Share News

అప్పుపత్రాల కోసం మద్యం తాగించి వృద్ధురాలి హత్య

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:43 AM

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో ఈ నెల 14న వృద్ధురాలి హత్య కేసును హుజూర్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు, అప్పు పత్రాల కోసం మద్యం తాపించి మత్తులోకి వెళ్లాక వృద్ధురాలిని హత్య చేసిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

అప్పుపత్రాల కోసం మద్యం తాగించి వృద్ధురాలి హత్య
విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కొత్తపల్లి నర్సింహ

సూర్యాపేట క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో ఈ నెల 14న వృద్ధురాలి హత్య కేసును హుజూర్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు, అప్పు పత్రాల కోసం మద్యం తాపించి మత్తులోకి వెళ్లాక వృద్ధురాలిని హత్య చేసిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వఆస్పత్రి వెనుక నివసిస్తున్న చెన్న అనసూర్యమ్మకు ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు నకిరేకల్‌లో ఉంటుండగా, ఆమెతో పాటు ఉండే కుమారుడు వేణు వారణాసిలో వంటలు చేయడానికి వెళ్లాడు. అనసూర్యమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదిలా ఉండగా ఇదే పట్టణంలోని యాదవుల బజారుకు చెందిన సుతారీ పని చేసే లింగం సతీ్‌షకు ఆమె గతంలో రూ.50 వేలు ఇవ్వగా అతడు వడ్డీ చెల్లిస్తున్నాడు. ఈ నెల 14 రాత్రి సమయంలో సతీష్‌ అతడి మేనల్లుడు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన మైనర్‌తో అనసూర్యమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెకు మద్యం ఇచ్చి, అది సేవించి మత్తులోకి వెళ్లాక ఇద్దరు కలిసి అనసూర్యమ్మ నోరు, ముక్కు మూసి హత్యచేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లో భద్రపరిచిన సతీష్‌ రాసిఇచ్చిన రూ.50వేల తాలుకూ ప్రామిసరీ నోటును తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని సతీష్‌ తన భార్య మౌనికకు తెలిపాడు. నిందితులు ముగ్గురు కలిసి చోరీచేసిన బంగారు ఆభరణాలను విజయవాడకు తీసుకెళ్లి అక్కడ కరిగించి బంగారు ముద్దలుగా మార్చుకుని భద్రపర్చుకున్నారు. ఈ నెల 15న ఉదయం అనసూర్యమ్మ నిద్రలేవకపోయేసరికి స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. దీంతో హుజూర్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనసూర్యమ్మ మృతికి కారణాలను తెలుసుకుని, ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. అనసూర్యమ్మ శరీరంపై గాయం ఉండడం, ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడంతో హత్యగా నిర్ధారించుకున్నారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల ప్రకారం లింగం సతీష్‌, అతడి భార్య మౌనిక, మేనల్లుడైన మైనర్‌ బాలుడిపై అనుమానంతో విచారించగా అనసూర్యమ్మను హత్య చేసింది తామేనని అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.60లక్షల విలువ చేసే బంగారు ముద్దలు, అప్పుకు సంబంధించిన ప్రామిసరీ నోటును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. బాలుడిని కోర్టు అనుమతితో జువైనల్‌ హోంకు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో హుజూర్‌నగర్‌ సీఐ చరమందరాజు, కానిస్టేబుళ్లు నాగరాజు, శంభయ్య ఉన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:43 AM