పరిచయం పెంచుకుని నకిలీ బంగారంతో మోసం
ABN , Publish Date - May 14 , 2025 | 12:06 AM
పరిచయం పెంచుకుని నకిలీ బంగారం విక్రయించిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రంలో జరిగింది.
మేళ్లచెర్వు, మే 13 (ఆంధ్రజ్యోతి) : పరిచయం పెంచుకుని నకిలీ బంగారం విక్రయించిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రంలో జరిగింది. బాధితులు, ఎస్‌ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల క్రితం పావురాలు, కౌజుపిట్లలు పట్టే ముగ్గురు మేళ్లచెర్వు మండలకేంద్రానికి చెందిన శంభిరెడ్డికి పరిచమయ్యారు. తాము ఆంధ్రప్రదేశ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన వాళ్లమని పిట్టలు పట్టుకొని జీవనం సాగిస్తామని, తక్కువ ధరకు అందిస్తామని తెలిపి ఫోననెంబర్ తీసుకొని ఒకటి, రెండుసార్లు కౌజు పిట్టలను అందించి పరిచయం పెంచుకున్నారు. 20 రోజుల క్రితం తమ సమీప బంధువు ఎక్స్‌కవేటర్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా అతడికి వ్యవసాయ పొలంలో భారీగా బంగారం దొరికిందని, కావాల్సిన వారికి తక్కువ ధరకు అందిస్తామని పదేపదే శంభిరెడ్డికి ఫోన చేశారు. 15 రోజుల కిందట సదరు వ్యక్తుల ఫోనకు స్పందించిన శంభిరెడ్డి అనంతపురం జిల్లా వెళ్లగా ఆయనకు శాంపిల్‌గా కొంత బంగారం ఉచితంగా అందజేశారు. ఆ బంగారాన్ని ఆయన మేళ్లచెర్వుకు తీసుకువచ్చి పరీక్షించగా మేలిమి బంగారం అని తేలిందని చెప్పారన్నారు. గత వారం రోజుల కిందట మరోసారి అనంతపురం జిల్లాకు వెళ్లి రూ.3 లక్షలతో బంగారం కొనుగోలు చేసి, దానిని స్థానికంగా తీసుకువచ్చి పరిశీలించినట్లు శంభిరెడ్డి తెలిపారు. నకిలీ బంగారం అని తేలటంతో తాను మోసపోయానని గ్రహించి స్థానిక పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శంభిరెడ్డి తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పరమేష్ తెలిపారు.