భార్యలను గెంటేసిన తండ్రీకుమారులు
ABN , Publish Date - May 09 , 2025 | 12:02 AM
వాళ్లిద్దరూ ఒకింటి అత్తా కోడళ్లు. కానీ భర్తలు చేసిన నిర్వాకానికి ఓపిక నశించి ఇంటి ఎదుట నిరసనకు దిగారు.
కోడలికి మద్దతుగా నిరసనలో పాల్గొన్న అత్త
నార్కట్‌పల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరూ ఒకింటి అత్తా కోడళ్లు. కానీ భర్తలు చేసిన నిర్వాకానికి ఓపిక నశించి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఆందోళన విషయం ముందే తెలుసుకున్న తండ్రీకుమారులిద్దరూ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధిత అత్తాకోడళ్లకు ఐద్వా అండగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నార్కట్‌పల్లికి చెందిన బద్దుల మల్లేశ నల్లగొండ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తుండగా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 12ఏళ్ల క్రితం మల్లేశ భార్య మృతిచెందగా, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం కోసం చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన యాదమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ద్వారా సంతానం లేదు. మల్లేశ తన మొదటి భార్యకు కలిగిన నలుగురి సంతానానికి పెళ్లిళ్లు చేశాడు. రెండో కుమారుడు మహేశకు తిప్పర్తి మండలానికి చెందిన దుర్గామల్లేశ్వరితో 2021లో వివాహంకాగా, మూడేళ్ల కుమార్తె ఉంది. మహేశ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, భార్య దుర్గామల్లేశ్వరి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మల్లేశ తన భార్య యాదమ్మను రెండేళ్ల క్రితమే ఇంటినుంచి గెంటేయడంతో నేరడకు వెళ్లి పలుమార్లు పెద్దమనుషులతో పంచాయితీ పెట్టింది. ఇదిలాఉండగా మహేశ కూడా భార్య దుర్గామల్లేశ్వరితో ఏడాది క్రితం గొడవపడి ఆమెను తల్లిగారింటికి పంపగా, పెద్దమనుషుల పంచాయితీకి చేరింది. నాలుగు రోజుల క్రితం దుర్గామల్లేశ్వరికి మహేష్ విడాకుల నోటీస్ పంపించాడు. దీంతో ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఆమె గురువారం నార్కట్‌పల్లికి వచ్చి అత్తగారింటి ఎదుట ధర్నాకు దిగింది. కోడలు ధర్నాకు దిగిన విషయం తెలుసుకున్న యాదమ్మ కూడా తనకూ తన భర్త మల్లేశ అన్యాయం చేశాడని ఆరోపిస్తూ కోడలితోపాటు దీక్షలో కూర్చుంది. అత్తాకోడళ్ల ఆందోళనకు ఐద్వా నాయకురాలు పాలడుగు ప్రభావతి, సరోజ, నాగమణిలు అండగా నిలిచారు. దీక్షలో సక్కు లక్ష్మమ్మ, బాల నర్సమ్మ, లింగాల మల్లమ్మ, రేణుక, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు అత్తాకోడళ్ల నిరసన కొనసాగగా, ఇంటికి తాళం వేసి ఉంది.