నకిలీలపై నిఘా
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:39 AM
నకిలీ అధ్యాపకులపై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ 2025 మేలో రెగ్యులరైజ్ అయిన వారి విద్యార్హతలు, పూర్వాపరాలు, వ్యక్తిత్వం, నియామక ఉత్తర్వుల్లోని నిబంధనల పరిశీలనకు ఉపక్రమించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ ఎట్టకేలకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది.
వరంగల్ ఆర్‌జేడీ నేతృత్వంలో విచారణకు కమిటీ !
ఇంటర్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌లో తప్పుడు పత్రాల పరిశీలనకు ఆదేశం
ఉమ్మడి జిల్లాలోనూ పలువురిపై ఫిర్యాదులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): నకిలీ అధ్యాపకులపై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ 2025 మేలో రెగ్యులరైజ్ అయిన వారి విద్యార్హతలు, పూర్వాపరాలు, వ్యక్తిత్వం, నియామక ఉత్తర్వుల్లోని నిబంధనల పరిశీలనకు ఉపక్రమించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ ఎట్టకేలకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది.
క్రమబద్దీకరణ పొందిన లెక్చరర్లలో పలువురు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారనే ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో తాజాగా బోర్డు రెగ్యుల ర్ అయిన అధ్యాపకుల సర్టిఫికెట్ల పరిశీలనకు కమిటీని ఏర్పాటుచేసింది. నకిలీ సర్టిఫికెట్లపై సమస్త ఆధారాలతో ఉన్నతాధికారులకు, సీబీసీఐడీకి సైతం ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసిందే. పలుమార్లు ఇంటర్ బోర్డ్ అధికారులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించినా అమ్యామ్యాలతో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా సర్టిఫికెట్ల పరిశీలనకు కమిటీని నియమించడంతో నకిలీలు వెలుగులోకి వచ్చి చర్యలుంటాయనే ఆశాభావం ఇంటర్ అధ్యాపకుల్లో వెల్లడవుతోంది. శనివారం ఇంటర్‌బోర్డు డైరెక్టర్ విడుదలచేసిన ఉత్తర్వుల ప్రకారం వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ చైర్మన్‌గా నియమించిన ఈ కమిటీలో ఇంటర్‌విద్య అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి, యూనివర్సిటీ నుంచి ఒక అధికారి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడితో పాటు ఇంటర్‌విద్య డిప్యూటీ డైరెక్టర్ శివకుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అన్ని జిల్లాల్లో ఇంటర్ ఎడ్యుకేషన్‌లో రెగ్యులర్ అయిన అధ్యాపకుల సర్టిఫికెట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తద్వారా నకిలీలు తేలితే చర్యలకు సిఫారసు చేస్తారు.
ఉమ్మడి జిల్లాలోనూ నకిలీ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు
ఇంటర్ అధ్యాపకులుగా రెగ్యులర్ అయిన వారిలో ఉమ్మడి జిల్లాలోనూ కొందరిపై నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారనే ఫిర్యాదులున్నాయి. క్రమబద్ధీకరణ సమయంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని, వారిని విధులనుంచి తొలగించడంతోపాటు, చర్యలు తీసుకోవాలని కోరుతూ 2023, డిసెంబర్ 18వ తేదీన తెలంగాణ ప్రభుత్వ విద్యావనరుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, ఓయూ రీసెర్చ్‌స్కాలర్ వేముల శేఖర్ ఇంటర్ విద్యాశాఖ ఆర్‌జేడీ, కమిషనర్‌తోపాటు ఆయా జిల్లాల ఇంటర్ విద్యాధికారులకు ఫిర్యాదుచేశారు. మొత్తం 11మంది లెక్చరర్లపై ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అప్పట్లో విచారణకు ఆర్‌జేడీ ఆదేశించగా, ఆయా జిల్లాల డీఐఈవోలు, సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి పారదర్శకత తేల్చే నిమిత్తం సర్టిఫికెట్లు తెప్పించి పరిశీలించి, నివేదికలు ఇచ్చినా చర్యలు మా త్రం కరువయ్యాయి. ఈ లెక్చరర్లపై నమోదయిన కేసు విచారణలో ఉన్నందున వార్షిక ఇంక్రిమెంట్ నిలిపివేయాలని ఆర్‌జేడీ సంబంధిత డీఐఈవోలు, ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులివ్వడంతో వీరికి ఒక ఇంక్రిమెంట్ ఆగిపోయింది. అంతకుమించి చర్యల విషయంలో ముందడుగు పడలేదు. ఈ నకిలీ సర్టిఫికెట్ల విచారణ ముందుకు జరగకుండా, చర్యలు తీసుకోకుండా కమిషనరేట్ స్థాయిలోని ముఖ్య అధికారులే తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంటర్‌బోర్డు అధికారులతోపాటు సీబీసీఐడీ అదనపు డీజీకి కూడా ఈ నకిలీ సర్టిఫికెట్ల అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా ఈ నకిలీలపై చర్యలకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించడంతో ఉమ్మడి జిల్లాలోనూ నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారనే ఆశాభావం వెల్లడవుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పాటు, రెగ్యులరైజ్ అయిన వారి పూర్వాపరాలు, వ్యక్తిత్వం పైనా ఈకమిటీ పరిశీలన జరపనుండడంతో దురుసుగాప్రవర్తించేవారు, తోటి అధ్యాపకులతో అసభ్యకరంగా ప్రవర్తించేవారిపై వచ్చిన ఫిర్యాదులపైనా ఈ కమిటీ విచారణ జరుపుతుందని భావిస్తున్నారు.