Share News

ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడం లేదని తండ్రి హత్య..

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:25 AM

ఆస్తి పంచేందుకు ఒప్పంద పత్రాలు రాసుకున్నా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేస్తున్నాడనే ఆగ్రహంతో కుమారుడు తండ్రిని హతమార్చాడు.

ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడం లేదని తండ్రి హత్య..
వెంకన్న (ఫైల్‌ఫొటో)

మోతె, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పంచేందుకు ఒప్పంద పత్రాలు రాసుకున్నా తన పేరిట రిజిస్ర్టేషన చేయకుండా జాప్యం చేస్తున్నాడనే ఆగ్రహంతో కుమారుడు తండ్రిని హతమార్చాడు. బుధవారం సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాలపురం ఆవాస గ్రామం నాగయ్యగూడెంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగయ్యగూడేనికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న అలియాస్‌ పొట్టి(60)కి గ్రామంలో 4.29ఎకరాల భూమి ఉంది. వెంకన్నకు ఇద్దరు కుమారులు గంగయ్య, ఉప్పయ్య, కుమార్తె స్వరూప ఉన్నారు. ఈ భూమిలో 29కుంటలు కుమార్తెకు, ఎకరం తండ్రి వెంకన్నకు, మిగిలిన మూడు ఎకరాలు ఇద్దరు కుమారులు చెరి సగం పంచుకునేట్లు నాలుగేళ్ల క్రితం పెద్ద మనుషులు సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. వెంకన్న చిన్న కుమారుడితో కలిసి ఉంటుండగా, పెద్ద కుమారుడు గంగయ్య అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు.

తన వాటాకు వచ్చిన ఎకరం పొలాన్ని విభలాపురం గ్రామానికి చెందిన మైనంపాటి రంగారెడ్డికి వెంకన్న విక్రయించాడు. తను విక్రయించిన ఎకరం పొలాన్ని రంగారెడ్డికి గత నెల 28వ తేదీన వెంకన్న రిజిస్ట్రేషన చేయడంతో పాటు కుమార్తెకు అనుకున్న 29కుంటల భూమిని అదే రోజు వెంకన్న రిజిస్ట్రేషన చేశాడు. ఈ విషయం పెద్ద కుమారుడికి తండ్రి చెప్పలేదు. ఆ తర్వాతి రోజు రిజిస్ట్రేషన జరిగిన విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు గంగయ్య తనవాటా భూమి తనకు రిజిస్ట్రేషన చేయాలని పెద్ద మనుషుల ద్వారా తండ్రిని అడిగించాడు. ఈ నెల ఒకటో తేదీన రిజిస్ట్రేషన చేస్తానని తండ్రి హామీ ఇచ్చాడు. ఆ రోజు రిజిస్ట్రేషన చేయకపోవడంతో తండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ జరిగింది. తన వాటా భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని పెద్ద కుమారుడు గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు గంగయ్యకు సూచించారు.


దారి కాచి తండ్రిపై గొడ్డలితో దాడి

తండ్రి వెంకన్న బుధవారం మోతె మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి మామిళ్లగూడెం నుంచి విభలాపురం వస్తుండగా కుమారుడు గంగయ్య విభలాపురం గ్రామ శివారులో ఉన్న వాగు వద్ద గొడ్డలితో తండ్రి తలపై వెనుక నుంచి దాడిచేశాడు. వెంటనే తండ్రి మోపెడ్‌ నుంచి కిందపడగా గంగయ్య అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి 108 అంబులెన్సులో సూర్యాపేటకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. వెంకన్న భార్య మీనమ్మ రెండునెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. మృతుడి కుమార్తె స్వరూప ఫిర్యాదు మేరకు గంగయ్యపై హత్యాయత్నం కేసు పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మునగాల సీఐ ఆధ్వర్యంలో మునగాల, నడిగూడెం, మోతె ఎస్‌ఐలు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 07:58 AM