుచేశారు. తాజాగా, వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు ముమ్మరమయ్యాయి.

జిల్లాలో ప్రధాన పంట వరి. ఏటా వానాకాలం, యాసంగిలో అధిక మొత్తంలో వరినే రైతులు సాగుచేస్తున్నారు. వరి తరువాత రైతులు అధికంగా పత్తి సాగుచేస్తున్నారు. అయితే వానాకాలం ప్రా రంభమై రెండు నెలలు గడిచినా ఇంతకాలం భారీ వర్షాలు లేక చెరువులు, కుంటలు నిండలేదు. ఈ నేపథ్యంలో సాగు విషయం లో ముందుకు వెళ్దామా? లేదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నా రు. గతనెల క్రితం వరకు ఎక్కడా చెరువులు, కుంటలు నిండకపోవడంతో బోరుబావులు ఉన్న రైతులు, మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు మాత్రమే వరి సాగుచేశారు. చెరువులు, కుంటల కిం ద ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. దీంతో రైతులు రెండు నెలలు గా భారీ వర్షాల కోసం ఎదురుచూశారు. కాగా, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. వారం క్రితం వర కు కూడా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదుకాలేదు. ప్రస్తుతం జిల్లాలోని యాదగిరిగుట్ట, రాజపేట మండలాలు మిన హా అన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ సీజన్‌లో జిల్లా సాధార ణ సగటు వర్షపాతం 288.3మిల్లీమీటర్లకు ఇప్పటి వరకు 429.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే ఈ నెల 15వ తేదీ వరకు నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాలతో భూగర్భజలాలు పెరగడంతో సాగుకు ఢోకా లేద ని రైతులు నాట్లకు సన్నద్ధమవుతున్నారు. దీంతో రెండు, మూడురోజులుగా జిల్లా వ్యాప్తంగా నాట్లు ఊపందుకున్నాయి.

జీవం పోసుకున్న ఆరుతడి పంటలు

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఆరుతడి పంటలకు జీవం వచ్చింది. జూలైలో నాటిన పత్తితో పాటు జొన్న, కూరగాయల పంటలకు సరిపడా వర్షాలు, నీరులేక నోర్లు వెళ్లబెట్టాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుతడి పంటలు పచ్చగా మారాయి. పత్తి ఏపుగా పెరుగుతోంది. మరోవైపు వర్షాలు కురుస్తాయన్న ఆశలు లేకపోవడంతో చాలా మంది రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపారు. బోర్లు ఉన్న రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. జిల్లాలో కూరగాయల సాగు సాధారణ విస్తీర్ణం 23వేల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో రైతులు 25వేల ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నారు. సుమారు 2వేల ఎకరాలకు పైగా ఈ సీజన్‌లో అదనంగా రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో చివరి దశలో భారీ వర్షాలు కురియడంతో వరి సాగువైపు మళ్లారు.

ఊపందుకున్న వరినాట్లు

ఈ సీజన్‌లో ఈ నెలలోనే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు సాగు చేయాలా? లేదా అనే సందిగ్ధంలో ఉన్న రైతులు భారీ వర్షాలు కురియడంతో ప్రస్తుతం నాట్లు వేసేందుకు సన్నాహా లు చేస్తున్నారు. రైతులు జిల్లా వ్యాప్తంగా జోరుగా వరినాట్లలో నిమగ్నమయ్యారు. వానాకాలంలో జిల్లా లో మొత్తం 4,40,500ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిలో 2,95,000 ఎకరాల్లో వరి, 1,15000 ఎకరాల్లో పత్తి, 6వే ల ఎకరాల్లో కందులు, 600 ఎకరాల్లో జొన్నలు, 500 ఎకరాల్లో పప్పుధాన్యాలు, 200 ఎకరాల్లో నూనెగింజ లు, 23,200 ఎకరాల్లో కూరగాయాలు, ఆకుకూరలు సాగవుతాయన్నది అంచనా. వానాకాలం ప్రారంభంలో జిల్లా వ్యాప్తంగా సకాలంలో సరిపడా వర్షాలు కురియపోవడంతో సాగుకు రైతులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం జిల్లాలో 3,23,152 ఎకరాల్లో వరి, పత్తి, తదితర పంటలు సాగయ్యాయి. అందులో వరి 1,87,589 ఎకరాల్లో, పత్తి 1,07,250 ఎకరాల్లో, కందులు 2,824ఎకరాల్లో, జొన్నలు 49 ఎకరాల్లో, పప్పుధాన్యాలు 152 ఎకరాల్లో, కూరగాయలు 25,168 ఎకరాల్లో సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 4,650ఎకరాల్లో వరి నారు అందుబాటులో ఉంది. ఈ వరి నారుతో 90వేల ఎకరాల్లో పంట సాగు చేయవచ్చు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ఈ నెల 15వ తేదీ వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉండటంతో, వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రైతులు ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నెల 15వరకు నాట్లు వేసుకోవచ్చు: పి.వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

వానాకాలంలో ఈ నెల 15వ తేదీ వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. వరి సాగుచేసే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వరి నారుమడులు ఉన్నవారు వెంటనే భూమిని చదునుచేసుకుని నాట్లు వేసుకోవాలి. వానాకాలంలో పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారుల సలహా మేరకు ఎరువులను వినియోగించి అధిక పంట దిగుబడులు సాధించాలి.

జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం ఇలా..

మండలం సాధారణ నమోదైన

వర్షపాతం వర్షపాతం

తుర్కపల్లి 245.6 322.5

రాజపేట 261.7 302.4

ఆలేరు 299.8 474.4

మోటకొండూరు 296 432.6

యాదగిరిగుట్ట 304.4 339.6

భువనగిరి 337.5 460.4

బొమ్మలరామారం 269.9 365.4

బీబీనగర్‌ 302.6 431.1

పోచంపల్లి 294.7 455

చౌటుప్పల్‌ 240.1 583.3

నారాయణపూర్‌ 184.5 429.2

రామన్నపేట 294.7 422.6

వలిగొండ 312.6 460.1

ఆత్మకూరు 262.6 467.8

మోత్కురు 333.6 436.6

అడ్డగూడూరు 326 479.7

గుండాల 334.9 444

మొత్తం సగటు 288.3 429.8

Updated Date - Aug 13 , 2025 | 12:37 AM