Share News

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:18 AM

వాహనం అతివేగంగా వెళుతూ ముందు ఉన్న గొయ్యిని దాటే సన్నివేశం సినిమాల్లో చూస్తుంటాం.. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామశివారులో అదే తరహా సంఘటన జరిగింది.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
కందిబండ శివారులో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి ముందుకు వెళ్లి ఆగిన లారీ

మేళ్లచెర్వు, జూన 16 (ఆంధ్రజ్యోతి): వాహనం అతివేగంగా వెళుతూ ముందు ఉన్న గొయ్యిని దాటే సన్నివేశం సినిమాల్లో చూస్తుంటాం.. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామశివారులో అదే తరహా సంఘటన జరిగింది. ఈఘటనలో లారీడ్రైవర్‌ క్షేమంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కందిబండ గ్రామ శివారులో వంతెన నిర్మాణంలో ఉన్నందున వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా ఓ డైవర్షన రోడ్డును ఏర్పాటు చేశారు. వంతెన నిర్మాణంలో భాగంగా వరద కాల్వ కోసం 10అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతులో తవ్వారు. మేళ్లచెర్వు నుంచి సిమెంట్‌ లోడుతో ఓ లారీ కోదాడ వైపు వెళుతోంది. వంతెన పక్కన డైవర్షన రోడ్డును గమనించని డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ వరద కాల్వ కోసం తవ్విన 10అడుగుల వెడల్పున ఉన్న గోతిని దాటి ముందుకు వెళ్లి వరద కాల్వకు, వంతెన నిర్మాణానికి మధ్యలో నిలిచింది. ఈ ఘటనలో వాహనం ముందు చక్రాలతో పాటు డీజిల్‌ ట్యాంక్‌, కమాన కట్టలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంత ప్రమాదం జరిగినా లారీ డ్రైవర్‌ క్షేమంగా బయటపడ్డాడు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిని తలపించేలా లారీ నిలిచిన తీరు చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 17 , 2025 | 12:19 AM