Share News

హామీలను నెరవేర్చేనా?

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:20 AM

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభంకానున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో పథకాలు, నిధులు మంజూరు చేయిస్తారని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

హామీలను నెరవేర్చేనా?

పలు పథకాలకు నిధులు సాధించాలని ప్రజల వేడుకోలు

నిధులు వచ్చినా పనులు వేగంగా పూర్తిచేయాలని విన్నపం

అన్ని హామీలకు ఈ ఏడాది నిధులివ్వాలని డిమాండ్లు

నేటి నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభంకానున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో పథకాలు, నిధులు మంజూరు చేయిస్తారని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన స్థానిక హామీలకు కార్యరూపం ఇవ్వాలని కోరుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో గత ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రధాన హామీలపై ప్రత్యేక కథనం..

కీలక హామీలు అమలవుతాయని ఆశాభావం

ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పూర్తిచేసి ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరందించే ఎస్‌ఎల్‌బీసీ పథకానికి గత బడ్జెట్‌లోనూ భారీగా నిధులివ్వడంతో పాటు 2019 నుంచి నిలిచిన పనులను ఇటీవలే ప్రారంభించారు. అయితే టన్నెల్‌ పనుల్లో ప్రమాదం నెలకొనడంతో ప్రస్తుతం పనులు నిలిచినా, త్వరలో ప్రారంభిస్తామని మంత్రులు ప్రకటించారు. ఏఎమ్మార్పీ కింద ప్రధాన కాల్వను విస్తరించి లైనింగ్‌ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగమైన బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పనులు పూర్తికాగా, కాల్వల పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఆరేడు నెలల్లో ఈ పథకం పూర్తిగా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తిచేస్తారని ఆశిస్తున్నారు. వీటితో పాటు డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మాణంలో ఉన్న ఏడు రిజర్వాయర్ల పనులు చురుగ్గా సాగుతుండగా, మునుగోడు నియోజకవర్గంలో కాల్వల పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ పథకానికి నీరందించే ఏదుల-డిండి అనుసంధాన పథకానికి భారీగా నిధులు తెచ్చి పనులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. వీటికితోడు మూసీ కాల్వలైన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, అసి్‌ఫనహర్‌, తదితర కాల్వలు ఇప్పటికే రూ.450కోట్ల నిధులు మంజూరవగా, ఈ పనులన్నింటినీ త్వరలో చేపట్టేందుకు అవసరమైన ఒత్తిడిని ఎమ్మెల్యేలు తీసుకురావాలని కోరుతున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని దశలవారీగా పూర్తిచేయాలని, దేవరకొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజవర్గాల్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు మరింత సీరియ్‌సగా దృష్టిసారించాలని కోరుతున్నారు. వీటితో పాటుగా ఇతర హామీలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు మననం చేసుకొని నిధులు సాధించడంతో పాటు, పనుల పురోగతికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా పెండింగ్‌ ఉన్న డబుల్‌రోడ్ల నిర్మాణాలు, సింగిల్‌రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నారు.

భువనగిరి నియోజకవర్గం

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఇన్‌పేషంట్‌ వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

నందనంలో నీరా తాటి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీని నెరవేర్చాల్సి ఉంది.

జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

పోచంపల్లి, భువనగిరి ఖిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికను అమలుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

మునుగోడు నియోజకవర్గం

శేషిలేటి ఫీడర్‌ ఛానల్‌, వెల్మకన్నె ఫీడర్‌ ఛానల్‌ పనులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

మునుగోడు మండల కేంద్రంలో డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఏర్పాటు, చౌటుప్పల్‌లో డిగ్రీ, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది.

మునుగోడు పీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌కు హామీ ఇచ్చారు.

నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో స్థానికులకు ఉపాధి కల్పించే అంశంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రాచకొండ గుట్టల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలిప్పిస్తామనే హామీ నెరవేర్చాల్సి ఉంది.

నకిరేకల్‌ నియోజకవర్గం

అమ్మనబోలు, వెలిమినేడు మండలాల ఏర్పాటు డిమాండ్‌ ఉంది.

రామన్నపేట ఏరియా ఆస్పత్రి 100పడకలకు అప్‌గ్రేడ్‌కు హామీ ఇచ్చారు.

