రోజంతా ఎడతెరిపి లేని వర్షం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:02 AM
తుఫాను కారణంగా భువనగిరిలో బుధవారం రోజంతా వర్షం కురిసింది. 54.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.
రోడ్లపై విరిగిపడిన చెట్లకొమ్మలు
పొంగిపొర్లిన వాగులు, చెరువులు, కుంటలు
నీటమునిగిన పంట పొలాలు
భువనగిరి టౌన, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాను కారణంగా భువనగిరిలో బుధవారం రోజంతా వర్షం కురిసింది. 54.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది. అర్బనకాలనీలో రెండు విద్యుత స్తంబాలు విరిగాయి. మరికొన్ని ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగిపడగా తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలలో వరదనీరు చేరింది. మురికి కాలువలు, రహదారులు వర్షం నీటితో పొంగి ప్రవహించాయి. పాఠశాలలకు ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారు. సెలవు ప్రకటన రాకముందే పలువురు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిపోయారు. అనంతరం సెలవు ప్రకటించడంతో వెనుతిరిగినప్పటికీ వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల్లో వర్షం నీరు నిలవడంతో రైతులలో ఆందోళన నెలకొన్నది. ఇతర ప్రాంతాల వాసులు రాకపోవడం, పట్టణవాసులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడంతో రహదారులపై జనసంచారం తగ్గడంతోపాటు అన్ని మార్కెట్‌లలో కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. శిఽథిల భవనాలకు విద్యుత స్తంభాలకు, ట్రాన్సఫార్మర్లకు, చెట్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం నీటితో స్తంభించే మురికి కాలువలను, మ్యానహోల్స్‌ను శుభ్రం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు మునిసిపల్ కమిషనర్ జి.రామలింగం తెలిపారు. ఈ మేరకు ఆయన పలు బస్తీలను పరిశీలించారు.
భువనగిరి రూరల్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో కృష్ణారెడ్డి సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మోత్కూరులో అలుగుపారిన చెరువులు
మోత్కూరు : మోత్కూరు మండలంలో ఈ ఏడాది ఎన్నో భారీ వర్షాలు కురిసినా నిండని దాచారం రామసముద్రం, బుజిలాపురం తదితర చెరువులు, అనాజిపురం ఎర్రకుంట ఈ వర్షానికి నిండి అలుగులు పోస్తున్నాయి. దాచారం రామసముద్రం చెరువు నిండి అలుగుపోస్తుండటంతో చెరువు సమీపంలో ఉన్న గంగమ్మ తల్లి ఆలయం చుట్టూ నీరు చేరి ఆలయం నీటిలో తేలియాడుతున్నట్టనిపించింది. దాచారం రాముని బండ మీద ఏర్పాటు చేసిన ఐకేసీ కేంద్రంలో పలువురు రైతులు ధాన్యం రాశులు పోశారు. చెరువు నిండి అలుగు పోస్తుండటంతో అలుగు నీరు బండపై నుంచి వెళ్లి ధాన్యం రాశులు కొట్టుకపోతుండటంతో వర్షంలోనే రైతులు నానా ఇబ్బందులు పడి ధాన్యం రాశులను వేరే చోటుకు తరలించారు. మోత్కూరులో దేవరపల్లివారి కుంటకు గండి పడి కుంట కింద ఉన్న వరి చేను కొట్టుక పోయి ఇసుక మేట వేసింది. మోత్కూరుతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వరి, పత్తి, కంది చేలు నీట మునిగాయి. మోత్కూరు- నార్కట్‌పల్లి రోడ్డులో అనాజిపురం వద్ద రోడ్డు దాటరాకుండా ఎర్రకుంట అలుగు పోస్తోంది. మోత్కూరు-రాయగిరి ప్రధాన రహదారిపై కప్రాయపల్లి వద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో కొంత సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామలో వరద నీటికి అడ్డంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను కొంత తొలగించి వదిలేయడంతో ప్రధాన వీథి పూర్తిగా జలమయమై, ఇళ్లలోకి నీరు వెళ్లింది. సమస్యను మోత్కూరు వచ్చిన భువనగిరి ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వర్షంలోనే ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ సతీ్‌షకుమార్‌ను ఆదేశించారు. మోత్కూరు మార్కెట్లో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ పి.జ్యోతి, ఆర్‌ఐ సుమన, సింగిల్‌విండో కార్యదర్శి వరలక్ష్మీ, మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, మునిసిపల్ కమిషనర్ సతీ్‌షకుమార్ ఆయన వెంట ఉన్నారు. మునిసిపల్ కమిషనర్ పట్టణంలో పర్యటించి వరద నీరు వెళ్లని చోట ఎక్సకవేటర్‌తో కాల్వలు తీయించి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు. ఎడతెరపి లేని వర్షానికి రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లలేక పోయారు. గొర్రెలు, మేకలకు మేత కరువైంది. కల్లుగీత కార్మికులు తాటి చెట్లు ఎక్కలేక పోయారు.
