ఆఖరి మజిలీకీ అవస్థలు
ABN , Publish Date - May 10 , 2025 | 11:49 PM
పల్లె ప్రగతిలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కొ గ్రామంలో రూ.12.50 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాలు నిరుపయోగంగా మారుతున్నాయి. నిర్మాణాలు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా ఆయా గ్రామాల్లో టాయిలెట్స్, విద్యుత, నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ప్రజలు వినియోగించు కునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠ ధామాలు కొన్ని గ్రామాల్లో అలంకార ప్రా యంగా మారాయి. (ఆంధ్రజ్యోతి-చింతపల్లి)
చింతపల్లి మండలంలో దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వ హయాంలో శ్మశానవాటిక (వైకుంఠధామం)లు నిర్మించింది. కానీ శ్మశానవాటికలు ఏర్పాటు చేసే క్రమంలో నీటి సౌకర్యం, రోడ్డుమార్గంతో పాటు, ప్రహరీ ఏర్పాటు చేయలేదు. దీం తో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు రోడ్డుమార్గం లేకపోవడం, గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంగా ఉండడంతో అం తిమ వాహనం లేకపోవడంతో సొంత భూమిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గొడుకొండ్ల, పోలేపల్లి, రాంనగర్, ఎం.మల్లేపల్లి, మదనాపురం, చాకిలిశేరుపల్లి, ఉమ్మాపురం, తక్కెళ్లపల్లి, వింజమూర్, కుర్మపల్లి, సాయిరెడ్డిగూడెం, బోటిమిదితండా, నెల్వలపల్లి, తిరుమలాపురం, నసర్లపల్లి, హోమంతాలపల్లి, రాయినిగూడెం, గ్రామ శివారులో వైకుంఠధామాలు ఏర్పా టు చేశారు. రోడ్డుమార్గంతో పాటు నీటి సౌకర్యం, ప్రహరీ ఏర్పాలు చేయలేదు. రాత్రివేళల్లో కొన్ని గ్రా మాల్లో శ్మశానవాటికల్లో కూడా ఆకతాయిలకు అడ్డాగా మారాయి. ఏర్పాటు చేసిన శ్మశానవాటికల్లో వసతి లేకపోవడంతో ఎవరూ కూడా దహనసంస్కారాలు చేయడానికి ముందుకు రావడం లేదు.
మాల్ పట్టణంలో తప్పని తిప్పలు..
రెండు జిల్లాల కూడలి ప్రముఖ విద్యావ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న గొడకొండ్ల గ్రామపంచాయతీలోని వెంకటేశ్వరనగర్(మాల్)లో శ్మశానవాటిక 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికకు స్థలాలు కేటాయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల సమన్వయం లోపంతో రంగారెడ్డి, నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 35 సర్వేనంబర్ ప్రభుత్వ భూమిలో శ్మశానవాటిక నిర్మించారు. ని ర్మించి ఏడాది గడస్తున్నప్పటికీ దహన సం స్కారాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. వసతి సౌకర్యాల లేకపోవడంతో నిర్మించిన శ్మశానవాటికలు అలంకారప్రాయంగా మారాయి. ఇకనైనా అధికారులుక్షేత్రస్థాయిలో దృష్టి సారించి శ్మశానవాటికకు రోడ్డుమార్గంతో పాటు నీటి వసతి సౌకర్యం, వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తే దహన సంస్కారాలు చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
గ్రామాల్లో ఏర్పాటు చేసిన శ్మశానవాటికల్లో కనీస వసతి సౌకర్యం లేదు. రంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల పాత మాల్ నుంచి శవాన్ని తరలిస్తున్నప్పుడు గ్రామస్థులు ఒప్పుకోవడం లేదు. వెంకటేశ్వర ఆలయ సమీపం లో ఏర్పాటు చేసిన శ్మశానవాటికల్లో వసతి సౌకర్యాలు లేవు. శ్మశానవాటికలకు ప్రహరీతో పాటు స్నానాలకు నీటి సౌ కర్యం ఏర్పాటు చేయాలి.
- సందపట్ల రాముసాగర్,(వీ.టీ.నగర్).