ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో నాలుగు నల్లగొండకే
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:32 AM
రాష్ట్ర రాజకీయాలకు మలుపు కేంద్రంగా మారిన నల్లగొండకే రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదింటికి నలుగురు అభ్యర్థులు నల్లగొండ జిల్లా వారే ఉన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అభ్యర్థిత్వాలు ఖరారుచేసిన కాంగ్రెస్
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజు స్వస్థలం నల్లగొండ
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): రాష్ట్ర రాజకీయాలకు మలుపు కేంద్రంగా మారిన నల్లగొండకే రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదింటికి నలుగురు అభ్యర్థులు నల్లగొండ జిల్లా వారే ఉన్నారు. అధికార కాంగ్రెస్ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్ల గొండ జిల్లాకు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్ కాగా, మిత్ర పక్ష సీపీఐ అభ్యర్థిత్వం సైతం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యానికి దక్కింది. వీరితోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకున్న దాసోజు శ్రవణ్‌కుమార్ సైతం నల్ల గొండ బిడ్డే కావడం విశేషం. మొత్తంగా ఏక సమయంలో వేర్వేరు వేదికల ద్వా రా నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు పెద్దల సభకు వెళ్లేందుకు అవకాశం దక్కించుకోవడం ద్వారా జిల్లా ప్రతిష్ట ఇనుమడింపజేశారనే చర్చ సాగుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అతిభారీ మెజార్టీలు అందించిన నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు దళిత, గిరిజన నాయకులను ఏక సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికచేసి పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంపొందించింది. శనివారం ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు నల్లగొండకు చెందినవారే ఉండడం కాంగ్రె్‌సను మిక్కిలిగా ఆదరించిన నల్లగొండ జిల్లాకు ప్రభుత్వంలోనూ అంతేస్థాయిలో ప్రాధాన్యమిచ్చి, నల్లగొండ గౌరవాన్ని ఇనుమడింపజేసిందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్‌కు అవకాశం దక్కింది. ఈ నేతలిద్దరికీ అవకాశం రావడం పార్టీలో సామాన్య కార్యకర్తలకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు.
సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన శంకర్‌నాయక్
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన కేతావత్ శంకర్‌నాయక్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. శంకర్‌నాయక్ తండ్రి వీర్యానాయక్ సైతం దిలావర్‌పూర్ సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ప్రభావంతో చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ కలిగిన శంకర్‌నాయక్ అంచలంచెలుగా ఎదిగారు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచి స్థానిక రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే వరకూ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఏదో ఒక పదవి నిర్వర్తిస్తూ వచ్చారు. తొలుత మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధిగానూ తనదైన ప్రత్యేకతను చాటుతూ వచ్చారు. ఉమ్మడి దామరచర్ల మండలానికి 2001లో జనరల్ స్థానం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత 2006లో స్వగ్రామం నుంచి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతోపాటు, జనరల్ స్థానంలోనే మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే క్రమంలో తిరిగి 2014లో మళ్లీ జనరల్ స్థానం నుంచే జడ్పీటీసీగా గెలుపొందారు. ఇలా మూడు పర్యాయాలూ జనరల్ కేటగిరీ నుంచే బరిలో నిలిచి గెలుపొంది సత్తాచాటారు. అదే స్ఫూర్తితో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా, కీలకనేతల ఆశీస్సులున్నా అప్పటి సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్ దక్కలేదు. జడ్పీలో తనకు సమకాలికులైన బాలూనాయక్, చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేలుగా రాణిస్తున్న క్రమంలో కొంత మదనపడిన సందర్భాలూ ఉన్నాయని, అన్నింటికీ ఓర్చుకొని పార్టీకి విధేయుడిగా ఉన్నందువల్లే ప్రస్తుతం అధిష్ఠానం ఈ అవకాశమిచ్చిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. సమీప బంధువైన దివంగత ఎమ్మెల్యే డి.రాగ్యానాయక్ స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగించిన శంకర్‌నాయక్ అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి ప్రియశిష్యుడిగా పేరుగాంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డి అనుచరవర్గమంతా ఎమ్మెల్యే భాస్కర్‌రావు సహా బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లినా శంకర్‌నాయక్ మాత్రం జానారెడ్డినే అంటిపెట్టుకొని ఉండడం ఆయనకు మరింత సన్నిహితుడిగా మార్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యువజన నాయకుడి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో, ప్రజాప్రతినిధిగానూ చురుగ్గా పనిచేస్తున్న క్రమంతోపాటు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో, అప్పటి అధికార పార్టీ నుంచి అవకాశాలిస్తామనే పిలుపునిచ్చినా వాటిని తిరస్కరించి కాంగ్రె్‌సలోనే కొనసాగిన నేపథ్యంలో జిల్లా దిగ్గజనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికీ శంకర్‌నాయక్ సన్నిహితులయ్యారు. ఈక్రమంలోనే విభజన తర్వాత అతిపెద్ద జిల్లాగా మారిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శంకర్‌నాయక్‌కు అందరి ఆమోదంతో అవకాశం ఇచ్చారు. 2019లో డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శంకర్‌నాయక్ అప్పటినుంచి ఇప్పటివరకు జిల్లా నాయకులందరికీ తలలో నాలుకలా ఉంటూ తనదైనశైలిలో అందరినీ సమన్వయం చేస్తూ వస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వచ్చిన హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా శంకర్‌నాయక్ వ్యవహరించడం ఉమ్మడి జిల్లా నేతలందరితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు నేతలందరి ఏకాభిప్రాయంతో శంకర్‌నాయక్ ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారని, ఇకముందు కూడా ఇదే శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలమన్ననలు అందుకోవాలని కాంగ్రె్‌సశ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమనేతగా దయాకర్‌కు ప్రత్యేక గుర్తింపు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్‌కు చెందిన డాక్టర్ అద్దంకి దయాకర్ విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉండేవారు. సామాన్య దళితకుటుంబానికి చెందిన దయాకర్ కష్టపడి చదువుకొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి విద్యార్థి జేఏసీ నాయకుడిగా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. జేఏసీలో క్రియాశీలకవక్తగా పేరు సాధించడంతో పాటు, విద్యార్థి జేఏసీకి కన్వీనర్‌గానూ పనిచేసి ఉద్యమంలో ముందంజలో ఉండిపోరాడారు. ఉద్యమ సందర్భంలో పెద్దసంఖ్యలో కేసులు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో లాఠీ దెబ్బలు సైతం తిన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రె్‌సలో చేరిన అద్దంకి దయాకర్‌కు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికలో దయాకర్ 2,379 ఓట్ల తేడాతో గాదరి కిషోర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తిరిగి 2018 ఎన్నికల్లోనూ గాదరి కిషోర్‌కుమార్ చేతిలోనే 1,847 ఓట్ల తేడాతో సీటుని చేజార్చుకున్నారు.
