రోడ్డుపై గుంతలను పూడ్చరూ..
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:28 AM
ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి.
భువనగిరి రూరల్/ భూదానపోచంపల్లి/ చౌటుప్పల్ టౌన, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. భువనగిరి మండలం అనాజీపురం నుంచి బీబీనగర్ మండలం జంపల్లికి వెళ్లే ప్రధాన అంతర్గత రహదారి పూర్తిగా ధ్వంసమవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనాదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అనాజీపురం నుంచి రెడ్డినాయక్ తండా, మీట్ తండా, బొల్లేపల్లి గ్రామాలకు ఈ రహదారి గుండానే వాహనాదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాగా రెడ్డినాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మీట్ తండా శివారులో బొల్లేపల్లి కాల్వలోని మూసి నీరు పొంగిపొర్లడం, అకాల వర్షాలతో ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఈ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. భూదానపోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి గ్రామ శివారులో, ధర్మారెడ్డిపల్లి- వంకమామిడి గ్రామాల మధ్యన మెయిన రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను గుర్తించేందకు స్థానికులు ఆ గుంతల్లో తాటిమట్టలను ఉంచారు. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి వలిగొండ కు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు పై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. హైవే నుంచి సుమారు 200 మీటర్ల పొడవున వర్షానికి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ద్విచ క్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాలకు గురయ్యారు. ఈ రోడ్డు వెంట పాదాచారులు నడవ లేని పరిస్థితి ఏర్పడింది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు పై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చివేయించాలని స్థానికులు కోరుతున్నారు.