Share News

100 పడకల ఆసుపత్రికి తుది మెరుగులు

ABN , Publish Date - May 16 , 2025 | 12:35 AM

చౌటుప్పల్‌ పట్టణంలో వైద్య విదాన పరిషత ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి తుది మెరుగులు దిద్దుకుంటోంది.

100 పడకల ఆసుపత్రికి తుది మెరుగులు

చౌటుప్పల్‌ టౌన, మే 15 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలో వైద్య విదాన పరిషత ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆసుపత్రి స్థలం విస్తరణ పనులు కూడా వేగవంతమవుతున్నాయి. ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని( ఎంఏవో) తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ఉన్న స్థలం ఆసుపత్రికి ఎంతో అవసరంగా మారింది. వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకునేందుకు ఆ శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్‌ 18 న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్‌ హరీష్‌రావు 100 పడకల ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను అప్పటి ప్రభుత్వం రూ. 36 కోట్లను కేటాయించింది. ఆసుపత్రికి భవన సముదాయాన్ని నిర్మించే ప్లానలోనే వ్యవసాయ శాఖ కార్యాలయ భవన స్థలాన్ని కలిపి చూపించారు. ఏడు దశాబ్దాల క్రితం ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలోనే నాలుగు దశాబ్దాల క్రితం వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. కాగా, ఆసుపత్రి స్థలంలో నిర్మించిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని తొలగించడం సబబుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శంకుస్థాపన సమయంలోనే..

100 పడకల ఆసుపత్రి భవన సముదాయానికి అడ్డంగా ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని తొలగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణ శంకుస్థాపన సమయంలోనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు వైద్య విధాన పరిషత అధికారులు సమాచారాన్ని అందించారు. ఆ స్థలాన్ని కలుపుకుని తయారు చేసిన ప్లాన ప్రకారంగానే ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతుంది. ఇక అప్పటి నుంచే కార్యాలయం ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రి ఆవసరాల కోసం ఈ స్థలం ఎంతో ముఖ్యంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా అంబులెన్సల పార్కింగ్‌ కోసం ఈ స్థలాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ కార్యాలయం కంటే ఆసుపత్రి అవసరాలు ఎంతో ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యామ్నయ భవనాల కోసం పరిశీలన

వ్యవసాయ శాఖ కార్యాలయం ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనాల కోసం ఏవో నాగరాజు పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందు బాటులో లేకుంటే రైతు వేదికలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఏవో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అద్దె భవనాల కంటే రైతు వేదికనే అన్ని విధాలుగా మేలు అని ఏవో భావిస్తున్నారు.

అందుబాటులో పాత సమితి భవన సముదాయం

ప్రస్తుతం పాత సమితి కార్యాలయ భవన సముదాయం నిరుపయోగంగా ఉంది. గతంలో ఇందులో ప్రభుత్వ బాలకల గురుకుల పాఠశాల, విద్యుత కార్యాలయాలను నిర్వహించారు. ఈ భవన సముదాయానికి కొద్దిగా మరమ్మతులు చేసిన పక్షంలో రెండు, మూడు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం మిషన భగీరథ, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల కార్యాలయాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి.

ఏవో భవనం తొలగింపు ప్రక్రియ ప్రారంభం

100 పడకల ఆసుపత్రి భవన సముదాయం తుది మెరుగులు దిద్దుకుంటుండడంతో ఏవో కార్యాలయ భవనాన్ని తొలగించే ప్రక్రియను వైద్య విదాన పరిషత అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు ఎవో ముత్యాల నాగరాజుకు డీసీహెచఎ్‌స చిన్నా నాయక్‌ పోన చేసి భవనాన్ని తొలగించేందుకు ఖాళీ చేయాలని సూచించారు. త్వరలోనే ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. కాగా చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఖాళీ చేసి, స్థలాన్ని తమకు అప్పగించాలని డీసీహెచఎ్‌స చిన్నా నాయక్‌ తనకు పోన చేశారని ఏవో ముత్యాల నాగరాజు తెలిపారు. తమ కార్యాలయ స్థలాన్ని ఆసుపత్రి ఆవసరాల కోసం తీసుకుంటున్న విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలపాలని డీసీహెచఎ్‌సను కోరినట్టు ఏవో తెలిపారు. ఇక్కడ తమ కార్యాలయాన్ని తొలగించిన పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లను పరిశీలన చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - May 16 , 2025 | 12:35 AM