Share News

అంతటా ఉద్వేగం

ABN , Publish Date - May 08 , 2025 | 12:34 AM

పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా భారత త్రివిధ దళాలు దాయాది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ ‘సింధూర్‌’ పేరుతో చేసిన వైమానిక దాడులు ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఉద్వేగాన్ని నింపాయి.

అంతటా ఉద్వేగం

ఆపరేషన్‌‘సింధూర్‌’పై హర్షం

రోజంతా ఫోన్లు, టీవీలకే అతుక్కుపోయిన ప్రజలు

దాడుల వీడియోలతో హోరెత్తిన సోషల్‌ మీడియా

నిఘా పెంచిన పోలీసులు

మతసామరస్యాన్ని చాటి ని ఉమ్మడి జిల్లా ప్రజలు

(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్‌): పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా భారత త్రివిధ దళాలు దాయాది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ ‘సింధూర్‌’ పేరుతో చేసిన వైమానిక దాడులు ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఉద్వేగాన్ని నింపాయి.

పాకిస్థాన్‌లో బుధవారం తెల్లవారు జామున 1.45 గంటలకు చేసిన ఈ దాడులు ఇండియన్‌ ఆర్మీ ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్టుతో వెలుగు చూశాయి. ఆ వెంటనే సోషల్‌ మీడియా, టీవీ చానెల్స్‌లో బ్రేకింగ్‌ వార్తలు వెల్లువెత్తాయి. అప్పటివరకు మెళకువతో సెల్‌ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు దాడి వార్తలతో హ ర్షం వ్యక్తం చేశారు. ఆ వెంటనే వారు కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పలువురికి ఫోన్లు చేసి వార్తను పంచుకున్నారు. తెల్లవారుజామున నిద్రమత్తును వీడి 15 రోజులుగా పడుతున్న బాధకు ప్రధాని నరేంద్రమోదీ శుభం పలికారని కొనియాడారు. టీవీల చానెల్స్‌ మారుస్తూ సైనికుల పరాక్రమాన్ని కనులారా చూసి పులకించారు. మీడియా సమావేశంలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన తీరును సైనిక అధికారులు వివరించగా, ఆపరేషన్‌ ‘సింధూర్‌’ పేరు ఎంపికకు కారణాలను వివరిస్తున్న క్రమంలో టీవీలను చూస్తున్న పలువురు ఉద్విఘ్నతతకు గురయ్యారు. అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఆలకించారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌ల డీపీలు, స్టేట్‌సలు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ తదితర సోషల్‌ మీడియాల్లో ఆపరేషన్‌ సింధూర్‌ లోగో, మిసైల్స్‌ దాడుల పోస్టులతో నిండిపోయాయి. ఏ ఇద్దరు కలిసినా ఆపరేషన్‌ ‘సింధూర్‌’పైనే చర్చ, మాట ముచ్చట సాగింది. అయితే పహల్గామ్‌ దాడి పేరుతో మత విద్వేషాలను సృష్టించాలనుకున్న పాకిస్థాన్‌ పన్నాగానికి భిన్నంగా ఉమ్మడి జిల్లా ప్రజలు సామరస్యంగా ఉండి పరిణతి చాటారు.

సైనికుల కుటుంబాల్లో..

ఆపరేషన్‌ ‘సింధూర్‌’ నేపథ్యంలో సైనికుల కుటుంబాలు ఉద్వేగానికి గురయ్యాయి. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భారత సైన్యంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నవారు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌తో యుద్ధ మేఘాలు అలుముకుంటుండడంతో సైనికుల సంక్షేమం, భద్రతపై ఇక్కడున్న తల్లిదండ్రులు, భార్యలు, పిల్లల్లో ఆందోళన నెలకొంది. అయినా దేశ భద్రతకు తమ కుటుంబం త్యాగం చేస్తోందని గుండె నిబ్బరం చేసుకున్నారు. పరిచయస్థులు సైనికుల కుటుంబీకులను కలుస్తూ ధైర్య వచనాలు చెబుతున్నారు. సెలవులను రద్దు చేయడంతో ఇళ్లకు వచ్చిన సైనికులంతా తిరుగు ముఖంపట్టారు. అలాగే పోలీసులకు అన్ని రకాల సెలవులను కూడా రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఉన్నతాధికారు లు ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో పోలీసులు ఉమ్మడి జిల్లా అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వలస కార్మికుల వివరాలు నమోదు చేస్తున్నారు.

నా కుమారుడు సైనికుడైనందుకు గర్వంగా ఉంది : రత్నపురం వెంకటమ్మ, భువనగిరి

నా కుమారుడు సైనికుడైనందుకు గర్వపడుతున్నా. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో మాలో ఆందోళన ఉంది. కానీ, దేశ రక్షణ కోసం యుద్ధ రంగంలో నా కుమారుడు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. దేశ కోసం తన వంతు త్యాగం చేస్తానంటూ ఇష్టంతో సైన్యంలోకి వెళ్లాడు. పహల్గామ్‌ దాడులు జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ప్రతిసారి మాట్లాడలేకపోతున్నాడు. టీవీల్లో యుద్ధ వార్తలు చూస్తున్నప్పుడు భయమేస్తోంది. ఆ వెంటనే తేరుకొని మాకు మేం ధైర్యం చెప్పుకుంటూ దేశం గెలవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.

Updated Date - May 08 , 2025 | 12:34 AM