వర్షానికి తడిసిన ధాన్యం రాశులు
చౌటుప్పల్ టౌన : చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు బుధవారం తడిసి ముద్దయ్యాయి. 82 మంది రైతులకు చెందిన ధాన్యం రాశుల కిందకు వరద నీరు చేరుకుంది. కొనుగోలు కేంద్రం సీసీ కల్లంలో ఉండడంతో వర్షపు నీరు వరద గా ప్రవహించడంతో ధాన్యం కూడ కొట్టుకుపోయింది. మిల్లర్ పెట్టిన గ్రేడ్ పంచాయితీతో మ్యాచర్ వచ్చిన ఆరుగురు రైతులు సైతం తూకాలు వేయించకపోవడంతో నష్టపోవలసి వచ్చింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్ డిమాండ్ చేశారు.
చిన మూసీలోకి వరద నీటి మళ్లింపు
చౌటుప్పల్ పట్టణానికి వరద ముప్పు ను తప్పించేందుకు గాను బుధవారం లక్కారం కాలువ ద్వారా వచ్చే వరద నీటిని చిన మూసీ నదిలోకి మళ్లించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన ఈ ముందస్తు చర్యల పట్ల పట్టణ వాసులలో హర్షం వ్యక్తమవుతోంది. తెప్పల చెరువు ప్రాంతంలోని గుట్టల ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న వరద నీరు దండు మల్కాపురం, కైతాపురం, లక్కారం చెరువల్లోకి చేరుకోవడంతో నిండి అలుగు పోస్తున్నాయి. లక్కారం చెరువు ఈ నెల 21 వ తేదీ నుంచి పోస్తున్న అలుగు నీటితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో చౌటుప్పల్ చెరువు 80 శాతం నిండినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్కారం చెరువు నుంచి వస్తున్న అలుగు నీటితోనే మరి కొన్ని గంటల్లో చెరువు నిండే అవకాశాలు ఉన్నాయి. లక్కారం చెరువులోకి నిర్మించిన కాలువకు దండు మల్కాపురం వద్ద గండి పెట్టించి వరద నీటిని చిన్న మూసీ నదిలోకి మళ్లించే ఏర్పాటు చేయించారు.
ఉధృతంగా బిక్కేరు
మోటకొండూరు/ ఆత్మకూరు(ఎం): పత్తి చేలలో నీరు నిలిచింది. వరి చేలు నేలకొరగడంతో రైతుల అవేదనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం తడిసింది. ఎగువన కురిసిన వర్షనికి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వాగులు వంకలు నిండి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు(ఎం) మండలంలో 162.3మీమీ వర్షం నమోదు అయ్యింది.
రామన్నపేట/ రాజాపేట: రామన్నపేట మండలం ఆసి్‌ఫనెహర్ కాల్వ పరిధిలోని చెరువులన్నీ అలుగుపారుతున్నాయి. ధాన్యం తడుస్తోంది. వరికోతలకు ఆటకం ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని, ప్రయాణాలు చేయొద్దని రామన్నపేట తహసీల్దార్ లాల్‌బహదూర్ సూచించారు. రాజాపేట మండలంలోని పొట్టిమర్రి వాగు పారుతుండటంతో రాత్రి యాదగిరిగుట్ట, రాజాపేట మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవొద్దు: ఆర్డీవో
ఆలేరు: వర్షాలు తగ్గేవరకు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి రైతులను కోరారు. బుధవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ధాన్యం తడవకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ అంజనేయులు, ఎంపిడివో సత్యాంజనేయప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, మార్కెట్ కమిటి సెక్రటరీలు పద్మజా, దివ్య, గిర్ధవర్ పూర్ణచందర్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వస్పరి స్వామి ఉన్నారు. ఆలేరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
యాదగిరిగుట్ట రూరల్: ప్రజలు, భక్తులతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డు, బస్టాండ్‌లో ప్రజలు ప్రయాణికులు లేక నిర్మానూష్యంగా మారింది. మునిసిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వామి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే 9493019033కు సమాచారం ఇవ్వాలని కోరారు.. సాయంత్రం 5గంటల వరకు 70.3 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు.