Share News

క్రీడలతో సమదృష్టి సాధ్యం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:28 AM

విద్యార్థి దశలో క్రీడలు ఎంతో ముఖ్యం. చదువుతో పాటు క్రీడాలకు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పిల్లలు ధృడంగా తయారవుతారు. ఒకప్పుడు క్రీడలకు విద్యాసంస్థల్లో ప్రాధాన్యమిచ్చేవారు.

క్రీడలతో సమదృష్టి సాధ్యం

గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభగల క్రీడాకారులు

సౌకర్యాలు లేకనే క్రీడల్లో వెనుకబాటు

బీసీసీఐ మాజీ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌

విద్యార్థి దశలో క్రీడలు ఎంతో ముఖ్యం. చదువుతో పాటు క్రీడాలకు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పిల్లలు ధృడంగా తయారవుతారు. ఒకప్పుడు క్రీడలకు విద్యాసంస్థల్లో ప్రాధాన్యమిచ్చేవారు. గెలుపోటములను సమానంగా తీసుకునే శక్తి ఒక్క క్రీడాకారుడికి ఉంటుంది, అది కూడా క్రీడల ద్వారానే అబ్బుతుందని భారత క్రికెట్‌ జట్టు మాజీ సెలక్టర్‌, క్రికెట్‌ జట్టు మాజీ సభ్యుడు ఎంఎ్‌సకే ప్రసాద్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్‌)

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ విద్యకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. దానితో పాటే క్రీడలకు సమప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే పిల్లులు ధృడంగా మారడంతో మానసిక ఉల్లాసంతో ఉత్సాహంగా ఉంటారు. పిల్లలకు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తే వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలమైన ఆరోగ్యకర సమాజమూ నిర్మితమవుతుంది. క్రీడలు లేకపోతే బాల్యం, విద్య కోల్పోయే ప్రమాదముంది.

గెలుపోటములపై సమాన దృక్పథం క్రీడల్లోనే

పోటీల్లో పాల్గొనే వారందరికీ మెడల్స్‌ రావు, అయినా క్రీడాకారుడికి మెడల్స్‌ ముఖ్యం కాదు. ఆడిన ప్రతి ఒక్కరికీ మెడల్స్‌ రావు. కానీ జీవితంలో గెలుపు, ఓటములను నేర్పుతాయి. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే శక్తి సమకూరుతుంది. జీవితంలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకునే శక్తి ఒక క్రీడలకు మాత్రమే ఉంది.

గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేకనే

క్రీడలు పట్టణాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉంటారు. వారు రాణించేందుకు సరైన సౌకర్యాలు లేక వెలుగులోకి రావడం లేదు. అలాంటి వారిని గుర్తించి వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టాం.

కష్టపడి ఎదిగిన వారిలో సిరాజ్‌ ఒకరు

ప్రతి ఒక్క క్రికెటర్‌ ఇండియా టీమ్‌కు ఆడలేరు. అందులో అత్యంత మెరుగైన ప్రతిభ కలిగిన వారు మాత్రమే జట్టుకు ఎంపికవుతారు. ఇండియా టీమ్‌కు ఆడకపోయినా ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇండియా టీమ్‌కు ఆడుతున్న ఎంతోమంది క్రికెటర్లు ఎంతో కష్టపడి ఎంపికైన వారే. అందులో పేసర్‌ మహ్మద్‌సిరాజ్‌ ఒకరు. క్రీడా పోటీలతో భవిష్యతను బాగు చేసుకోవచ్చు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.

కొత్తవారికి ఐపీఎల్‌ వేదిక

ఐపీఎల్‌ ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తెచ్చింది. అక్కడే చాలామంది ప్రతిభను కనబరిచి భారత జట్టుకు ఎంపికవుతున్నారు. 13ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. ఇందుకు ఐపీఎల్‌ నిర్వాహకులు, రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్లు, వివిధ ఐపీఎల్‌ క్రికెట్‌ జట్ల ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు. క్రీడాకారులు వెలుగులోకి రావడంతో పాటు ఐపీఎల్‌ ద్వారా బీసీసీఐకి కూడా ఆదాయం సమకూరుతోంది.

క్రికెట్‌ అకాడమీల ఏర్పాటు

క్రీడా నైపుణ్యం కలిగిన గ్రామీణ, పట్టణాల్లోని క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు, గుంటూరు సమీపంలోని నంబూరులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ప్రస్తుతం సూర్యాపేటలో ఒక అకాడమీని ఏర్పాటుచేశాం. అంతేకాకుండా తెలుగువారి కోసం అమెరికాలో కూడా క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాం. మా అకాడమీలో విద్యతో పాటు క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తాం. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రజలు, ప్రభుత్వం భాగస్వాములు కావాలి. అకాడమీలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

Updated Date - Aug 19 , 2025 | 12:28 AM