సర్కారు ఆసుపత్రి..సమస్యల లోగిలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:38 AM
గతమెంతో ఘనం అభివృద్ధి శూన్యం అన్న చందంగా మారింది రామన్నపేట ప్రభుత్వాస్పత్రి పరిస్థితి..
పెచ్చులూడుతున్న భవనంపైకప్పు
నెరవేరని 100పడకల హామీ
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
తగ్గిన కాన్పులు
రామన్నపేట, జూన 17 (ఆంధ్రజ్యోతి): గతమెంతో ఘనం అభివృద్ధి శూన్యం అన్న చందంగా మారింది రామన్నపేట ప్రభుత్వాస్పత్రి పరిస్థితి.. 1970లో ప్రారంభమైన గత 50 సంవత్సరాలుగా పాత నియోజకవర్గ కేంద్రంగా ఏడు మండలాలకు అనేక గ్రామాలకు వైద్యం అందించి మెరుతైన సేవలందించిన ప్రభుత్వ ఆస్పత్రి నేడు శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతూ భవనం ప్రమాదకరంగా మారింది. కనీస వైద్య సదుపాయాలు అందక రోగులకు సరిపడా డాక్టర్లు లేక ప్రాంత పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. గత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిగా మారుస్తామని బోర్డు పెట్టిన బోర్డు కూడా శిథిలావస్థకు చేరి పాడైపోయింది తప్ప 50 పడకలకు మాత్రమే పరిమితమైంది. ఎంతమందికి ఆరోగ్య ప్రదాయినిగా నిలిచిన రామన్నపేట ఆసుపత్రిలో ప్రస్తుతం సమస్యలు తాండవం చేస్తున్నాయి. రోజుకు సుమారు 400 మంది అవుట్ పేషంట్లు వివిధ సేవల నిమిత్తం ఆసుపత్రిఇకి వస్తుంటారు. కానీ సరిపడ వైద్యులు లేక మెరుగైన సాంకేతిక వైద్య పరికరాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
తగ్గిన ప్రసవాలు
ప్రస్తుతం 22మంది డాక్టర్ పోస్టులు మంజూరు కాగా కేవలం రెగ్యులర్ డాక్టర్లు నలుగురు మరో నలుగురు డిప్యూటేషన మీద వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో ముగ్గురు చిన్న పిల్లల డాక్టరు, అనస్తేషియా, జనరల్ సర్జన, గైనకాలజిస్ట్, ఉన్నారు. గతంలో ప్రతీ రోజు 6 నుండి 8 కాన్పులు జరిగేవి వాటిలో అత్యధికంగా సాధారణ కాన్పులు జరిగేవి. కానీ ప్రస్తుతం నెలకు 15 నుండి 20 మాత్రమే కాన్పులు జరుగుతున్నాయి. ప్రభత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువై నిర్వహణ గాడి తప్పి రోగులకు శాపంగా మారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. వచ్చే రోగులు తాగడానికి మంచినీరు లేక బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఫిట్టింగ్ చేయకుండా నిరుపయోగంగా ఉంచడంతో ఇబ్బందిగా మారుతుంది.
అందుబాటులోకి రాని బ్లడ్‌బ్యాంక్
బ్లడ్ బ్యాంక్ కోసం మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన నూతన బిల్డింగ్ నిర్వహణ లేక అలాగే మిగిలిపోయింది. శిథిలావస్థకు చేరిన భవనంలో, అరకొర వైద్యంతో రోగులు కాలమెలదీస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్టోబర్ 2023 సంవత్సరంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీ్‌షరావు రూ.ఐదు కోట్లతో 50 పడకల నూతన భవనానికి శిలాఫలకం వేసినా.. ఇప్పటికీ అతిగతీ లేదు. అనేక గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రిని వంద పడకలుగా మార్చి నూతన భవన నిర్మిస్తే మెరుగైన వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉందని, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య పెరుగుతుందని ఐసియు ఏర్పాటు అవుతుందని ప్రాంత ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు కోరుతున్నారు.
పడకేసిన పారిశుధ్యం
ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లే నీరు గోడల పరిసర ప్రాంతాల్లోనే నిల్వ ఉండిపోయి జనరల్ వార్డు, ప్రసూతి వార్డుల వద్ద దుర్గదం వ్యాపిస్తోంది. దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పోస్టుమార్టం గది నుంచి మురుగునీరు నిల్వ ఉండిపోయి పరిసరాల్లో కనీసం నిలబడలేని పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ గోడలపై చెట్లు, గడ్డి మొలిచి అడవిని తలపిస్తున్నా పట్టించుకునే వారు లేరని ప్రజలు వాపోతున్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు హాస్పిటల్ ముందు ప్రాంతం చెరువును తలపిస్తోంది.
శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు
హాస్పిటల్ ఉన్న మరుగుదొడ్ల కనీసం డోర్లు సక్రమంగా లేవు. స్ర్తీల వార్డుల్లో ఐదు మరుగుదొడ్లు ఉండగా కేవలం రెండు మాత్రమే పని చేస్తున్నాయి. మూడింటికి తాళాలు వేసి ఉన్నాయి. పురుషుల వార్డు నిరుపయోగంగా ఉండి భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. 14 మంది స్టాఫ్ నర్సులు ఉండగా వారందరికీ ఒకే కామన మరుగుదొడ్డి కావడంతో బయట రోగులకు స్టాఫ్ నర్స్‌లకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ విషయమై గతంలో పలుమార్లు ఆసుపత్రిని సందర్శించిన మంత్రులకు వైద్య ఉన్నత శాఖ అదికారులకు తెలిపినా హామీలు ఇస్తున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి
పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రభుత్వ యంత్రాంగం వైధ్యాధికారుల నిర్లక్ష్యం తగదు. వెంటనే ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు స్పం దించి నూతన భవనానికి నిధులు మంజూరు చేసి, ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలి.
-బొడ్డుపల్లి వెంకటేశం, సీపీఎం మండల కార్యదర్శి
ప్రతిపాదనను పంపించాం
అస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో వంద పడకల స్థాయికి పెంచి నూతన భవనం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ద్వారా వైద్యశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపిం చాం. సరిపడు డాక్టర్లను పరికరాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు కోరాం. త్వరలోనే డాక్టర్లను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు.
-డాక్టర్ చిన్న నాయక్, ఇనచార్జి సూపరింటెండెంట్