ఉపాధిహామీని బలహీనపరిచే కుట్ర
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:56 AM
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ అన్నారు.

వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నరసింహ
భువనగిరి గంజ్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ అన్నారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకాన్ని బలహీన పరిచే ప్రయత్నం చేస్తోందని, బడ్జెట్‌లో కోతలు, వేల కోట్లు వేతన బకాయిలు, పనులు ఇవ్వకపోవడం రెండు పూటలా హాజరు, ఆధార్ చెల్లింపులు 40శాతం మెటీరియల్‌కు అవకాశం కల్పించకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయడం లాంటి చర్యలు చట్ట విరుద్ధం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలనే మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చామని, ఈ సమ్మెకు అనుసంఽధానం చేస్తూ గ్రామీణ హర్తాళ్‌కు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చిందని తెలిపారు. కార్మిక కోడ్స్ అమలైతే గ్రామీణ పేదలు నయా బానిసలుగా దిగజారి పోతారన్నారు. మార్చి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా వేతనాలు నిర్ణయించిందన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టడానికి మే 20న గ్రామీణ హర్తాళ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యాక్షుడు పల్లెర్ల అంజయ్య, గంటోజు శ్రీనివా్‌సచారి, బోయ యాదయ్య, కొండపురం యాదగిరి, చింతకాయల నరసింహ, మనే సాలయ్య, కొమ్ము అంజయ్య, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సిలువేరు ఎల్లయ్య, యాట బాలరాజు పాల్గొన్నారు.