ఉపాధి ముమ్మరం.. సౌకర్యాలు మృగ్యం
ABN , Publish Date - May 08 , 2025 | 12:12 AM
వేసవి కావడంతో ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సామాన్యులు బయటికి రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఎర్రటి ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
వేసవి కావడంతో ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సామాన్యులు బయటికి రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఎర్రటి ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎండల్లో పనులు చేపట్టేందుకు ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కూలీల కోసం కనీస వసతుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకునే వారే కరువయ్యారు. తాగునీరు, సేదతీరేందుకు టెంట్‌తో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించడంతో పాటు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే నామమాత్రంగా తాగునీరు, టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. దీంతో అరకొర వసతుల మధ్య కూలీలు పనులు వెళ్లదీస్తున్నారు.
(ఆలేరు రూరల్ / ఆత్మకూరు(ఎం) / భువనగిరి రూరల్ / బొమ్మలరామారం / మోత్కూరు / రాజాపేట )
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. వేసవిలో సేద తీరేందుకు టెంట్ సౌకర్యం కల్పించడంలేదు. దీంతో కూలీలు చెట్ల నీడనే ఉపశమనం పొందుతున్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో లేవు. వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం కోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించడం లేదు. ఆత్మకూరు(ఎం) మండలంలో 23 పంచాయతీల పరిధిలో రోజూ 1,500 మంది పనులకు హాజరవుతున్నారు. గతంలో వచ్చే అలవెన్సు రావడంలేదని ఏపీవో రమేష్ తెలిపారు. భువనగిరి మండలంలో 33 పంచాయతీల్లో 17,444 మంది కూలీలున్నారు. ఎండతీవ్రతతో ప్రతి రోజూ సగటున 2,140మంది కూలీలు హాజరవుతున్నారు. రోజు వారి కూలీ రూ.307లకు గాను వేసవి తీవ్రత దృష్ట్యా కొలతల ప్రకారం సగటు రూ.234 పనులు మాత్రమే అందుతుందని కూలీలు తెలిపారు. బొమ్మలరామారం మండలంలో వారానికి ఒకసారి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. రోజువారి కూలీ రూ.290 వరకు అందుతుందని కూలీలు తెలిపారు. సంస్థాననారాయణపురం మండలంలో కొన్ని గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కూలీలు ఇంటి నుంచే నీటి నీటిని తెచ్చుకుంటున్నారు. మోత్కూరు మండలంలో 10 గ్రామ పంచాయతీల్లో రోజూ సుమారు 700 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. రాజాపేట మండలంలో కొన్నిచోట్ల మంచినీటిని, మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఏర్పాటుచేశారు. యాదగిరిగుట్ట మండలంలో 23 గ్రామపంచాయతీల్లో సుమారు 1,400 మంది కూలీలు పనులు చేస్తున్నారు.
వారానికి ఒక గ్రూప్‌కు ఉపాధి
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలంలో ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. దేవలమ్మనాగారంలో 150 మంది కుటుంబాలకు ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రతి రోజూ 50మంది కూలీలు పని చేస్తున్నారు. వారానికి ఒక గ్రూప్ చొప్పున పనులు చేయిస్తున్నారు. ఒక్క గ్రూప్‌కు పనికి లభించాలంటే నాలుగు వారాలు పడుతోంది. ఇదే పరిస్థితి చిన్నకొండూరు, పంతంగితో పాలు పలు గ్రామాల్లో నెలకొంది. అంతేకాకుండా 100 రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 50 రోజులు కూడా పని దొరకడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. అరకొర వసతుల నడుమ ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో...
కొండమల్లేపల్లి / పెద్దఅడిశర్లపల్లి / గుర్రంపోడు / చింతపల్లి / డిండి / నార్కట్‌పల్లి / దేవరకొండ / మాడ్గులపల్లి / త్రిపురారం / వేములపల్లి / నకిరేకల్ / తిప్పర్తి /చిట్యాల రూరల్ / శాలిగౌరారం )
నల్లగొండ జిల్లాలో వేసవిలో అరకొర వసతుల మధ్య ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేసవిలో ఎండ నుంచి రక్షణకు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు, తాగునీరు వసతులు కల్పించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి కూలీలే నీటిని తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి పీఏపల్లి మండలంలో 36 పంచాయతీలుండగా 14,500 జాబ్‌కార్డులు ఉన్నాయి. గుర్రంపోడు మండలంలో రెండేళ్ల క్రితం ఉపాధి కూలీలు సేదతీరేందుకు టార్పాలిన కవర్లు ఇవ్వగా, అవి దెబ్బతినడతో కూలీలకు నీడ కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రెండు రోజులకు ఒకసారి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నట్లు కూలీలు తెలిపారు. చింతపల్లి మండలంలో 2,850 మంది పనిచేస్తున్నారు. ఏ గ్రామంలోనూ కనీస సౌకర్యాలు కల్పించలేదు. డిండి మండలంలోనూ అదే పరిస్థితి నెలకొంది. నార్కట్‌పల్లి మండలంలో మంచినీటిని మాత్రం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉం చారు. దేవరకొండ మండలంలో 39 పంచాయతీల్లో 12,674 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి మండలంలో ఒక్కో కూలీకి రూ.100 నుంచి రూ.200 వరకు రోజువారి వేతనం చెల్లిస్తున్నట్లు కూలీలు తెలిపారు. కేతేపల్లి మండలంలో ఉపాధి కూలీలకు వసతులు కరువయ్యాయి. ఎర్రటి ఎండలో పని చేస్తున్నా కూలి డబ్బులు సకాలంలో జమకావండలేదని కూలీలు తెలిపారు. త్రిపురారం మండలంలో 32 గ్రామాల్లో ప్రతి రోజూ 3,800 నుంచి 4,000 మంది పనులకు వెళ్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకున్నా పనులు చేస్తున్నా సమయానికి డబ్బులు అందడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. వేములపల్లి మండలంలో 12 గ్రామపంచాయతీల పరిధిలో 5,164జాబ్‌కార్డులు ఉండగా 9,207 మంది కూలీలు ఉన్నారు. ప్రతిరోజూ 1,650మంది కూలీలు పనికి హాజరవుతున్నారు. ఎక్కడా వసతులు కల్పించలేదు. నకిరేకల్ మండలంలో తాగునీటిని కూలీలే సొంతంగానే తీసుకెళ్తున్నారు. లోతైన కాల్వలో దిగి పనులు చేస్తున్నా అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిప్పర్తి మండలంలో 26 గ్రామపంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రోజు కూలి రూ.307కు రూ.90 నుంచి రూ.150 వరకు మాత్రమే జమవుతున్నట్లు పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. చిట్యాల మండలంలో వారం, 10రోజులకు ఒకసారి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఇస్తున్నారు. ఫస్ట్‌ఎయిడ్ కిట్‌లు అందుబాటులో లేవు. శాలిగౌరారం మండలంలో ఉపాధి కూలీలకు ఎటువంటి ఏర్పాటు కల్పించడంలేదు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఫీల్డ్ అసిస్టెంట్లు అందజేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ...
మేళ్లచెర్వు: మేళ్లచెర్వు ఉమ్మడి మండల వ్యాప్తంగా మొక్కుబడి గా నత్తనడకన ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. గతంలో చేసి న పనికి పూర్తిస్థాయిలో కూలి చెల్లించలేదని కూలీలు వాపోతున్నా రు. వ్యవసాయ భూముల్లో నాసిరకం పనులు చేస్తున్నారని రైతు లు తమ పొలం పనులను ఉపాధి కింద నమోదు చేయకపోవడం తో నామామాత్రపు పనులు మాత్రమే లభిస్తున్నాయి. కాగా పని ప్రదేశాల్లో ఎటువంటి టెంట్లు ఏర్పాటుచేయలేదు. కొన్నిచోట్ల మాత్రమే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. తాగునీటిని కూలీలే తె చ్చుకుంటున్నారు. ఫస్ట్‌ఎయిడ్స్ కిట్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.
పెనపహాడ్ : అరకొర వసతుల మధ్య ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పనులు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో చెట్ల నీడలే దిక్కయ్యాయి. కొన్నిచోట్ల చాలీచాలని టెంట్లు ఏర్పాటుచేశారు. చాలాచోట్ల కూలీలు ఇంటి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్‌కిట్లు అందుబాటులో లేవు.