Share News

నిడమనూరు చెరువు నుంచి హాలియాకు తాగునీరు

ABN , Publish Date - May 24 , 2025 | 12:25 AM

నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నుంచి హాలియా మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అఽధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

నిడమనూరు చెరువు నుంచి హాలియాకు తాగునీరు

నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు

ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు

ప్రత్యేక తూము ఏర్పాటుకు చర్యలు

సాగర్‌ నీటితో నేరుగా చెరువు నింపేందుకు ఏర్పాట్లు

గతంలోనూ నల్లగొండకు నీరు

ఇక నుంచి చెరువు నిత్యం నిండుకుండ

నిడమనూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నుంచి హాలియా మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అఽధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకోసం నిడమనూరు చెరువును మళ్లీ రిజర్వాయర్‌గా మార్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. పక్కనే ఉన్న నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నీటితో ఈ చెరువును నింపనున్నారు.

నిడమనూరు మండల కేంద్రంతో పాటు హాలియా పట్టణానికి నల్లచౌట చెరువు నుంచి తాగునీటిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్‌ నీటితో చెరువును నింపేందుకు ప్రత్యేక తూము(ఓటీ) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలోనూ నిడమనూరు చెరువు రిజర్వాయర్‌గా ఉండేది. సాగర్‌ నీటితో చెరువును నింపి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుతో నల్లగొండ పట్టణానికి వేసవిలో ముప్పారం తాగునీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేసేవారు. ఉదయ సముద్రం ద్వారా నల్లగొండ పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తుండటంతో ప్రస్తుతం ముప్పారం తాగునీటి పథకం మూలన పడింది. పెరుగుతున్న జానాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా లేకపోవడంతో మళ్లీ నిడమనూరు చెరువును రిజర్వాయర్‌గా మార్చే అంశం తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం తాగునీటి అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతోంది. దీంతో ఇటీవల ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై నిడమనూరు చెరువును రిజర్వాయర్‌గా మార్చి తాగునీటిని సరఫరా చేసే అంశాన్ని చర్చించారు. నిడమనూరు చెరువు గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ఎగువున ఉన్న చెరువులు నిండితేనే నిడమనూరు చెరువు నిండుతుంది. చెరువు చెంంతనే సాగర్‌ ఎడమకాల్వ ఉంటుంది. గతంలో నిడమనూరు చెరువు రిజర్వాయర్‌గా ఉన్నప్పటికీ సాగర్‌ నీటితో చెరువు నింపేందుకు ప్రత్యేక తూములుగానీ ఫీడర్‌ చానళ్లు గానీ ఏర్పాటు చేయలేదు. మేజర్లకు నీటిని విడుదల చేస్తే పొలాల నుంచి పంట కాల్వల మీదుగా చెరువులోకి నీరు వచ్చేది. దీంతో సరైన వర్షాలు లేకపోతే చెరువు ఎడారిగా మారేది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో చెరువు ఎండిపోయి ఉంది. ఈ చెరువు ఆధారంగా ఎంతోమంది రైతులు, మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వందలాది ఎకరాల్లో చెరువు విస్తరించి ఉన్నా, నీరులేకపోవడంతో చాలామంది ఆక్రమించి సేద్యం చేసుకుంటున్నారు. చెరువు నిండినప్పుడు ఆక్రమిత భూములు మునిగిపోతాయని కొందరు రాత్రి సమయాల్లో తూములు ఎత్తి చెరువు నుంచి నీటిని ఖాళీ చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సాగర్‌ నీటితో చెరువు నింపేందుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేక తూము ఏర్పాటు చేస్తే వేసవిలో సాగర్‌ కాల్వలకు నీటిని నిలిపివేసే సమయంలో తూము ద్వారా చెరువును నింపే అవకాశం ఉంటుంది. దీంతో చెరువు నిత్యం నీటితో నిండుకుండలా ఉండి సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్‌, రెవెన్యూ, ఐబీ అధికారులు త్వరలో చెరువును సందర్శించి ప్రత్యేక తూము ఏర్పాటును పరిశీలించనున్నారు. చెరువును రిజర్వాయర్‌గా చేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ప్రయోజనం కలుగుతుంది.

సాగర్‌ నీటితో చెరువు నింపే ప్రయత్నం : శివరాత్రి శ్రీనివాస్‌, ఐబీ డీఈ

నిడమనూరులోని నల్లచౌట చెరువును సాగర్‌ ఎడమకాల్వ నీటితో నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌ నీటితో చెరువు నింపేందుకు ప్రత్యేక తూములు లేవు. ఈ మేరకు చెరువును సాగర్‌ నీటితో నింపేందుకు ప్రత్యేక తూము (ఓటీ) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించడం జరుగుతుంది. త్వరలో ఉన్నతాధికారులు చెరువును పరిశీలించనున్నారు.

Updated Date - May 24 , 2025 | 12:25 AM