మరణించినా మరొకరిలో జీవిస్తూ..
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:42 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువకుడు బ్రెయినడెడ్ కాగా, కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానంచేసి ఆదర్శంగా నిలిచారు.
మరణించినా మరొకరిలో జీవిస్తూ..
నార్కట్‌పల్లి యువకుడి బ్రెయినడెడ్
అవయవదానం చేసిన కుటుంబసభ్యులు
నార్కట్‌పల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువకుడు బ్రెయినడెడ్ కాగా, కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానంచేసి ఆదర్శంగా నిలిచారు. భౌతికంగా లేకున్నా మరొకరి రూపంలో బతికే ఉంటాడని జీవనదాన ట్రస్ట్ నిర్వాహకుల సూచనల మేరకు యువకుడి కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించారు. నార్కట్‌పల్లికి చెందిన నడింపల్లి బలరాంసత్తయ్య, హేమలతల కుమారుడు శ్రీహర్షయాదవ్(21) రంగారెడ్డి జిల్లా బాటసింగారం సమీపంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీన కళాశాల ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరే క్రమంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమైన శ్రీహర్షయాదవ్‌ను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, బ్రెయినడెడ్ అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. నాలుగు రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచిన కుటుంబసభ్యులు, వైద్యుల సూచన మేరకు మంగళవారం తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. శ్రీహర్ష గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను ఆయా ఆసుపత్రుల వారికి గ్రీనఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్సలో తరలించారు. అనంతరం గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య శ్రీహర్షయాదవ్ అంత్యక్రియలు బుధవారం నార్కట్‌పల్లిలో ముగిశాయి.