గురుకులాల్లో ఫోన్‌మిత్ర
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:19 AM
వివిధ సంక్షేమశాఖలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఇంటిమీద బెంగతో కొంతమేర ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం కారణంగా వారితో మాట్లాడలేక, వారిని విడిచి ఉండలేక ఇంటిదారి పడుతుంటారు.
ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఏర్పాటు
ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌కార్డ్
ఫోన్‌మిత్రతో విద్యార్థుల్లో తొలగనున్న ఇంటిబెంగ
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట (కలెక్టరేట్) : వివిధ సంక్షేమశాఖలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఇంటిమీద బెంగతో కొంతమేర ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం కారణంగా వారితో మాట్లాడలేక, వారిని విడిచి ఉండలేక ఇంటిదారి పడుతుంటారు. కొంత మంది కళాశాలల్లో ఒంటరితనాన్ని భరించలేక, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఫోన్‌మిత్ర కార్యక్రమానికి ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో శ్రీకారం చు ట్టారు. దీంతో విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ఇంటిపైన బెంగ నుంచి విముక్తి క ల్పించనున్నారు. అందుకోసం యాక్సిస్ బ్యాంకుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకో గా, గురుకుల కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఫోన్లు ఏర్పాటు చేశారు.
ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఫోన్‌మిత్ర పథకాన్ని ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటగా హైదరాబాద్‌లోని గౌలుదొడ్డి గురుకులంలో ఏర్పాటు చేయగా, సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ‘ఫోన్‌మిత్ర’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో గురుకుల కళాశాలలో 640 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ఐదు బాలికల, మూడు బాలుర ఎస్సీ గురుకులాలు ఉండగా, ఈ గురుకులాల్లో మొత్తం 5వేల మందికిపైగా విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు.
స్మార్ట్‌కార్డ్‌లో ముందుగానే ఫోన్ నెంబర్లు
గురుకుల కళాశాలల్లో విద్యనభ్యసించే ప్రతీ విద్యార్థికి ఒక స్మార్ట్‌కార్డ్ అందించారు. అందులో ముందుగానే విద్యార్థి తల్లిదండ్రు ల్లో ఎవరిదైనా ఒకరి ఫోన్ నెంబరుతో పాటు గురుకులాల సొసైటీ రాష్ట్ర కార్యదర్శి నెంబర్‌ను ముందుగానే ఫీడ్ చేశారు. విద్యార్థులు స్మార్ట్‌కార్డ్ ద్వారా వారి తల్లిదండ్రులతో మాట్లాడే అవకా శం ఉంటుంది. ఫోన్లు చేసినందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. గురుకులాల్లోని ప్రతీ 100మంది విద్యార్థులకు ఒక ఫోన్ చొప్పున ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రతీ రోజు వారికి అవసరం అనుకుంటే సాయం త్రం కళాశాల తరగతులు ముగిసిన అనంతరం 4.30 నుంచి రాత్రి 7గంటల వరకు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో క్లాస్‌టీచర్ (హౌస్ పేరెంట్ టీచర్) ఫోన్ ద్వారా మాత్రమే ఎప్పుడో ఒకసారి అత్యవసరం అనుకుంటే మాత్రమే ఫోన్ సదుపాయం ఉండేది. ఇప్పుడు ప్రతీ రోజు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా కళాశాలల్లో ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే గురుకులాల రాష్ట్ర కార్యదర్శికి కూడా ఫోన్‌లో విషయాలను తెలిపే అవకాశం కల్పించారు.
విద్యార్థులకు తొలగనున్న ఇంటిబెంగ
గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేసి ఫోన్‌మిత్ర ద్వారా విద్యార్థుల్లో ఉండే ఇంటిబెంగ తొలగిపోతుంది. చాలా మంది విద్యార్థులు ఇంటి మీద బెంగపెట్టుకుని విద్యపై సరిగా దృష్టి సారించలేక ఇబ్బందులు పడుతుంటారు. అదే విధంగా మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులతో దూరంగా ఉన్నామనే భావన ఉంటుంది. ఇంకా కొంత మంది విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్‌మిత్ర ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్‌పడనుంది. వారి తల్లిదండ్రులతో రోజూ మాట్లాడుతుండడం వల్ల మానసికంగా బాగుంటారు. అంతేగాక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దీంతో పాటు విద్యార్థుల డ్రాపవుట్స్ కూడా తగ్గనున్నాయి.
‘ఫోన్‌మిత్ర’ విద్యార్థులకు ఉపయోగకరం
గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఫోన్‌మిత్ర కార్యక్రమం విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. విద్యార్థినులు రోజువారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుకోవడంతో ఎలాంటి ఇబ్బందులకు గురికావడం లేదు. ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. ఫోన్‌మిత్ర ద్వారా ఇంటిమీద బెంగపోయింది. విద్యార్థినులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నారు. దీంతో విద్యపై దృష్టి సారిస్తున్నారు.
సీహెచ్.పద్మ, ప్రిన్సిపాల్, బాలికల గురుకుల కళాశాల దురాజ్‌పల్లి, సూర్యాపేట