Share News

రాచకొండ ఎత్తిపోతలకు డీపీఆర్‌ రూపొందించాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:01 AM

సంస్థాన నారాయణపురం మండలంతో పాటు చౌటుప్పల్‌ మండలానికి సాగునీరు అందించేందుకు రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వెంటనే డీపీఆర్‌ రూపొందించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా నాయకులు దోనూరు నర్సిరెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, జి.శ్రీనివాసచారి డిమాండ్‌ చేశారు.

రాచకొండ ఎత్తిపోతలకు డీపీఆర్‌ రూపొందించాలి
చౌటుప్పల్‌లో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

సంస్థాన నారాయణపురం, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : సంస్థాన నారాయణపురం మండలంతో పాటు చౌటుప్పల్‌ మండలానికి సాగునీరు అందించేందుకు రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వెంటనే డీపీఆర్‌ రూపొందించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా నాయకులు దోనూరు నర్సిరెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, జి.శ్రీనివాసచారి డిమాండ్‌ చేశారు. చర్లగూడెం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని నారాయణపురం, జనగాం, వాయిల్లపల్లి, చిళ్లాపురం, పొర్లగడ్డ తండా గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం రాచకొండలో గోసు గుండు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రాచకొండ ఎత్తిపోతల పథకం ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపురం మండలంలో ఎలాంటి సాగునీటి వనరులు లేకపోవడంతో ప్రతీ సంవత్సరం కరువు కాటకాలు సంభవించి, రైతులు ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ప్రతీ ఐదేళ్లలో మూడేళ్లు కరువే రాజ్యమేలుతోందన్నారు. వ్యవసాయం సరిగా సాగకపోవడంతో ఈ ప్రాంతంలో మహిళలు మేస్త్రీల చేతికిందికి కూలీకి వెళుతున్నారని వారు తెలిపారు. యువకులు ఆటో డైవ్రర్లుగా, హోటళ్లలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇప్పటికే 100 శాతం పనులు పూర్తయిన శివన్నగూడెం ప్రాజెక్టు 80 శాతం పూర్తి అవడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వమే చెప్తోందన్నారు. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తయ్యాక రాచకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే మండల రైతాంగానికి సాగునీరు రావడానికి మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. చర్లగూడెం ప్రాజెక్టుతో పాటే రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వెంటనే రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఆమోదించి బడ్జెట్లో అవసరం ఉన్న నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకోసం ఉద్యమాలు నిర్వహిస్తాన్నారు. కార్యక్రమం పార్టీ మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు మల్లేపల్లి లలిత, నాయకులు దొంతగాని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, పిట్ట రాములు, కేసిరెడ్డి యాదవరెడ్డి, చాడ నరసింహ, బొమ్మగాని శంకరయ్య, జనిగల నరసింహ, బిక్షపతి, శివశెట్టి లాలయ్య, పంకర్ల యాదయ్య, కడ్తాల బిక్షం, చింతకాయల నరసింహ,ఉప్పలపల్లి బాలకృష్ణ, రాచకొండ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:01 AM