ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ డీఎస్పీ మోసం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:51 AM
సినిమాల ప్రభావంతో పోలీస్ కావాలని కలలు కన్న ఓ వ్యక్తి పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం పట్టాడు.

సూర్యాపేట క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సినిమాల ప్రభావంతో పోలీస్ కావాలని కలలు కన్న ఓ వ్యక్తి పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. పోలీ్‌సఅధికారిలా యూనిఫాం, బెల్ట్‌బూట్లు, బ్యాడ్జీలు ధరించి డీఎస్పీనంటూ కారులో తిరుగుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సా చేస్తున్న నకిలీడీఎస్పీని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18లక్షలు, కారు, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఫిబ్రవరిలో సూర్యాపేటలోని శ్రీగ్రాండ్ హోటల్‌కు వచ్చాడు. తాను డీఎస్పీనని, దురాజ్‌పల్లి(పెద్దగట్టు)జాతర బందోబస్తు పర్యవేక్షణకు వచ్చానని సిబ్బందిని పరిచయం చేసుకుని గదిని అద్దెకు తీసుకున్నారు. పోలీ్‌సయూనిఫాంతో బయటికివెళ్లి వస్తున్నాడు. రెండు వారాల పాటు ఆయన వ్యవహారం బాగానే సాగింది. కొందరు హోటల్ గది వద్దకు వచ్చి డబ్బు విషయంలో శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు, మూడు రోజులు కొనసాగడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి యజమానుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని యజమానులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. సూర్యాపేట పట్టణ పోలీసులు హోటల్ వద్దకు సోమవారం ఉదయం చేరుకుని శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనకు తరలించారు. హోటల్ వద్ద ఉన్న బాధితులను కూడా పోలీసులు పోలీస్ స్టేషనకు తీసుకువెళ్లి విచారించారు.
పాత నేరస్థుడే..
పోలీసుల విచారణలో అతడు పాతనేరస్థుడని తేలింది. పౌరసరఫరాల శాఖ, పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాషా్ట్రల్లో పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశలోని రాజమండ్రి, త్రిపురాంతకం,మేడికొండూరు, నర్సరావుపేట రూరల్, మార్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలుచేసి మోసం చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేసి 2022లో జైలుకు పంపారు. అదే ఏడాది బెయిల్‌పై విడుదలైన తర్వాత తెలుగు రాషా్ట్రల్లో సంచరిస్తూ తాను డీఎస్పీనని ఆటోడ్రైవర్లు, హెయిర్‌డ్రెస్సింగ్ సెలూన్ల యజమానులను పరిచయం చేసుకున్నాడు. వీరి ద్వారా ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి కోదాడకు చెందిన ఓ యువతి నుంచి విడతల వారీగా రూ.36లక్షలు, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ రాష్ట్రం మార్టూరుకు చెందిన యువకుడి నుంచి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని గురజాలకు చెం దిన యువకుడికి నుంచి కొంతమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. వసూలు చేసిన డబ్బుతో లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు. అతడు ఖర్చులు చేయగా మిగిలిన రూ.18లక్షలు, కారు, పోలీస్ యూనిఫాం, రెండుడమ్మీ మ్యానప్యాక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై 2011లో మఠంపల్లి మండలంలో బైక్ చోరీ కేసు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. శ్రీనివాసరావుకు వివాహంకాగా, ఓ కుమారుడు ఉన్నాడని తెలిపారు. కోదాడకు చెందిన యువతి ఫిర్యాదు మేరకు నకిలీ డీఎస్పీ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుతున్నట్లు తెలిపారు. నకిలీ డీఎస్పీని పట్టుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులను అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశరరావు, సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి, ఇనస్పెక్టర్ పి.వీరరాఘవులు, ఎస్‌ఐలు ఆంజనేయులు, ఈట సైదులు, సిబ్బంది విద్యాసాగర్‌రావు, గొర్ల క్రిష్ణయ్య, గోదేశి కర్ణాకర్, జోగు సైదులు, చీకూరి మధు ఉన్నారు.
సినిమాల ప్రభావంతో..
మఠంపల్లి: సినిమాల ప్రభావంతో సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని చిన్నప్పటి నుంచే శ్రీనివాసరావు మక్కువ పెంచుకున్నాడని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామస్థులు తెలిపారు. 15 ఏళ్ల కిందట పోలీస్‌యూనిఫాం ధరించి మట్టపల్లి శివారులో లారీడ్రైవర్లను ఆపి డబ్బులు వసూలు చేయగా, నకిలీ పోలీసు అని తెలుసుకున్న లారీ డ్రైవర్లు ఆయనను చితకబాదారు. దీంతో ఆంధ్రప్రదేశ రాషా్ట్రనికి పరారైనట్లు గ్రామస్థులు తెలిపారు. మట్టపల్లిలో ఐదో తరగతి వరకు చదివిన శ్రీనివాసరావు ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడని, బెయిల్‌పై బయటికి వచ్చిన ప్రతిసారి వేరే కొత్తప్రాంతానికి మకాం మార్చి పోలీస్ అధికారి పేరుతో డబ్బులు వసూలు చేయడం అతడి నైజం అని గ్రామస్థులు వివరించారు.