‘మూగ’ వేదన
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:01 AM
దేశానికి రైతే వెన్నుముక. ఆ రైతుకు వెన్నుముక పశుసంపద. నేడు ఆ వెన్ను విరిగి, రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. కంటికి రెప్పలా, ఇంట్లో సభ్యుల మాదిరి కాపాడుకుంటున్న పశుసంపదకు ఆపదొస్తే ఆదుకునే వారు లేక కర్షకులు అతలాకుతలమవుతున్నారు.
నిధుల్లేవు.. మందులు రావు
పట్టించుకోని ప్రభుత్వం
మండలానికి ఒకట్రెండు పశువైద్య శాలలు.. అందులోనూ సిబ్బంది కొరత
మోత్కూరు రూరల్ మండలానికి పశువుల ఆస్పత్రే లేదు
పశువుల ఆస్పత్రులకు మందులు రాక ఆరు మాసాలు
గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు లేక రెండేళ్లు
తాళం తీయని చిన్నపడిశాల గ్రామీణ పశు వైద్యశాల
(ఆంధ్రజ్యోతి-మోత్కూరు): దేశానికి రైతే వెన్నుముక. ఆ రైతుకు వెన్నుముక పశుసంపద. నేడు ఆ వెన్ను విరిగి, రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. కంటికి రెప్పలా, ఇంట్లో సభ్యుల మాదిరి కాపాడుకుంటున్న పశుసంపదకు ఆపదొస్తే ఆదుకునే వారు లేక కర్షకులు అతలాకుతలమవుతున్నారు. పశువులకు కనీసం తినేందుకు మేత కరువై, రోగమొస్తే మందులు లేక, అత్యవసరమైతే ఆస్పత్రిలో వైద్యుడు లేక ఆ మూగ జీవాలు రోదిస్తున్న తీరు చూసి రైతు కంటతడి ఆరడంలేదు. జిల్లావ్యాప్తంగా పశువైద్యశాలలు అలంకార ప్రాయంగా మారాయన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం, అటెండర్లే వైద్యులుగా మారుతుండడం అగమ్యగోచరంగా మారింది.
మూగ జీవాలకు చికిత్స చేయడానికి ఉన్న ఆస్పత్రులే తక్కువ. ఆ కొద్దిపాటి ఆస్పత్రుల్లోనూ సిబ్బంది కొరత. మండలకేంద్రాల్లోని పశువైద్యశాలలకు, గ్రామాల్లోని గ్రామీణ పశువైద్యశాలలకు (సబ్‌సెంటర్లకు) నెలల తరబడి మందులు సరఫరా కావడంలేదు. ఫలితంగా మూగజీవాలకు జబ్బుచేస్తే మందులు ప్రైవేటుగా కొని తెచ్చుకోవాల్సిందేనంటున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పశువుల ఆస్పత్రుల పని తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన జరుపగా పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మోత్కూరు మునిసిపల్ కేంద్రంలో..
మోత్కూరులో ఏడీ స్థాయి పశువైద్యశాల ఉంది. ఇందులో ఉండే ఏడీగాని, వెటర్నరీ అసిస్టెంట్‌గాని ఆస్పత్రికి తీసుకొచ్చిన పశువులకే చికిత్స చేస్తారు. మండలంలోని గ్రామాల్లో మూగ జీవాలు నడవలేని పరిస్థితి ఉన్నా, చూడి పశువులు ఈనడం కష్టమైనా వారు చికిత్స చేయడానికి క్షేత్రస్థాయికి వెళ్లరు. మండల వైద్యాధికారి వెళ్లాల్సి ఉంటుంది. మోత్కూరు మండలంలో 10 గ్రామాలుండగా మండలంలో వెటర్నరీ డాక్టర్ స్థాయి ఆస్పత్రి లేదు. గతంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు అడ్డగూడూరు ఆస్పత్రిలో ఉన్న వైద్యుడే ఉమ్మడి మండలాన్ని చూసేవారు. అడ్డగూడూరు మండలం వేరయ్యాక మోత్కూరు మండలానికి ఆస్పత్రి లేక డాక్టర్ లేకుండాపోయారు. అడ్డగూడూరు, కూరెళ్ల, ఆత్మకూరు(ఎం) ఆస్పత్రుల్లోని డాక్టర్లలో ఎవరో ఒకరికి మోత్కూరు మండలాన్ని ఇన్‌చార్జి ఇస్తున్నారు. గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు చికిత్సకు సలహాలు తీసుకోవడానికైనా, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందడానికైనా మండలం దాటి వేరే మండలానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మోత్కూరు మునిసిపల్‌కేంద్రంలోని పశువైద్యశాల ఏడీని జిల్లాకేంద్రానికి ఇన్‌చార్జి జేడీగా పంపారు. మోత్కూరు పశువైద్యశాలను ఆత్మకూరు(ఎం) డాక్టర్‌కు ఇన్‌చార్జి ఇచ్చారు. మోత్కూరు మండలంలో దత్తప్పగూడెంలో ఒక సబ్‌సెంటర్ (గ్రామీణ పశువైద్యశాల) ఉంది. అందులో వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి దత్తప్పగూడెం గ్రామీణ పశువైద్యశాలను ఆస్పత్రి స్థాయికి పెంచడానికి కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ విషయమే మరుగున పడింది. అనాజిపురం లేదా పాటిమట్లలో వెటర్నరీ డాక్టర్ ఉండేస్థాయి పశువుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మండలంలోని గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు కోరతున్నారు.
ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత..
