ఆహ్లాదం.. అజిలాపురం బుగ్గజలపాతం
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:38 AM
ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం. వాటి మధ్య పరుచుకున్న ప్రకృతి పచ్చదనం, చల్లటి గాలులు, పక్షుల కిలకిల రావాలతో నల్లగొండ జిల్లా మర్రిగూడ మం డలం అజిలాపురం బుగ్గజలపాతం పర్యాటకులను మైమరిపిస్తోంది.
ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం. వాటి మధ్య పరుచుకున్న ప్రకృతి పచ్చదనం, చల్లటి గాలులు, పక్షుల కిలకిల రావాలతో నల్లగొండ జిల్లా మర్రిగూడ మం డలం అజిలాపురం బుగ్గజలపాతం పర్యాటకులను మైమరిపిస్తోంది. గ్రామశివారులోని 2500 ఎకరాల్లోని అడవిలో అడుగడుగునా ప్రకృతి రమణీయతే కనిపిస్తుంది.
(ఆంధ్రజ్యోతి-మర్రిగూడ)
మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామశివారులో 2500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవులు వానాకాలంలో పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చుట్టూ ఉన్న కొండలపై నుంచి జాలువారే నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. వర్షాలు బాగా కురిస్తే ఆరు నెలల పాటు ఈ జలపాతాలు కనులవిందు చేస్తుంటాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు జలధారగా ఎత్తయిన కొండచరియల మీద నుంచి దూకుతూ కనువిందు చేస్తున్నాయి. ఈ మనోహర దృశ్యాలను చూసేందుకు వివిధప్రాంతాల నుంచి పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి బుగ్గజలపాతంలో తడిసి ముద్దవుతున్నారు. ఇక్కడే వంటా వార్పు చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదం మధ్య సేదతీరుతున్నారు.
రెండు కిలోమీటర్ల కాలినడక
దూరప్రాంతాల నుంచి బుగ్గజలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులకు అక్కడే కొలువుదీరిన బుగ్గ లక్ష్మీనరసింహస్వామి ఆల యం ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తోంది. దేవాలయం పక్కనే వాహనాలు నిలిపి బుగ్గజలపాతాన్ని చూసేందుకు కాలిబాటలో రెండు కిలోమీటర్ల మేర కొండచరియల వెంట పచ్చనిచెట్ల మధ్య ప్రకృతిఅందాలను ఆస్వాదిస్తూ నడవడం పర్యాటకులకు సంతృప్తిని ఇస్తోంది.
పర్యాటక కేంద్రంగా గుర్తించాలి
బుగ్గజలపాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఎత్తయిన కొండల మధ్య జారువారుతున్న నీటిప్రవాహాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులకు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే అభివృద్ధి చెందుతుంది.
చందునాయక్, సామాజిక కార్యకర్త