విద్యా ఖర్చు.. ఏడాదికి రూ.150కోట్లు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:00 AM
పిల్లల ఖర్చులు తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతున్నాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసినా ప్రైవేట్‌లో చదివిపించాలన్న తహతహ తల్లిదండ్రులకు చిల్లులు పెడుతోంది.
పిల్లల ఖర్చులు తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతున్నాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసినా ప్రైవేట్‌లో చదివిపించాలన్న తహతహ తల్లిదండ్రులకు చిల్లులు పెడుతోంది. కేవలం పాఠశాల ఖర్చులే ప్రతీ ఏడాది రూ.125 కోట్లకు పైగా ఉంటాయని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కళాశాలల ఖర్చు కలిపి రూ.25 కోట్ల వరకు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రయాసలుపడి అయినా పిల్లలకు మంచి భవిష్యత కల్పించాలని తల్లిదండ్రులు పడుతున్న తపనను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
- (ఆంధ్రజ్యోతి, సూర్యాపేట/ హుజూర్‌నగర్)
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసింది. ఇం దులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సీట్లు ఖాళీగా ఉండటంలేదు. ప్రతీ నియోజకవర్గంలో మైనార్టీ, జ్యోతిరావుపూలే బీసీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారు. ఇవేకాక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొన్ని 6 నుంచి 10వ తరగతి వరకు ఉంటే మరి కొన్ని 5-8వ తరగతి వరకు, మరికొన్ని ఇంటర్ వరకు విద్యనందిస్తున్నాయి. గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో విద్యార్థి ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. భోజనం, వసతి సౌకర్యం పొందవచ్చు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకా లు మాత్రమే కొనుగోలు చేయాలి. గురుకుల పా ఠశాలలకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. వీటి లో సీటు లభించని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలకు మొగ్గు చూపకుండా ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కన్నా నాణ్యమైన విద్యను అందజేస్తున్నా విద్యార్థుల తల్లితండ్రులకు నమ్మకం కలగడంలేదు. ప్రైవేటు వెళ్లే విద్యార్థుల కోసం తల్లిదండ్రులు వెచ్చించే ఖర్చు తారాస్థాయికి చేరింది. అయినప్పటికీ పిల్లల భవిష్యత కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు.
యూనిఫాం కోసమే రూ.2500
ఇంగ్లీష్ మీడియంలో చదివిపించాలన్న తల్లిదండ్రుల ఆసక్తిని గమనించిన పాఠశాల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. నర్సరీ తరగతులకు రూ.15వేలు వసూలు చేస్తున్నారు. ఇక పదవతరగతి విద్యార్థికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న విద్యాసంస్థలూ ఉన్నాయి. యూనిఫాం కోసం రూ.2,5 00, పెన్నులు, స్టేషనరీ ఖర్చుల కోసం రూ.1000, పుస్తకాల కోసం రూ. 4 వేల నుంచి రూ.5వేల వరకు, హాస్టల్‌లో ఉంచితే కనీసం రూ.60 వేల నుంచి రూ.80వేలు వరకు ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఖర్చు రూ.లక్ష దాటుతోంది. వీటికి తోడు కొన్ని పాఠశాలలు 5వ తరగతి నుంచి మెడిసిన్, ఐఐ టీ ఫౌండేషన అంటూ అధికంగా ఫీజులు వసూ లు చేస్తున్నారు. ముందస్తు కోచింగ్‌ల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత వసూలు చేస్తున్నా పిల్లల భవిష్యత కోసం తల్లిదండ్రులు రాజీ పడుతున్నారు.
అదిరిపోతున్న ఖర్చు
జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థికి కేవలం పుస్తకాల ఖర్చు రూ.5000 వసూలు చేశారు. ఇవే పుస్తకాలను బయట మార్కెట్లో కొనుగోలు చేస్తే రూ.1200 మించవు. కేవలం ఆ పాఠశాలల్లోనే తీసుకోవాల నే నిబంధనతో నాలుగు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. టై, బెల్ట్‌ల ఖరీదు కూడా విపరీతంగా వసూలు చేస్తున్నారని, నర్సరీకి కూడా రూ.25 నుంచి రూ.30 వేల ఫీజులు వసూలు చేసే పాఠశాలలు కూడా జిల్లా కేంద్రంలో ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట, కోదాడలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చదివించాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 6-10వ తరగతి వరకు వివిధ రకాల ఫౌండేషన్ పేరుతో వసూ లు చేస్తున్న ఫీజులు అధికంగా ఉన్నాయి.
జిల్లాలో 52 వేల మంది
జిల్లాలో 370 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అనధికారికంగా మరికొన్ని ఉంటాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనందిస్తున్నారు. ఇం దులో 1వ తరగతికి రూ.40 వేలు తీసుకుంటున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువ మొ త్తంలో ఫీజులు ఉంటుండగా, పట్టణాల్లో ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. మొత్తం జిల్లాలో 52 వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై సరాసరి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఫీజు ఉంటుండగా, ఆ తర్వాత బస్ చార్జీలు ఉంటున్నాయి.
ఫీజుల పేరుతో దోపిడీ
ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. పాఠశాల్లోనే పుస్తకాలు విక్రయిస్తున్న వారిని గుర్తించి గుర్తింపును రద్దుచేయాలి. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ప్రతీ ఏడాది ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. అధిక ఫీజులను నియంత్రించాలి.
- చందర్‌రావు, పీడీఎ్‌సయూ జిల్లా ప్రధానకార్యదర్శి