గడువు పెంచినా స్పందన అంతంతే
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:28 AM
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. మొదటి నోటిఫికేషనలో ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుకు అవకాశం ముగియగా, వ్యాపారుల నుంచి పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. మొదటి నోటిఫికేషనలో ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుకు అవకాశం ముగియగా, వ్యాపారుల నుంచి పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచారు. దీంతో ఐదు రోజుల్లో జిల్లాలో కొత్తగా 141 దరఖాస్తులు వచ్చాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట క్రైం)
జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2,758 దరఖాస్తులు రాగా వాటిద్వారా రూ.82.74 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంలో దరఖాస్తు విలువ రూ.2లక్షలు ఉండగా, ఈ పర్యాయం రూ.3లక్షలకు పెంచారు. దీంతో వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపించలేదని పలువురు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి ఈ నెల 27న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపులు చేయనున్నారు.
ఏడు తొలగించి, ఒకటి జతచేసి
జిల్లాలో 2023లో 99 దుకాణాలు ఉండగా సరైన మద్యం విక్రయాలు లేని కారణంగా జిల్లా సరిహద్దులోని ఆరు దుకాణాలతో పాటు చిలుకూరు మండలంలో ఒక దుకాణాన్ని నోటిఫికేషన నుంచి తొలగించారు. దీంతో ఈ పర్యాయం మొత్తం 93 మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయి. మేళ్లచెర్వు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు, నల్లబండగూడెం, కోదాడ పట్టణం, చిలుకూరు మండలాల్లో ఒక్కో దుకాణాన్ని తొలగించారు. కాగా సూర్యాపేట ఎక్సైజ్‌స్టేషన పరిధిలోని ఆత్మకూరు(ఎస్) మండలంలో అదనంగా మరో దుకాణాన్ని ఏర్పాటు చేశారు.
తగ్గిన ఆదాయం రూ.5.02 కోట్లు
మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెప్టెంబరు 25వ తేదీన నోటిఫికేషన జారీ చేశారు. అయితే వ్యాపారులు మాత్రం దసరా పండుగ తర్వాత నుంచి దరఖాస్తుకు ఆసక్తిచూపారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంతో చివరి తేదీవరకు వేచి ఉన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలకు 1,274 దరఖాస్తులు రాగా చివరిరోజైన 18న మాత్రం 1,343 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 2,617 దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు ప్రభుత్వం పెంచింది. ఈ ఐదు రోజుల వ్యవధిలో మరో 141 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా జిల్లాలో 2,758లకు దరఖాస్తుల సంఖ్య చేరింది. 2023లో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.87.76కోట్లు రాగా ఈసారి రూ.82.74కోట్లు వచ్చాయి. గతం కంటే రూ.5.02 కోట్లు తగ్గింది.
గడువు పెంచినా..
జిల్లాలో 2023లో 99 మద్యం దుకాణాలకు 4338 దరఖాస్తులు రాగా ఈసారి 93 దుకాణాలకు 2,758 దరఖాస్తులు వచ్చాయి. అందులో సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన పరిధిలో 31 దుకాణాలకు 886 దరఖాస్తులు, తుంగతుర్తి పరిఽధిలో 17 దుకాణాలకు 396, కోదాడ పరిధిలో 21 దుకాణాలకు 671, హుజూర్‌నగర్ పరిధిలో 24 దుకాణాలకు 805 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని 62వ నెంబరు దుకాణానికి అత్యధికంగా 59 దరఖాస్తులు, తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలోని 36వ దుకాణానికి తక్కువగా 18 దరఖాస్తులు వచ్చాయి.
ముగిసిన దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తగా 2,758 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా మద్యం దుకాణాలకు రిజర్వేషన కేటాయించాం. మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి ఈనెల 27న లక్కీ డ్రా నిర్వహించి కేటాయింపులు చేస్తాం.
లక్ష్మానాయక్, ఈఎస్, సూర్యాపేట.