Share News

వరద నీటిలో ప్రభుత్వ భవనాలు

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:17 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని ప్రభుత్వ భవనాలు వరద నీటిలో మునిగి పోయాయి. లక్కారం చెరువు నుంచి ప్రవహిస్తున్న అలుగు నీరు ఈ భవనాలలోకి చేరుకుంది.

వరద నీటిలో ప్రభుత్వ భవనాలు
వరద నీటిలో చౌటుప్పల్‌ పాలశీతలీకరణ కేంద్రం

ఆర్డీవో, ఎంపీపీ కార్యాలయ భవనాలు సురక్షితం

పాలశీతలీకరణ కేంద్రం మూసివేత

చౌటుప్పల్‌ టౌన, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలోని ప్రభుత్వ భవనాలు వరద నీటిలో మునిగి పోయాయి. లక్కారం చెరువు నుంచి ప్రవహిస్తున్న అలుగు నీరు ఈ భవనాలలోకి చేరుకుంది. దీంతో భవనాలు వరద నీటిలో ఉండడంతో అందులోకి రాకపోకలు నిలిచి పోయాయి. టీటీడీ కల్యాణ మండపం, తహసీల్దార్‌ కార్యాలయ భవనాలు గత కొంత కాలంగా నిరూపయోగంగా ఉండగా, మినీ పాలఽశీతలీకరణ కేంద్రం మాత్రం వినియోగంలో ఉంది. దీనిలోకి వరద నీరు చేరడంతో తాత్కాలికంగా మూసి వేసి మరోక ప్రాంతం నుంచి పాల సేకరణ చేస్తున్నారు. ఈ భవనాలు వరద నీటి నుంచి బయట పడేందుకు చాల కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చౌటుప్పల్‌ చెరువులోకి వరద నీరు ప్రవహించి అలుగు పారుతోంది. లక్కారం చెరువు అలుగు నీటితో పాటు తంగేడు వనం నుంచి వస్తున్న వరద నీరు ఈ చెరువులోకి చేరుకుంటోంది.

30 సంవత్సరాల క్రితం

చెరువు అంచు భాగంలో 30 సంవత్సరాల క్రితం టీటీడీ కల్యాణ మండపం, పాల శీతలీకరణ కేంద్రం, తహసీల్దార్‌, మండల పరిషత కార్యాలయ భవనాలను అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మాణం చేయించారు. 2005, 2020, 2021, 2022ల లో కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పారింది. చెరువు నిండిన సమయాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నీట మునగడం, మళ్లీ తేలేంత వరకు ఇతర ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నిర్వహించడం రివాజుగా మారింది. 2005, 2020 లలో కురిసిన భారీ వర్షాలకు తహసీల్దార్‌ కార్యాలయంలోకి చేరిన వరద నీటితో రెవెన్యూ రికార్డులు తడిసి చినిగి పోయాయి. ప్రస్తుతం కొన్ని గ్రామాలకు చెందిన రెవెన్యూ రికార్డులు లేవు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు గాను తహసీల్దార్‌ కార్యాలయాన్ని 2020 అక్టోబరులో అద్దె భవనంలోకి మార్చారు. దీంతో నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ తహసీల్దార్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. నీట మునిగిన ఈ భవనం ప్రస్తు తం విష సర్పాలకు నిలయంగా మారింది. చుట్టూ చెట్లు పెరడంతో భవనం కనిపించని పరిస్థితి ఏర్పడింది. టీటీడీ కల్యాణ మండపం కొంత కాలంగా నిరూపయోగంగా ఉంటోంది. ఉపయోగంలో ఉన్న పాలశీతలీకరణ కేంద్రంలోకి వరద నీరు చేరడంతో తాత్కాలికంగా మూసి వేసి మరో ప్రాంతం నుంచి పాల సేకరణ చేస్తున్నారు.

వరద నీటి ని మళ్లీంచడంతో..

మండల పరిదిలోని దండు మల్కాపురం వద్ద లక్కారం చెరువు కాలువ నుంచి ప్రవహించే వరద నీటి ని చిన మూసీ నదిలోకి మళ్లీంచడంతో ఆర్డీవో, మండల పరిషత కార్యాలయాలకు నీటి ముప్పు తప్పింది. దానితో పాటుగా ఈ కార్యాలయ భవనాల ప్రహరీ గోడ చుట్టూ మట్టి కట్ట వేయడంతో చెరువు నీరు లోపలికి రాలేదు. చెరువు లోని అయ్యప్ప స్వామి దేవాలయానికి చుట్టు కాంక్రీట్‌ గోడ నిర్మించడంతో సురక్షితంగా ఉంది. చెరువు అలుగు నీరు దిగువకు పారుతుండడంతో ఈ మూడింటికీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మండల పరిషత కార్యాలయ ఆవరణలోకి చెరువు ఊట నీరు వస్తుంది. ఇది ఇలా ఉండగా, కలెక్టర్‌ ఆదేశాలతో మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని చెరువు అలుగు కింది భాగంలో తవ్వించిన కాల్వ ద్వారా నీరు సజావుగా దిగువకు వెళుతుండడంతో ఆర్డీవో, ఎంపీపీ కార్యాలయాలకు నీటి ముప్పు తప్పింది. పక్షం రోజుల నుంచి 24 గంటలు మునిసిపల్‌ కమిషనర్‌ పని చేస్తూ వరద నీటితో పట్టణానికి ఎలాంటి ముప్పు జరగకుండ సమయస్ఫూర్తిగా వ్యవహరించి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడంపై స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

చెరువులో మునిగిన హిందూ శ్మశాన వాటిక

చెరువు నీటిలో హిందూ శ్మశాన వాటిక మునిగి పోయింది. పూర్వ కాలం నుంచి కొనసాగుతున్న శ్మశానంలో దాతల విరాళాలతో పక్కా శ్మశాన వాటికను నిర్మించారు. ఈ శ్మశాన వాటిక చెరువు నీటిలో మునిగి పోవడంతో ప్రత్యామ్నాయంగా దహన సంస్కారాలను మరోక ప్రాంతంలో చేసే అవకాశాలు ఉన్నాయి.

చెరువులో తగ్గిన నీటి సామర్థ్యం

చెరువు ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, దేవాలయం, శ్మశాన వాటికలు నిర్మించి మట్టి పోయడంతో నీటి సామర్థ్యం తగ్గింది. అందులోనూ కార్యాలయాల మధ్య నుంచి లక్కారం తదితర కాలనీలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కూడా చేశారు. వీటితో 20నుంచి 25శాతం మేరకు చెరువు ఎఫ్‌టీఎల్‌ తగ్గింది. ఇంకా చెప్పాలంటే చెరువు కాస్తా కుంటగా మారిందన్న అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పరిశీలన

చెరువు నీటిలో మునిగిన శ్మశాన వాటికకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతం దహన సంస్కారాలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యలు చేపడతాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదేశంతో శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన ప్రతి పాదనలను పరిశీలన చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను జరగనివ్వం.

-గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌, చౌటుప్పల్‌

చెరువు నీటిలో మునిగిన శ్మశాన వాటికకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతం దహన సంస్కారాలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యలు చేపడతాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదేశంతో శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన ప్రతి పాదనలను పరిశీలన చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను జరగనివ్వం.

-గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌, చౌటుప్పల్‌

Updated Date - Nov 01 , 2025 | 12:17 AM