ఫ దయాకర్ కాంగ్రె్‌సలో చేరిన నాటి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన టీవీ చర్చల్లో పాల్గొంటూ కాంగ్రెస్ వాణిని సమర్ధవంతంగా వినిపించే వారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఆనాడు డాక్టర్ వడ్డెపల్లి రవి, అద్దంకి దయాకర్‌లో టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోలేక చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అప్పగించారు. రాహుల్ గాంధీ వారిద్దరిని ఢిల్లీకి పిలిపించి స్వయంగా మాట్లాడి దయాకర్‌కే తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేశారు. అప్పుడు వడ్డెపల్లి రవి రెబెల్‌గా పోటీ చేయడంతో దయాకర్ రెండో సారి బీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయారు. 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించారు. మాల, మాదిగ సామాజిక వర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో ఆ ఎన్నికల్లో దయాకర్‌కు టికెట్ దక్కలేదు.
ఫ ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవడం, ఆ సమయంలో పార్టీ షోకాజ్ నోటీసులివ్వగా, ఆతర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతోపాటు, ఆ నేతలకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. 2023 ఎన్నికల్లో దయాకర్‌కు టిక్కెట్ నిరాకరించిన అధిష్ఠానం ఆయన స్థానంలో మందుల సామేల్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించింది. ఆ సమయంలో అధిష్ఠానం ముఖ్యనేతలిచ్చిన హామీ మేరకు దయాకర్ ఆ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలో దయాకర్‌కు అభ్యర్థిత్వం ఇస్తారని భావించినా సమీకరణాల్లో అవకాశం చేజారగా, తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి దయాకర్‌ను ఎంపిక చేసి అధిష్ఠానం ఆయన విధేయతకు అవకాశమిచ్చింది.
కాంగ్రెస్ మిత్రపక్షం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్ర పక్షం సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సత్యం స్వస్థలం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎలగలగూడెం గ్రామం కాగా, విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పెనవేసుకుపోయారు.
దాసోజు శ్రవణ్ కూడా నల్లగొండ బిడ్డే
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన దాసోజు శ్రవణ్‌కుమార్ నల్లగొండ పట్టణానికి చెందినవారు. పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన దాసోజు శ్రవణ్ బాల్యమంతా ఇక్కడే గడిచింది. శ్రవణ్ తండ్రి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసేవారని, శ్రవణ్ ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నారు.
సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం : కేతావత్‌శంకర్‌నాయక్
కాంగ్రెస్ అతిసామాన్య కార్యకర్తగా ఉన్న నాలాంటి గిరిజన బిడ్డకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పార్టీ విధేయతకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఈఅవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు.
ఫ శంకర్‌నాయక్ బయోడేటా:
8 పేరు : కేతావత్ శంకర్‌నాయక్
8 తండ్రి: వీర్యానాయక్ (మాజీ సర్పంచ్)
8 కులం: ఎస్టీ (లంబాడ)
8 స్వగ్రామం: కేతావత్‌తండా, దిలావర్‌పూర్ (పోస్టు), దామరచర్ల మండలం
8 విద్యార్హత: బీఏ 8 రాజకీయపదవులు: రెండుపర్యాయాలు జడ్పీటీసీ సభ్యుడు, ఒక పర్యాయం ఎంపీపీ పదవి
8 మండలకాంగ్రెస్ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
అద్దంకి దయాకర్ బయేడేటా
8 పేరు : అద్దంకి దయాకర్ 8 తండ్రిపేరు: రామలచ్చు
8 స్వగ్రామం: నెమ్మికల్, ఆత్మకూరు(ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా
8 కులం: ఎస్సీ (మాల) 8 విద్యార్హతలు: ఎంకాం,ఎంసీఏ, పీహెచ్‌డీ
8 రాజకీయప్రస్తానం: ఓయూ విద్యార్థి జేఏసీ ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
8 తుంగుతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ, స్వల్పతేడాతో ఓటమి, ప్రస్తుత కాంగ్రెస్ అధికార ప్రతినిధి.