ఆర్థికలావాదేవీనా... వివాహేతర సంబంధమా?
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:37 PM
జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్(37) హత్య ఆర్థిక లావాదేవీలతోనా, వివాహేతర సంబంధం అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

నల్లగొండ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్(37) హత్య ఆర్థిక లావాదేవీలతోనా, వివాహేతర సంబంధం అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ పట్టణంలోని టూటౌన పోలీ్‌సస్టేషన సమీపంలో రామగిరిలోని గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో సురేష్ ఓ మడిగెను అద్దెకు తీసుకొని మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10.45గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అర్జెంట్‌గా అవసరం ఉన్నాయి ఫొటోలు ప్రింట్ వేయాలన్నారు. అయితే సురేష్ సయయం అయిపోయింది వర్కర్లు లేరని చెప్పినప్పటికీ వినకుండా అత్యవసరం ఉన్నాయని చెప్పడంతో సురేష్ మిషన వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దుండగుల్లో ఒకరు సురే్‌షతో ఫొటోలు ఎంత ఫ్రేమ్‌లు ఎంత అని మాటల్లో పెట్టాడు. సురేష్ ఫొటోలు ప్రింట్ చేసే సమయంలో ఇదే అదునుగా భావించిన దుండగులు ఒక్కసారిగా వేట కొడవళ్లతో అతడిపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. గుండెలో పొడవంతో పాటు మెడపై నరికారు. దీంతో సురేష్ అక్కడికక్కడే ఒరిగి ప్రాణాలు విడిచాడు. హత్యకు పాల్పడిన సమయంలో దుండగులు మాస్కులు ధరించినట్లు సమాచారం. దాడి సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్‌ఐ సైదులు హుటాహుటీన వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసులు రామగిరిలోని వివిధ ప్రాంతాలల్లో ఉన్న సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
పక్కా పధకం ప్రకారం హత్య
పక్కా పధకం ప్రకారమే గద్దపాటి సురేష్ హత్య జరిగినట్టు సమాచారం. దుండగులు సురే్‌షను చంపడానికి కొన్నిరోజుల నుంచే పక్కా ప్రణాళికలతో ఉండటంతో పాటు పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పధకం ప్రకారం ముందుగా కలర్ ల్యాబ్ సీసీ కెమెరాలకు సంబంఽధించిన కేబుల్ కట్ చేసినట్లు తెలిసింది. రాత్రి సమయం కావడం, చుట్టు ప్రక్కల షాపులు బంద్ కావడం, ఇదే సమయంలో సురేష్ ఒక్కరే ల్యాబ్‌లో ఉండటంతో, అదే అదునుగా దాడి చేసి హత్య చేశారు. ఇక సురేష్ మిర్యాలగూడ, చిట్యాలలో ఉన్న కలర్ ల్యాబ్‌లలో కూడా వాటాదారుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్థికలావాదేవీలతోనా, ఏవైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రాత్రి సమయంలో చుట్టుప్రక్కల షాపులు మూసి వేయడంతో పాటు సురేష్ ఒక్కడే షాపులో ఉన్నాడని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారు. పాతకక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దుండగులు సురే్‌షను హత్య చేసిన అనంతరం టూవీలర్‌పై పారిపోయి రైల్వేస్టేషన సమీపంలో వాహనాన్ని వదిలి రైలులో వెళ్లిపోయినట్లు కూడా చర్చ సాగుతోంది. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత చంద్రపవార్ ఆదేశాలతో నాలుగు బృందాలు నిందితుల కోసం గాలింపులు చేస్తున్నట్లు తెలిసింది.