వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:05 AM
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్ : నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..
భూదాన్‌పోచంపల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మం డలం వంకమామిడి గ్రామంలో బుధవారం సాయంత్రం బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో యువతి మృతి చెందింది. సీఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన రాధారపు మానస(20)భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో బేసిక్ కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. బుధవారం సాయంత్రం శిక్షణ అనంతరం ఆమె గ్రామానికి వెళ్ల డానికి పోచంపల్లి వరకు ఆటోలో వచ్చింది. అయితే పోచంపల్లిలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న పెద్దనాన్న కుమారుడు బాలకృష్ణకు ఫోన్‌చేసి ఇద్దరు బైక్‌పై బయలు దేరారు. ఈక్రమంలో వంకమామిడి గ్రామశివారులోని శ్మశానవాటిక వద్ద అదే గ్రామానికి చెందిన చెక్క లింగస్వామి టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో మానసకు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా బాలకృష్ణ, బైక్‌పై నుంచి పడడంతో అతడి ఎడమ చేయి విరిగింది. నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు ..
తుర్కపల్లి : మండలంలోని వాసాలమర్రి కమాన్ వ ద్ద భువనగిరి- గజ్వేల్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెం దాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పార్వతి భిక్షపతి (35) సా యంత్రం తుర్కపల్లి నుంచి స్వగ్రామం వీరారెడ్డిపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. వాసాలమర్రి కమాన్ వద్ద కొండాపూర్‌వైపు నుంచి అతివేగంగా వెళ్లిన గుర్తు తెలియని వాహనం కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు భువనగిరి జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని వృద్ధుడు..
కనగల్ : రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, హెడ్ కానిస్టేబుల్ రశీద్ తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన షేక్‌యాసిన్ మియా-హలీమా దంపతులు 15 ఏళ్ల క్రితం దర్వేశిపురం వలస వచ్చి ఇక్కడే మిఠాయి దుకాణం నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో యాసిన్ మియా దుకా ణం అవతలి వైపునకు వెళ్తూ రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమ ంలో నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి చెందిన చిలకల అనిల్ దేవరకొండ నుంచి స్వగ్రామం బుద్దారానికి పల్సర్ పై వేగంగా వస్తూ యాసిన్‌మియాను(75) బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో యాసిన్ మియా కాలువిరిగి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం 108లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొం దుతూ కొద్దిసేపటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రఫీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సబ్యులకు అందజేస్తామన్నారు.
మిర్యాలగూడలో గొర్రెల వ్యాపారి..
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండజిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల వ్యాపారి మృతి చెం దాడు. స్థానికులు, రూరల్ ఎస్ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారి పగడాల శ్రీనివాసరెడ్డి(55) వృత్తిలో భాగంగా బైక్‌పై హాలి యా వైపు వెళ్లి స్వగ్రామమైన తుంగపాడు వద్దకు చేరుకున్నాడు. ఇంటికి సమీపంలో రోడ్డుదాటుతుండగా హాలి యా నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరెడ్డి తన వాహనం పైనుంచి ఎగిరి కారు అద్దాలపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విష యం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
న్యాయం చేయాలని రాస్తారోకో
కాగా న్యాయం కోసం గ్రామస్తులు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై మృతదేహంతో సుమారు అర్థగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి విషమంగా మారడంతో డీఎస్పీ రాజశేఖర్‌రాజు తుంగపాడు గ్రామానికి చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు స్థానికుల ను సముదాయించడంతో ఆందోళన విరమించుకున్నారు.