ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:32 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు జిల్లావ్యాప్తంగా ఊపందుకున్నాయి. జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్నప్పటికీ, ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండుటెండల్లోనూ కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో వ్యవసాయ పనులున్నప్పటికీ జిల్లాలో గత నెలరోజులుగా ఉపాధి పనులు జోరుగా జరుగుతున్నాయి.
జిల్లాలో 32,33,056 పనిదినాలు లక్ష్యం
ప్రస్తుతం రోజువారీగా 23,567 మందికి పని
కూలీలకు 100 రోజులు పనికల్పిస్తూ సుస్థిర ఆస్తుల కల్పన లక్ష్యం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు జిల్లావ్యాప్తంగా ఊపందుకున్నాయి. జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్నప్పటికీ, ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండుటెండల్లోనూ కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో వ్యవసాయ పనులున్నప్పటికీ జిల్లాలో గత నెలరోజులుగా ఉపాధి పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రోజువారీగా 23,567 మంది కూలీలు పాల్గొంటున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు రోజువారీగా 35వేల మంది కూలీలు పనులు చేయనున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదకూలీల కుటుంబాలకు 2025-26లో 100 రోజుల పని కల్పిస్తూ సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ పేదల జీవనోపాధుల వనరులను శక్తివంతం చేసేందుకు పనులు ఎంపికచేశారు. ఈ పథకం కింద పలు రకాల పనులు చేపట్టనున్నారు. కూలీలకు తగినట్లు నైపుణ్యంలేని పనులను, గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ, పనులను గుర్తించి బడ్జెట్‌ను రూపొందించారు. జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా, 428 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు 1,43,143 ఉండగా, మొత్తం కార్డుల్లో వ్యక్తుల సంఖ్య 2,63,326, యాక్టివ్ జాబ్‌కార్డులు 88,564, యాక్టివ్ వేజ్ సీకర్స్ 1,26,498 మంది ఉన్నారు. 2024-25లో రూ.27.49 లక్షల మేరకు కూలీల బడ్జెట్‌ను రూపొందించగా, ఇప్పటివరకు రూ.29.81లక్షల వరకు చెల్లించారు. ఈ పథకం కింద పనులు చేపట్టేందుకు జిల్లావ్యాప్తంగా జాబ్‌కార్డులను జారీచేశారు. 32,33,056 పనిదినాలకు కూలీలకు దాదాపు రూ.96,99,16,800 బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. అయితే మెటీరియల్ సంబంధించిన నిధులు అదనంగా ఉంటాయి. గ్రామాల్లో గుర్తించిన పనులను చేపట్టేందుకు అవసరమయ్యే నిధులపై అధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంతవ్సరానికి జిల్లావ్యాప్తంగా 428 గ్రామపంచాయతీల్లో 32,33,056 పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికను రూపొందించారు.
చేపట్టనున్న పనులు
ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులపై ఇప్పటికే గ్రామాలవారీగా సభలు నిర్వహించి ఎంపికచేశారు. వీటిలో నీటి సంరక్షణ పనులు.. వరుస సరిహద్దు కందకాలు, గాడి తవ్వకం, వంపులతో కూడిన కందకాలు, చతురస్రపు కందకాలు, డొల్ల సరస్సులు, కాలు అడ్డుకట్టలు, గండశిలల కరకట్టలు, సరస్సులు, చెరువులు ఊటచెరువులు, భూగర్భ అడ్డుకట్టలు, మట్టి ఆనకట్టలు, గ్రామాల్లో మొక్కలు నాటడం, చెక్‌డ్యాం నిర్మాణాలు, అడవుల పెంపకంతో కరువు నివారణ చర్యలు, గడ్డి భూమి అభివృద్ధి, రోడ్లు, కాల్వల పక్కన మొక్కల పెంపకం, బ్లాక్ మొక్కల పెంపకం సాగునీటి కాల్వలు, చిన్నతరహా సాగునీటి పనులు, పంట కాల్వల ప్రహరీల నిర్మాణం, చెరువుల పూడికతీతతో పాటు సాంప్రదాయ నీటి వనరుల ఆధునికీకరణ పనులు, వరద నియంత్రణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, మట్టి, మొరం రోడ్లు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, గ్రామీణ పారిశుధ్య చర్యలు తదితర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జాబ్‌కార్డులు ఉన్నవారందరికీ పని : నాగిరెడ్డి, డీఆర్డీవో
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూలీలను ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం జిల్లాలో 23,567 మంది కూలీలు రోజువారీగా హాజరవుతున్నారు. మేలో మరో 10 వేల మంది అదనంగా హాజరవుతారు. జాబ్‌కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాలవారీగా చేపట్టనున్న పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనులను గుర్తించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 32,33,056 పనిదినాలు కల్పించి, కూలీలకు దాదాపు రూ.96.99కోట్ల బడ్జెట్‌కు రూపకల్పన చేశాం. ఇప్పటివరకు జిల్లాలో రూ.29లక్షల పనులు చేపట్టాం.
2025-26 సంవత్సరానికి 32,33,056 పనిదినాలు
మండలం గ్రామపంచాయతీలు పనిదినాలు
అడ్డగూడూరు 17 1,45,900
ఆలేరు 14 1,01,1600
ఆత్మకూరు(ఎం) 23 1,92,2970
భువనగిరి 34 2,83,050,
బీబీనగర్ 34 163305
బొమ్మలరామారం 34 185248
చౌటుప్పల్ 26 235791
గుండాల 20 232510
తుర్కపల్లి 31 216538
మోటకొండూరు 18 119696
మోత్కూరు 10 115021
నారాయణపురం 31 262100
భూదాన్‌పోచంపల్లి 22 142550
రాజపేట 23 229572
రామన్నపేట 24 206000
వలిగొండ 37 207125
యాదగిరిగుట్ట 23 194080