Share News

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తుల జప్తు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:52 AM

హత్యలు, కబ్జాలు, అరాచకాల అలజడి సృష్టించిన నయీం ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. గత ప్రభుత్వం వేసిన సిట్‌ ఆధారంగా వివరాలు సేకరించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తుల జప్తు

ఈడీ నిర్ణయం

కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న 35ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

ఆందోళనలో బాధితులు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్‌): హత్యలు, కబ్జాలు, అరాచకాల అలజడి సృష్టించిన నయీం ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. గత ప్రభుత్వం వేసిన సిట్‌ ఆధారంగా వివరాలు సేకరించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. నయీం ముఠా బెదిరించి స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూము లు, ఇళ్లు, వెంచర్లలోని ప్లాట్ల యజమానులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఆస్తులను ఈడీ జప్తు చేసుకోనుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

బెదిరింపులు, అరాచకాలతో గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమంగా చెరపట్టిన విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమైంది. కుటుంబసభ్యులు, బినామీల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 35 ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధంచేసింది. 2020 ఆగస్టులో షాద్‌నగర్‌ వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌లో నయీం మృతిచెందాడు. దీంతో అప్పటివరకు నయీం గ్యాంగ్‌ అరాచకాలను భరించిన బాధితులు పెద్ద సంఖ్య లో పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. భువనగిరిలోని క్రిస్టియన్‌ గోస్పెల్‌ చర్చి ఆస్తులను కూడా నయీం బలవంతంగా తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నాడని ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పట్లోనే సిట్‌ ఏర్పాటు ...

నయీం ఆగడాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ మేరకు చేపట్టిన దర్యాప్తులో నయీం కుటుంబసభ్యులు, బినామీల పేరిట వేలాది ఎకరాల భూములు, అంతే స్థాయిలో ప్లాట్లు, ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన సిట్‌ బృందం ఈడీకి నివేదించింది. మెజారిటీ ఆస్తులు నయీమ్‌ కుటుంబసభ్యులైన హసీనాబేగం, తాహరాబేగం, సలీంబేగం, అబ్దుల్‌, సలీం, అహేలాబేగం, సయ్యద్‌ నిలోఫర్‌, ఫిర్దోస్‌ అంజుమ్‌, మహమ్మద్‌ ఆరిఫ్‌, హసీనా కౌసర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించింది. వీరిలో ఒకరిద్దరూ మృతి చెందినట్లు ప్రచారంలో ఉం ది. ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ఆధారంగా 2020లో ఈడీ మనీ లాండరింగ్‌ కేసులు నమోదుచేసి పలుమార్లు సమాన్లు జారీచేసింది. అలాగే భారీ ఆస్తులు కూడబెట్టినప్పటికీ ఐటీ రిటర్న్స్‌ దాఖల చేయనట్లు గుర్తించింది. దీంతో ఐటీ శాఖ కూడా నోటీసులను జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ చిరునామాల ఆధారంగా సమన్లు, నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరు తీసుకోకపోవడంతో చిరునామా ఇళ్ల గోడలపై పలు పర్యాయాలు ఎప్పటికీ ఐదేళ్లుగా ఎలాంటి స్పందన లేకపోవడంతో గుర్తించిన 35ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వచ్చిన కథనాలు చర్చనీయాంశమయ్యాయి.

భువనగిరి పరిసరాల్లోనే అధికం

నయీం ముఠా చెరబట్టిన ఆస్తులు భువనగిరి పరిసరాల్లో అధికంగా ఉండటం, కొన్నింటిపై బినామీలు లేదా ఇతరులు కబ్జా ఉండటంతో ఆ ఆస్తులు చర్చనీయాంశంగా మారాయి. మరికొన్ని వెంచర్లలోని ప్లాట్‌లను ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు గతంలోనే కొనుగోలు చేసినప్పటికీ ఆ తర్వాత ఆ వెంచర్ల యాజమానుల నుంచి నయీం ముఠా తిరిగి రిజిస్ర్టేషన్‌ చేసుకుంది. అలాగే మరికొన్ని భూములను పట్టాదారుల నుంచి నయీం ముఠా నేరుగా తక్కువ ధరకే కొనుగోలు చేసింది. దీంతో బాధితులు అప్పట్లోనే సిట్‌ను ఆశ్రయించి న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 35 ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంతో తాము నష్టపోయిన భూములు ఈడీ స్వాధీనం చేసుకునే జాబితాలో ఉంటే తమ పరిస్థితి ఏమిటని బాధితులు ఆందోళనకు గురవుతున్నట్టు ప్రచారమవుతోంది. న్యాయంకోసం నేటికీ బాధితులు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అర్జీలు ఇస్తూనే ఉన్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులను కూడా కలుస్తున్నారు. దీంతో ఈడీ స్వాధీనం చేసుకునే 35 ఆస్తుల జాబితా అధికారికంగా వెలువడితేనే ఆస్తుల జప్తుపై స్పష్టత రానుంది. అలాగే జప్తు జాబితాలో లేని ఆస్తుల పరిస్థితి ఏమిటని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈడీ ఆస్తుల జప్తుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు. నయీం, అతని ముఠాపై సుమారు 300 బెదిరింపులు, కిడ్నా్‌పలు, అక్రమ వసూళ్లు, భూముల కబ్జా తదితర కేసులు ఉండగా 25 పైగా హత్య కేసులు ఉన్నాయి. అవన్నీ కోర్టులలో విచారణ దశలో ఉన్నాయి.

Updated Date - Apr 12 , 2025 | 12:52 AM