అడ్డగూడూరు మండలకేంద్రంలో ఒక డాక్టర్‌స్థాయి ఆస్పత్రి, కంచనపల్లి, చిన్నపడిశాల గ్రా మాల్లో సబ్‌సెంటర్లు ఉన్నాయి. మండలకేంద్రంలోని ఆస్పత్రిలో డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్ ఉం డగా అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. చిన్నపడిశాల సబ్‌సెంటర్‌లో సిబ్బంది ఎవరూ లేరు. కంచనపల్లి ఎల్‌ఎ్‌సఏకు ఇన్‌చార్జి ఇచ్చారు. ఆయన ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతారని చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఆస్పత్రికి తాళం వేసే ఉంటుందంటున్నారు. మండలంలోని వెల్దేవి, మానాయకుంట, గట్టుసింగారం ప్రాంతంలో ఒక సబ్‌సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు కోరుతున్నారు.తిరుమలగిరి మండలంలో ఒక ఆస్పత్రి, ఒక సబ్‌సెంటర్, నాగారం మండలంలో రెండు ఆస్పత్రులు, నూతనకల్ మండలంలో రెండు ఆస్పత్రులు, మద్దిరాల మండలంలో ఒక ఆస్పత్రి, అర్వపల్లి మండలంలో ఒక ఆస్పత్రి, ఒక సబ్‌సెంటర్ ఉన్నాయి.డాక్టర్లు ఉన్నా, ఇతర సిబ్బంది కొరత ఉంది. మద్దిరాలలో ఒక సబ్‌సెంటరైనా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆస్పత్రులకు మందుల సరఫరా లేక ఆరు నెలలు
తుంగతుర్తి నియోజకవర్గంలోని పశువుల ఆస్పత్రులకు, మోత్కూరు, తుంగతుర్తిలోని ఏడీ స్థాయి పశువైద్యశాలలకు ఆరు నెలలుగా అవసరమైన మందులు సరఫరా చేయడం లేదంటున్నారు. డాక్టర్లు ఇండెంట్ పెడుతున్నప్పటికీ మందులు సరఫరా కావడం లేదంటున్నారు. ఏడాదికి నాలుగు క్వార్టర్లుగా (మూడు మాసాలకోసారి) ఆస్పత్రులకు మందులు సరఫరాచేస్తా రు. గత రెండు క్వార్టర్లకు ఆస్పత్రులకు మందు లే సరఫరా కావడం లేదని డాక్టర్లు చెబుతున్నా రు. సుమారు రెండేళ్లుగా గొర్రెలు, మేకలకు నట్ట ల నివారణ మందులు ఆస్పత్రికి రావడం లేదంటున్నారు. నియోజకవర్గంలో పశువుల కన్నా గొర్రెలు, మేకల పెంపకం ఎక్కువ. ఏడాదికి రెం డు పర్యాయాలైనా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించాలి. రెండేళ్లుగా ఆస్పత్రులకు నట్టల నివారణ మందులు సరఫరా కాకపోవడంతో తామే దుకాణాల్లో కొని తెచ్చుకుంటున్నామని పలువురు గొర్రెలు, మేకల పెం పకం దారులు చెబుతున్నారు. పశువులు, గొర్రె లు, మేకలకు జబ్బు చేసినప్పుడు ఆస్పత్రికి తీసుకెళితే మందులు లేవంటున్నారని, 75శాతం మందులు రాసి ఇస్తే ప్రైవేటు దుకాణాల్లో కొని తీసుకెళ్లి ఇప్పించుకుంటున్నామని వాటి పెంపకందారులు చెబుతున్నారు. గడ్డి విత్తనాలు తమ ఆస్పత్రులకు సరఫరా చేయరని, ప్రభుత్వం జిల్లాకేంద్రానికి పంపితే తమ సొంత ఖర్చుతో తెచ్చుకోవాల్సి వస్తున్నదని డాక్టర్లు చెబుతున్నారు.
నట్టల నివారణ మందులూ ఇవ్వడం లేదు : దండెబోయిన శ్రీశైలం, గొర్రెల పెంపకందారు, కొండగడప
గొర్రెలకు యేడాదికి రెండు సార్లు అయినా నట్టల నివారణ మందు తాగించాలి. సుమారు రెండేళ్లుగా పశువుల డాక్టర్లు నట్టల నివారణ మందు ఆస్పత్రులకు రావడం లేదని చెబుతున్నారు. నేనే దుకాణంలో నట్టల నివారణ మందు కొని తెచ్చుకుని గొర్రెలకు తాగిస్తున్నా. ఆస్పత్రుల్లో ఏ మందులూ లేవంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశువుల ఆస్పత్రులకు అన్ని రకాల మందులు సరఫరా చేయాలి.
ఆస్పత్రికి వెళ్లితే మందులు లేవంటున్నారు : నాగుల రవి, రైతు, ఆరెగూడెం
నాకు గొర్రెలు, పాడి గేదెలు ఉన్నాయి. వాటికి జబ్బు చేసినప్పుడు ఆస్పత్రికి తీసుకెళితే ఆస్పత్రిలో మందులు లేవని కొనుక్కొని తీసుకరమ్మని రాసి ఇస్తున్నారు. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా ఇప్పుడు మందులు లేవంటున్నారు. ఎప్పుడొస్తాయని అడిగితే ఇంకో రెండు నెలలకు వస్తాయంటున్నారు. మందులు లేని పశువుల ఆస్పత్రి ఉండి ఏం లాభమో అర్థం కావడంలేదు. ఏ చిన్న జబ్బు చేసినా మందులు దుకాణంలో కొని తెచ్చుకుంటున్నాం.
-