చేనేత రుణమాఫీ!
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:17 AM
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రుణమాఫీని అమలుచేస్తూ, ఈ పథకం కోసం రూ.33 కోట్లు విడుదల చేసింది.
ప్రస్తుతం రూ.లక్ష లోపు రుణాలకే
రూ.33 కోట్లు మంజూరు
ఉమ్మడి జిల్లాలో 3,326 మందికి
రూ.26.68 కోట్ల ఆర్థిక ప్రయోజనం
కార్మికుల్లో ఆనందోత్సాహాలు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రుణమాఫీని అమలుచేస్తూ, ఈ పథకం కోసం రూ.33 కోట్లు విడుదల చేసింది. దీంతో చేనేత కార్మికులకు గొప్ప ఆర్థిక ఊరట లభించింది. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న కార్మికులందరికీ లబ్ధి చేకూరనుంది. రాష్ట్రవాప్తంగా 6,600 మంది చేనేత కార్మికులు ప్రయోజనం పొందుతుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,326 మందికి రూ.26.68 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
చేనేత కార్మికులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. కార్మికులను రుణవిముక్తులను చేస్తూ 2025-26 బడ్జెట్ నుంచి రూ.33కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. చేనేత వృత్తిపై తీసుకున్న రుణాలు, చేనేత వసా్త్రల ఉత్పత్తికి, వృత్తి సంబంధ కార్యకలాపాలు, ముద్ర రుణాలన్నింటికీ మాఫీ కానున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఆయా బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 1,162 మంది చేనేత కార్మికులకు రూ.8.04 కోట్ల రుణమాఫీ జరుగనుంది. వీరితోపాటు మరో 1,560 మంది రూ.లక్షకు పైగా రుణాలు తీసుకున్నారు. వీరికి సైతం రూ.15.60 కోట్లు రుణమాఫీ వర్తించనుంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో మొత్తం 2,722 మంది కార్మికులకు రూ.23.64కోట్ల రుణవిముక్తి లభించనుంది. అయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి మొత్తం 604 మంది చేనేత కార్మికులకు రూ.3.04 కోట్ల రుణమాఫీ కానుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,326 మంది చేనేత కార్మికులకు రూ.26.68 కోట్ల రుణమాఫీ జరుగనుంది.
చేనేత రుణమాఫీపై సర్కారు తిరకాసు!
చేనేత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు తిరకాసు పెడుతోంది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం వెల్లడైంది. దీంతో రూ.లక్ష లోపు రుణాలు పొందిన చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల నుంచి పొందిన రుణంలో అసలు రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయడానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలుపై పెరిగిన వడ్డీని రుణగ్రహీత తిరిగి బ్యాంకులకు చెల్లిస్తేనే రుణం పొందిన అసలు సొమ్ము మాఫీ జరుగుతుందని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఉదాహరణకు ఒక కార్మికుడు బ్యాంకు నుంచి రూ.90వేలు రుణం తీసుకుంటే దానికి వడ్డీ రూ.25 వేలు అయింది. అసలు వడ్డీ కలిపితే రూ.1.15 లక్షలు అవుతుంది. అయితే బ్యాంకు నుంచి పొందిన రుణం రూ.90వేలకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని సమాచారం. వీడ్డ మొత్తం రూ.25వేలు కార్మికుడు చెల్లించాల్సి ఉంటుంది. మిగ తావారికి కూడా అసలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తు ండగా, వడ్డీ కార్మికులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏదేమైనా ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడంపై కార్మికులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా ఖాతాల్లోనే జమవుతాయి
రూ.లక్షలోపు ఉన్న రుణాలున్న వార ందరికీ రుణమాఫీ అవుతుంది. రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న రుణమొత్తాన్ని చెల్లిస్తే వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రూ.లక్షలోపు రుణం ఉన్నవారికి గడువులో చెల్లించిన వారికి ప్రయోజనకరం. రుణమాఫీ డబ్బులు నేరుగా చేనేత కార్మికుల ఖాతాలో జమవుతాయి.
శ్రీనివాస్‌రావు, చేనేత, జౌళీశాఖ ఏడీ, యాదాద్రిజిల్లా