రహదారుల విస్తరణలో జాప్యం
ABN , Publish Date - May 26 , 2025 | 12:23 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. భారీగా రోడ్ల విస్తరణ, మరమ్మతుల పనులు చేపట్టగా, పనుల ఆలస్యంగా కారణంగా ఆయా ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పనులకు మోక్షం కరువు
భారీగా రోడ్ల పనులు చేపట్టినా బిల్లుల జాప్యంతో నత్తనడకన
దశాబ్దాలుగా మరమ్మతులకు నోచని రోడ్లపై దృష్టి పెట్టాలంటున్న స్థానికులు
చందంపేట-దేవరచర్ల రహదారి దుస్థితి
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. భారీగా రోడ్ల విస్తరణ, మరమ్మతుల పనులు చేపట్టగా, పనుల ఆలస్యంగా కారణంగా ఆయా ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సమీపిస్తుండడంతో రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, లేదంటే వానాకాలంలో ఇబ్బందులు తప్పని స్థానికులు వాపోతున్నారు. మరమ్మతుల నిమిత్తం ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40కి పైగా రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వీటికితోడు వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 500 కిలోమీటర్ల పైచిలుకు రోడ్లకు ప్యాచ్‌లు చేయాల్సి ఉంది. వీటన్నింటినీ తక్షణం చేపట్టేందుకు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
నల్లగొండ జిల్లాలో నాలుగులేన్ల రోడ్ల విస్తరణ పనులకు 20 రహదారులను ఎంపికచేశారు. ఈ పనులన్నీ ప్రారంభమై ఏడాది దాటుతుండగా, బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా పనులు వేగంగా సాగడం లేదు. సుమారు రూ.400కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈ రోడ్లు పూర్తయితే దాదాపు 397కిలోమీట ర్ల మేర ప్రధాన రహదారి సదుపాయం కలుగుతుంది. కీలకమైన ముషంపల్లి-కన్నెకల్ రోడ్డు, దేవరకొండ పట్టణంలోని రోడ్లు, చండూరు(బంగారిగడ్డ)-నాంపల్లి-కొండమల్లేపల్లి, వంటి ప్రధాన రోడ్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు కీలకమైన యాదాద్రి పవర్‌స్టేషన్‌ను అనుసంధానించే దామరచర్ల-వీర్లపాలెం ప్రధాన రహదారిని సైతం నాలుగులేన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదించినా పనులు ప్రారంభం కాలేదు.
జిల్లాలో గత వానాకాలంలో గుంతలుపడ్డ 59కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రతిపాదించినా, ఇంకా నిధులు రాకపోవడంతో పనులు చేపట్టలేదు. ఈ నెలలో పనులు చేపట్టే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.
నార్కట్‌పల్లి మండల కేంద్రంలో పూర్వజాతీయరహదారి విస్తరణ పనులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సుమారు రూ.16కోట్లతో చేపట్టారు. ఈ రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేయకపోవడంతో వర్షాకాలం లో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద వర్షపునీరు నిలిచి రాకపోకలకు అసౌకర్యంగా మారింది. రెండు జాతీయరహదారుల జంక్షన్ అయిన నార్కట్‌పల్లిలో ఈ పరిస్థితి నెలకొనడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టంగూరు మండలం పిట్టంపల్లి నుంచి నల్లగొండ మండలం మర్రిగూడ బైపాస్ వరకు 5.500కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.9.6కోట్ల నిధులు మంజూరయ్యాయి. కల్వర్టులు, సీసీ పనులు సాగుతున్నాయి. పనులు వేగంగా చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
కట్టంగూరు నుంచి కురుమూర్తికి వెళ్లే 8కిలోమీటర్ల రహదారి గుంతలమయంగా మారి అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డును డబు్ లేన్గఆ విస్తరించాలనే డిమాండ్ ఉన్నా, ప్రస్తుతానికి కనీసం మరమ్మతులైనా చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మనుగోడులోని ప్రధాన కూడలిలో రూ.24కోట్లతో సుమారు 2.5కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.
చండూరు మండలం బంగారిగడ్డ నుంచి నాంపల్లి మీదుగా కొండమల్లేపల్లి వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులను రూ.60.80కోట్లతో చేపట్టారు. ఈ పనులు ఆలస్యంగా కొనసాగుతుండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
చండూరు నుంచి మర్రిగూడ రోడ్డు దారుణంగా తయారైంది. 12కిలోమీటర్ల ఈ రహదారికి రూ.30కోట్ల నిధులు మంజూరయ్యాయి. నేటివరకు పనులు ప్రారంభం కాలేదు.
చండూరు నుంచి తాస్కానిగూడెం వరకు 4కిలోమీటర్లకు రూ.13కోట్ల మంజూరవగా, చండూరు-గట్టుప్పల్-నారాయణపురం రోడ్డుకు రూ.30కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది.
మునుగోడు-నాంపల్లి రోడ్డులో మేజర్, మైనర్ బ్రిడ్జిలు ఐదింటికి రూ.17కోట్లు మంజూరవగా, టెండర్లు ప్రక్రియ కొనసాగుతోంది.
చండూరు-కస్తాల-గుర్రంపోడు రహదారి దారుణంగా మారినా పట్టించుకునే నాథుడు లేడు.
దేవరకొండ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం నుంచి మండలంలోని చెన్నారం వరకు 7కిలోమీటర్ల రోడ్డును రూ.6.40కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టారు. ఈ పనులు 40శాతమే పూర్తయ్యాయి.
డిండి మండల కేంద్రం నుంచి దేవరకొండకు వెళ్లే ప్రధాన రహదారి 3కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారింది. నూతన నిర్మాణానికి శిలాఫలకం వేసినా పనులు ప్రారంభం కాలేదు.
చింతపల్లి మండలంలోని సాయిరెడ్డిగూడెం-రాయన్నగూడెం-కురవంపల్లి-కిష్టరాయన్‌పల్లి వరకు ఉన్న 5కిలోమీటర్ల రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది.
జిల్లా రహదారులు ఇలా..
యాదాద్రి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు పలుచోట్ల గుంతలమయంగా మారాయి. రాజీవ్‌రహదారి (గజ్వేల్)-చిట్యా ల రోడ్డు విస్తరణకు నోచలేదు. జిల్లాలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్‌లో అర్‌అండ్‌బీ పరిధిలో 162కిలోమీటర్ల రోడ్లకు రూ.126కోట్లతో ప్రతిపాదించారు. ఈ పనులన్నీ టెండర్ల దశలో ఉన్నాయి. వెంటనే పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.