Share News

దొడ్డు బియ్యం వేలం

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:21 AM

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే అంతకుముందు పంపిణీకి సిద్ధంగా ఉంచిన, రేషన్‌ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది.

దొడ్డు బియ్యం వేలం

సన్న బియ్యం పంపిణీతో గోదాముల్లో మిగిలిన దొడ్డు బియ్యం

నాలుగు నెలలుగా గోదాములు, రేషన్‌ డీలర్ల వద్దే 12వేల మెట్రిక్‌ టన్నులు..

క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే అంతకుముందు పంపిణీకి సిద్ధంగా ఉంచిన, రేషన్‌ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో బియ్యం నిల్వలపై సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేగాక జిల్లాలోని నిల్వలను ఎక్కడికి చేరుస్తారనే విషయంపై వారం రోజుల్లో స్పష్టత రానుంది.

దొడ్డు బియ్యం గోదాములు, రేషన్‌దుకాణాలకు చేరి నాలుగు నెలలు అవుతోంది. ఎక్కువ సమయం అలా గే ఉంచితే బియ్యానికి పురుగుపట్టే అవకాశం ఉంది. దీంతో ఆలస్యం చేస్తే బియ్యం దేనికీ ఉపయోగపడవని, వాటిని వేలం వేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ ఇండెంట్‌ ప్రకారం నిల్వలు ఉన్నాయా? లేదా? అని సరిచూస్తోంది. వేలం వేసేముందు బియ్యం అందుబాటులో లేనిపక్షంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది.

12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు

ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపి ణీ చేస్తోంది. మార్చి నెలలో దొడ్డు బియ్యం సరఫరా చేయగా, లబ్ధిదారులకు పంపిణీచేయగా రేషన్‌ దుకాణాల్లో కొంతమేర నిల్వలు ఉన్నాయి. దీంతో ఏప్రిల్‌లో ఆ మేరకు సన్న బియ్యాన్ని రేషన్‌ షాపులకు ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే అప్పటికే కోటా మేరకు దొడ్డు బియ్యం నిల్వలు జిల్లాకు చేరాయి. వర్షాకాలంతో పాటు ప్రకృతి విపత్తులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ (ఆహారభద్రతా కార్డులు) బియ్యాన్ని ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేసింది. జిల్లాలో మొత్తం 17మండలా లు, 427 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీ ల్లో 2,18,903 రేషన్‌కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు మూడు నెలల కోటా 13,517.796 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే జిల్లాలో అప్పటికే రేషన్‌దుకాణాలకు కోటా ప్రకారం దొడ్డుబియ్యం గోదాములకు చేరింది.ఆ తరువాత ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో దొడ్డు బియ్యం అలాగే మిగిలిపోయింది. గోదాములతోపాటు రేషన్‌ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు బియ్యం నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి? గోదాములు, రేషన్‌దుకాణాల్లో ఎన్ని టన్నుల బియ్యం నిల్వ ఉందనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12వేల మెట్రిక్‌ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్టు లెక్క తేల్చారు. వీటిలో 6వేల మెట్రిక్‌ టన్నులు సివిల్‌ సప్లయ్‌ గోదాముల్లో నిల్వ ఉండగా, మరో 6వేల మెట్రిక్‌టన్నులు రేషన్‌డీలర్ల వద్ద ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వేలం వేయనున్నారు. వేలం వేసే ముందు అనుకున్నంత మేరకు బియ్యం నిల్వలు ఉన్నాయా? లేదా అని క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

గోదాములు, రేషన్‌దుకాణాల పరిశీలన

సాధారణంగా రైస్‌ మిల్లుల నుంచి తొలుత స్టేజ్‌-1 గోదాములకు, ఆ తర్వాత స్టేజ్‌-2 గోదాములకు, అక్కడి నుంచి రేషన్‌దుకాణాలకు బియ్యం సరఫరా అవుతుంది. గోదాముల్లో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయనేది కాగితాల్లో నమో దు చేసినా వాస్తవంగా దుకాణాల్లో ఉన్నాయా? లేదా? అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. వే లం వేయాలంటే నిల్వలే ముఖ్యం. దీంతో ఏ మేరకు దొడ్డు బియ్యం అందుబాటులో ఉందో రెవెన్యూ, సివిల్‌సప్లయ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి పరిశీలిస్తున్నారు. గోదాములను తనిఖీలు చేసి స్టేజ్‌-1, స్టేజ్‌-2 నిల్వలపై ఆరా తీస్తున్నారు. ఎఫ్‌సీఐ నుంచి స్టేజ్‌-1 గోదాముకు వచ్చి న నిల్వలు, దుకాణాలకు సరఫరా చేయగా స్టేజ్‌-2 గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, అప్పటికే గోదాములు, దుకాణాలకు ఆ నెల కోటా దొడ్డు బియ్యం సరఫరా అయింది. మూడు నెలల కోటాను ముందుగానే జూన్‌లో పంపిణీ చేయ గా, సెప్టెంబరు వరకు రేషన్‌దుకాణాలు మూసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం నిల్వలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొడ్డు బియ్యం నిల్వలపై విజిలెన్స్‌ అధికారులు సైతం దృష్టి సారించారు. దుకాణాల్లో దొడ్డు బియ్యాన్ని ప్రత్యేకంగా నిల్వ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు గోదాముల్లో, రేషన్‌ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ డి.హరికృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

నిల్వలను పరిశీలిస్తున్నాం : జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు దొడ్డు బియ్యం నిల్వలపై సమగ్ర సమచారాన్ని సేకరిస్తున్నాం. గోదాములు, రేషన్‌ డీలర్ల వద్ద ఏమేరకు నిల్వలు ఉన్నాయి? ఎంత పంపిణీ చేశారో పరిశీలిస్తున్నాం. నిబంధనల ప్రకారం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేషన్‌డీలర్లు సైతం దొడ్డు బియ్యం నిల్వలను అధికారులకు చూపించాలి.

Updated Date - Aug 06 , 2025 | 12:21 AM