నకిరేకల్‌లో పలు పరిశ్రమల ఏర్పాటు, వీటి ద్వారా యు వతకు ఉపాధి కల్పించాలని యువకులు కోరుతున్నారు.

పోటీపరీక్షల నిమిత్తం విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఆలేరు నియోజకవర్గం

100 రోజుల్లోపు ఆలేరును రెవె న్యూ డివిజన్‌గా మారుస్తామని ఎమ్మె ల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాల్సి ఉంది.

ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగు, తాగు నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సి ఉంది.

యాదగిరిగుట్టపై స్థానికులకే ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది.

పలు కల్వర్టులపై బ్రిడ్జిల నిర్మా ణాన్ని పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజ లు కోరుతు న్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం

మోత్కూరులో ఆర్టీసీ డిపో, 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు డిమాండ్‌ను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.

మోత్కూరులో డిగ్రీ, అడ్డగూడూరులో ఐటీఐ కళాశాలల ఏర్పాటు హామీని నెరవేర్చాల్సి ఉంది.

మోత్కూరు-బిక్కేరు వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికలు డిమాండ్‌ చేస్తున్నారు.

తుంగతుర్తిలో రుద్రమచెరువును రిజర్వాయర్‌గా మార్చడం, పెండింగ్‌లో ఉన్న 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విన్నవిస్తున్నారు.

సూర్యాపేట నియోజకవర్గం

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

కార్మికుల ప్రయోజనార్థం ఆటోనగర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.

ఐటీ పార్క్‌కు శాశ్వత భవనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

కోదాడ నియోజకవర్గం

గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.

మట్టి మాఫియాను అరికట్టాలని డిమాండ్‌ ఉంది.

అన్ని గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.

ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని రైతులు వేడుకుంటున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా డబ్బాల తొలగింపు చేపట్టాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం

మోడల్‌ కాలనీ పూర్తిచేయాల్సి ఉంది.

ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతీ ఎకరాకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మట్టపల్లి-జాన్‌పహాడ్‌- మేళ్లచెరువు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే డిమాండ్‌ ఉంది.

నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ రహదారులన్నింటినీ పునర్నిర్మాణం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

నల్లగొండ నియోజకవర్గం

నల్లగొండ పట్టణంలో బైపా్‌సరోడ్డు, లతీ్‌ఫసాబ్‌ గుట్ట, బ్రహ్మంగారి గుట్టపైకి వేర్వేరుగా ఘాట్‌ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన హామీ అమలు కోసం ఇప్పటికే నిధుల కేటాయింపు జరిగింది. ఈ పనులను వేగవంతం చేయాల్సి ఉంది.

పొనుగోడు చెరువుకు మంజూరైన ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

తిప్పర్తి మండల కేంద్రంలో పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది.

నకిరేకల్‌-పర్చూరు-నల్లగొండ డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

నిర్మాణంలో ఉన్న ఏటీసీ సెంటర్‌ పనులు వేగంగా పూర్తిచేయాల్సి ఉంది.

దేవరకొండ నియోజకవర్గం

ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పెండ్లిపాకల రిజర్వాయర్లు పూర్తిచేయాల్సి ఉంది.

పీఏపల్లి, చందంపేట మండలాల్లో గుట్టల్లో ఉన్న ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందించాలని స్థానికులు కోరుతున్నారు.

దేవరకొండ ఖిల్లా, దేవరచర్ల శివాలయాలను, పెద్దమునిగల్‌ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ ఉంది.

దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయించాల్సి ఉంది.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గం

హాలియాలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నిడమనూరులో స్టేడియం నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని దశలవారీగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

తిరుమమలగిరి సాగర్‌ మండలంలో పోడు భూములు సాగుచేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ ఏళ్లుగా ఉంది.

పలు గ్రామీణ, మండలాల అనుసంధాన రోడ్లను పునర్నిర్మించడంతోపాటు కొన్ని రోడ్లను డబుల్‌ లేన్లుగా మార్చాల్సి ఉంది.

మిర్యాలగూడ నియోజకవర్గం

నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది.

నిర్మాణంలో ఉన్న నాలుగు ఎత్తిపోతల పథకాల పూర్తికి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

పట్టణానికి నలువైపులా నాలుగు వెహికల్‌ అండర్‌పా్‌సల ఏర్పాటు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు యువత ఎదురుచూస్తోంది.

గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:20 AM