16 నుంచి కళాశాలలు బంద్
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:22 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 16 నుంచి బంద్ నిర్వహించనున్నాయి. గతంలో 40 రోజులు సమ్మె నిర్వహించగా, ప్రభుత్వం మూడు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చింది.
మూతపడనున్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో..
భవనాల అద్దె, వేతనాలు చెల్లించలేకపోతున్నామంటున్న యాజమాన్యాలు
గతంలో 40 రోజులు సమ్మె
నాడు మూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం
ఆందోళనలో విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి,మోత్కూరు): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 16 నుంచి బంద్ నిర్వహించనున్నాయి. గతంలో 40 రోజులు సమ్మె నిర్వహించగా, ప్రభుత్వం మూడు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చింది. ఈ హామీ నెరవేరకపోవడంతో మళ్లీ బంద్ పాటించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.
పట్టభద్రులైన నిరుద్యోగులు కొందరు పలువురు విద్యార్థులకు విద్య అందించడంతోపాటు స్వయం ఉపాధి, మరికొందరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పాటుచేశారు. విద్యార్థులు ఇచ్చే ఫీజులపై ఆధారపడి ఇవి నడిచేవి. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నాటి నుంచి ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక ఏడాది, ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదు. దీంతో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వందే కళాశాలలు నడపలేమంటూ ఈ నెల 16 నుంచి నిరవధిక బంద్‌కు వెళ్లనున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి ఇటీవల కళాశాలల యాజమాన్యాలు సమ్మె నోటీసు అందజేశాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 62 ప్రైవేట్ డిగ్రీ, 15 పీజీ కళాశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 62 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 15 ప్రైవేట్ పీజీ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సుమారు 16వేల మం ది విద్యార్థులు, పీజీ కళాశాలల్లో సుమారు 2వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో అత్యధిక భాగం నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు.
మూడేళ్లుగా బకాయిలు
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక ఏడాది, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయలే దు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ కశాశాలలకు 2022-23, 2023-24, 2024-25 విద్యా సం వత్సరాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెం ట్ రూ.250కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో టోకెన్ ఇచ్చిన మొత్తం రూ.100కోట్లు ఉండగా, బిల్లు చేయని మొత్తం రూ.150కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కళాశాలల నిర్వహణకు డబ్బు లేక
ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఎక్కువగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తున్నందున విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకూడదు. అయితే ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో భవనాల అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించలేకపోతున్నామని కళాశాలల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పు చేసి కొంత కాలం అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించామని, ఇక అప్పు కూడా దొరికే పరిస్థితి లేదంటున్నారు. గత ఏప్రిల్, మే మాసాల్లో పరీక్షలు బహిష్కరించి 40 రోజులు సమ్మె నిర్వహించగా, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి యాజమాన్యాలను సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వద్దకు తీసుకెళ్లారు. ప్రభుత్వం మూడు రోజుల్లో కొంత బకాయి చెల్లిస్తుందని ఆయన హామీ ఇవ్వగా, అది నేటికీ అమలుకాలేదు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందనే మానవతా దృక్పథంతో నాడు సమ్మె విరమిస్తే, నేటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుంటే ఎలా అని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, లేదంటే ఈ నెల 16 నుంచి కళాశాలలు మూసి నిరవధిక బంద్ పాటిస్తామన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వెంటనే నిధులు విడుదల చేయాలి : చౌగోని సత్యంగౌడ్, ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నల్లగొండ
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని ఏప్రిల్, మే మాసాల్లో 40 రోజులు సమ్మె చేశాం. మూడు రోజుల్లో కొంత బకాయి చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశాం. ఉన్నత విద్యాశాఖ అధికారులను కలిశాం. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదు. భవనాలకు అద్దె, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. గత్యంతరం లే ని పరిస్థితుల్లో ఈ నెల 16 నుంచి నిరవధిక బంద్‌కు వెళ్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి కళాశాల యాజమాన్యాలకు, విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి.