హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:15 AM
విజయదశమి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
చౌటుప్పల్ టౌన/ చౌటుప్పల్ రూరల్/ బీబీనగర్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): విజయదశమి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65వ నం బరు జాతీయ రహదారి మీదుగా వాహనాల న్నీ పట్నం నుంచి పల్లెలవైపు బారులు తీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద దసరా రద్దీ నెలకొంది. టోల్‌గేటు వద్ద వాహనాలు బారులు తీరాయి. 16గేట్లకు గాను 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. సాధారణ రోజుల్లో 30వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా దసరా నేపథ్యంలో 20వేల వాహనాలు అదనంగా బయలు దేరాయి. యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని ఎనహెచ-163రహదారి(హైద్రాబాద్-భూపాపల్లి) గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగింది. సాధారణ రోజుల్లో 19వేల వాహనాలు రాకపోకలు కొనసాగించగా, బుధవారం అదనంగా మరో నాలుగు వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. సాధారణ రోజుల్లో 19వేల నుంచి 21వేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండగా దసరా పండుగ సందర్భంగా 23వేల నుంచి 25వేల వాహనాలు టోల్‌ప్లాజా గుండా రాకపోకలు కొనసాగించి ఉంటాయని బీబీనగర్ టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. వాహనాదారులకు ఇబ్బందులు కలగకుండా వరంగల్ వైపు ఉన్న 6టోల్ గేట్లకు అదనంగా 2గేట్లను తెరిచి వాహనాలను పంపించారు.