Share News

చేపల సీడ్‌ పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:01 AM

మత్స్యకారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఉచితంగా చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు నెలాఖరులోగా టెండర్లు పూ ర్తి చేసి, సెప్టెంబరు 15లోగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

చేపల సీడ్‌ పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఈసారి ముందస్తుగానే టెండర్ల ప్రక్రియ షురూ

చేపల పెంపకంపై కార్యాచరణ ప్రణాళిక

జిల్లాలో 2.16కోట్ల చేపపిల్లల పంపిణీ

143 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు

నీటి పరిమాణాన్ని బట్టి చేపపిల్లలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : మత్స్యకారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఉచితంగా చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు నెలాఖరులోగా టెండర్లు పూ ర్తి చేసి, సెప్టెంబరు 15లోగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వారంలో రోజుల్లోగా సాగునీటి శాఖల నివేదిక మేరకు జిల్లాలోని చెరువుల్లో నీటి సామర్థ్యాన్ని బట్టి చేప పిల్లలు పంపిణీచేయనున్నా రు. మత్స్యకారులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ చేప పిల్లల పంపిణీకి సంబంధిత శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లా హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉంది. ప్రతీ ఆదివారం జిల్లాలోని ప్రధాన రహదారాలపై జోరుగా చేపల విక్రయాలు జరుగుతుంటాయి. అంతేగాక మత్స్యకారులు ఇక్కడి నుంచి నగరానికి చేపలు తరలించి అక్కడ విక్రయిస్తుంటారు. మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ఉండటంతో చేపల పెంపకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది.

సామర్థ్యం ప్రకారం చేప పిల్లల పంపిణీ

వానాకాలం సీజన్‌లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చెరువుల్లోకి నీరు చేరిం ది. ఈ నేపథ్యంలో చేపలు పెంచేందుకు వీలున్న చెరువుల్లో పిల్లలను (సీడ్‌) వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 1,115 చెరువులు ఉన్నాయి. ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురిసిన పక్షంలో జిల్లావ్యాప్తంగా 2.16కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 142 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 134 పురుష సభ్యుల సంఘాలు ఉండగా, మొత్తం 8,336 మంది మత్స్యకారులు ఉన్నా రు. మరో తొమ్మిది మహిళా సంఘాల్లో 593 సభ్యులు ఉన్నారు. వీరంతా చేపల పెంపకం, విక్రయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఉచితంగా ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. గతంలో జిల్లా వ్యాప్తంగా 400 చెరువుల్లో చేపలను పెంచారు. ఈ సీజన్‌లో కూడా నీటి వనరుల నిల్వను బట్టి సుమారు 550 చెరువుల్లో చేపల పెంపకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మత్స్యకారులు చేపలు విక్రయించేందుకు వీలుగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ముందస్తుగానే టెండర్ల ప్రక్రియ

గత ఏడాది చేప పిల్లల పంపిణీకి ఆలస్యంగా టెండర్ల ప్రక్రియ మొదలైంది. చేపపిల్లలను అక్టోబరులో పంపిణీ చేయడంతో చెరువుల్లో చేపలు ఎదగలేదు. దీంతో మత్స్యకారులు అనుకున్నమేర లాభాలను పొందలేకపోయారు. చెరువుల పరిమాణానికి మించి చేపపిల్లలను(సీడ్‌) వేస్తుండటంతో ఆశించిన స్థాయిలో అవి ఎదగక మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే టెండర్లు ఖాయం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత అనుభవాల దృష్ట్యా ఈ సీజన్‌లో చెరువుల్లో నీటినిల్వ ఆధారంగా చేప పిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చెరువుల పరిమాణం, నీటి లభ్యతపై మత్స్యశాఖ సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు నివేదిక అందించాలని తహసీల్దార్లకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో చెరువులు ఉన్నాయి? శిఖం భూమి ఎంత? ఎంతమేరకు నీటినిల్వ ఉంది? అనే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. తహసీల్దార్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా చెరువుల్లో చేపపిల్లలను వదలనున్నారు. జిల్లాలోని చెరువుల్లో కట్ల, రోహు, మ్రిగాల, కామన్‌కార్ప్‌ రకాల సీడ్‌ను, రొయ్య పిల్లలను వదలనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదిక సిద్ధం: రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి

ఈ ఆర్థిక సంవత్సరంలో చేపల పెంపకానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీడ్‌ పంపిణీపై నివేదిక రూపొందించాం. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నాం. ప్రభుత్వం చేపట్టే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడనుంది. ఈ పథకాన్ని మత్స్యకారులంతా వినియోగించుకోవాలి.

Updated Date - Aug 16 , 2025 | 01:01 AM