Share News

నీటి విడుదలపై సందిగ్ధం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:32 AM

బునాదిగాని కాల్వకు సాగు నీటి విడుదల మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్వ విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నెల 10వరకు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు గతంలో నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు.

నీటి విడుదలపై సందిగ్ధం

బునాదిగాని కాల్వ నీటి విడుదలకు నేటితో ముగియనున్న గడువు

నీటి విడుదలపై స్పష్టత ఇవ్వని అధికారులు

ఆలస్యమైందని రైతుల ఆందోళన

(ఆంధ్రజ్యోతి,బీబీనగర్‌): బునాదిగాని కాల్వకు సాగు నీటి విడుదల మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్వ విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నెల 10వరకు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు గతంలో నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించలేదు. అయితే అధికారులు విధించిన గడువు నేటితో ముగియనుండగా, నీటి విడుదల ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే నెల ఆలస్యమైందని, సకాలంలో నారు పోసి వరినాట్లు వేయకపోతే ఆశించిన దిగుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మూసీ కాల్వల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లు మంజూరు చేయగా, అందులో బునాదిగాని కాల్వకు రూ.266.69కోట్లు కేటాయించింది. మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల సరిహద్దులోని బీబీనగర్‌ మండలం మక్తానంతారం గ్రామ రెవెన్యూ పరిధిలో మూసీ ప్రారంభ పా యింట్‌ నుంచి దిగువన ఉన్న అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువు వరకు 98.64కిలో మీటర్ల పొడవున బునాదిగాని విస్తరణ పనుల ను మే నెలలో ప్రారంభించారు. పనుల నేపథ్యంలో ఈ నెల 10వరకు కాల్వకు నీటి విడుదలను నీటిపారుదలశాఖ అధికారులు నిలిపివేశారు.ఆయకట్టులో పంటలు వేసుకోవద్దని రైతులకు సూచించారు. దీంతో ఆయకట్టు రైతులు సాగుపనులను పూర్తిగా నిలిపివేశారు. ఈ నెల 10వ తేదీలోగా 5కిలో మీటర్ల పొడవున దిగువ ఉన్న ఎర్రకుంట వరకు పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. కాగా, గడువు నేటితో ముగియనుండగా, పనులు మాత్రం కిలోమీటరు కూడా దాటలేదు. కాల్వ ప్రారంభ పాయింట్‌ వద్ద 500మీటర్ల పొడవు మాత్రమే గైడ్‌ వాల్స్‌ పనులు పూర్తయ్యాయి. రెండు నెలల కాలంలో పనులు కిలోమీటరు దాటలేదని, కాల్వ పూర్తయ్యే సరికి ఇంకా ఎంత సమయం పడుతోందనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి విడుదల ఆలస్యమైతే నష్టం

కాల్వకు నీటి విడుదల ఆలస్యమైతే పంటలు సహజత్వం కోల్పోయి చీడపురుగు ఆశించడంతోపాటు వర్షాల లేక దిగుబడి తగ్గి పెట్టిన పెట్టుబడి కూడా చేతికందక నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నెలకు పైగా ఆలస్యమైందని, అదే సకాలంలో నారు పోసుకుని నాట్లు వేసి ఉంటే పంట సహజసిద్ధంగా పెరిగి దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణమే నీటివిడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

వారం రోజుల్లో నీటిని విడుదల చేస్తాం : భరత్‌కుమార్‌ ఇరిగేషన్‌ ఏఈ

బునాదిగాని కాల్వకు వారం రోజుల్లో నీటిని విడుదల చేస్తాం. కాల్వ ప్రారంభ పాయింట్‌ వద్ద 100 మీటర్ల మేర పెండింగ్‌ పనులు పూర్తిచేయాల్సి ఉంది. మక్తానంతారం రైతుల అభ్యంతరాల కారణంగా భూసేకరణకు అడ్డంకిగా మారింది. దీంతో వారం రోజుల పాటు పనులు నిలిచాయి. మూసీ కత్వ వద్ద మేడ్చల్‌ జిల్లా పరిధిలో అసంపూర్తి పనులు పూర్తిచేయాల్సి ఉంది. దిగువన ముగ్దుంపల్లి వద్ద 2.5కిలోమీటర్ల మేర గైడ్‌ వాల్స్‌ నిర్మాణ పనులు పూర్తి చేశాం. 15 నుంచి 20వ తేదీలోగా బునాదిగాని కాల్వకు నీటిని విడుదల చేస్తాం.

Updated Date - Jul 10 , 2025 | 12:32 AM