Share News

ప్రాణాలు తీస్తున్న నకిలీ వైద్యులు

ABN , Publish Date - May 22 , 2025 | 12:25 AM

నకిలీవైద్యుల చేతుల్లో ప్రాణాలు పోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రాణాలు తీస్తున్న నకిలీ వైద్యులు

జిల్లాలో ఒక్కొక్కటీగా వెలుగులోకి

మహిళ మృతిపై పోలీసులకు ఫిర్యాదు

నకిలీవైద్యుల చేతుల్లో ప్రాణాలు పోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నకిలీ వైద్యులకు సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా సూర్యాపేటలో 50కి పైగా సరైన అనుమతులు లేని ప్రైవేట్‌ వైద్యశాలలు ఉన్నట్లు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు సభ్యులు, ఐఎంఏ సంయుక్తంగా తనిఖీల్లో బహిర్గతమైంది. అయితే ఆయా ఆసుపత్రుల నుంచి మామూళ్లు తీసుకుంటూ చర్యలకు వెనకాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-భానుపురి)

జిల్లాలో 229 ప్రైవేట్‌ ఆసుపత్రులు, 37 డెంటల్‌ ఆసుపత్రులు, 150 డయాగ్నస్టిక్‌ సెంటర్లు, 19 ఫిజీయోఽథెరఫీ, 9 ఎక్స్‌రే, 44 అల్ర్టాసౌండ్‌ సెంటర్లు ఉన్నాయి. ఆసుపత్రుల్లో పనిచేసిన కాంపౌండర్లు, మందుల దుకాణాల్లో పనిచేసిన వ్యక్తులు, ఇతర ఉద్యోగాలు చేస్తూ సంపాదించాలనే కోరికతో ఉన్న వ్యక్తులు ఆసుపత్రులు నెలకొల్పి అర్హత లేని, అనుభవం లేని వైద్యులను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందించరనే అపోహను కల్పించి గ్రామీణ ప్రాంతాలో ఆర్‌ఎంపీల ద్వారా, పీఆర్వోలను నియమించుకుని రోగులను ఆకర్శిస్తున్నారు. కమీషన్ల కోసం వీరు ఆసుపత్రుల్లో సరైనా పరికరాలు లేకున్నా రోగులను చేర్పిస్తున్నారు. ఆబార్షన్లు సైతం ఆర్‌ఎంపీల వల్ల కాకపోతే కమీషన ఇచ్చే మహిళా వైద్యుల వద్దకు పంపిస్తున్నట్లు సమాచారం.

అక్కడ ఉద్యోగం.. ఇక్కడ వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ కొందరు వైద్యులు ప్రైవేట్‌ఆసుపత్రులను నెలకొల్పారు. ప్రభుత్వఆసుపత్రుల్లో అన్నివసతులు ఉన్నా అక్కడ వైద్యం అందించకుండా తమ ఆసుపత్రులకు రావాలని అడ్రసులు వారే చెబుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా వైద్యశాఽఖాధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పోతోంది.

జిల్లాలో ఐదు ఆసుపత్రులు సీజ్‌

జిల్లాలో 10 రోజులుగా నకిలీవైద్యుల బాగోతం ఒక్కొక్కటీగా వెలుగు చూస్తున్నాయి.శ్రీసాయిగణేష్‌ మల్టీస్పెషాలిటీ, శ్రీకృష్ణ, శరత కార్డియాటిక్‌ సెంటర్‌, యాపిల్‌ స్కానింగ్‌ సెంటర్లలో, అర్హత లేని నకిలీ వైద్యులు సరైనా ధ్రువీకరణ పత్రాలు లేవని టీఎంసీ తేల్చడంతో సీజ్‌ చేశారు. వీటితో పాటు మేళ్లచెర్వులో అర్హత లేని వైద్యం అందిస్తున్నారని చాందినీ క్లినిక్‌ సెంటర్‌ను సైతం సీజ్‌ చేశారు. నకిలీ వైద్యులను కేసుల నుంచి కాపాడే క్రమంలో ఏసీబీకి చిక్కారు. ఇదిలా ఉండగా విచారణ జరుగుతున్న క్రమంలో శ్రీసాయిగణేష్‌ ఆసుపత్రిలో మహిళ గర్భసంచి తొలగించే ఆపరేషన విఫలమై రక్తస్రావమైంది. దీంతో ఆ మహిళను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయడానికి లక్షలు ఖర్చు చేసింది. అయినా ప్రాణం దక్కలేదు.

పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేస్తాం

అబార్షన చేస్తుండగా రక్తస్రావమై మహిళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పోలీసుస్టేషనకు వచ్చారు. విచారణ చేసి నిజాలను పోలీసులకు అందజేస్తాం. పర్యవేక్షణ సక్రమంగా చేస్తున్నాం. ఈ నెలలో ఐదు ఆసుపత్రులను సీజ్‌ చేశాం.

డాక్టర్‌ కోటా చలం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

Updated Date - May 22 , 2025 | 12:25 AM