Share News

కొబ్బరికాయల ధరలకు రెక్కలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:41 AM

పూజల్లో వినియోగించే ప్రధానమైన కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో నిత్యం ఆరాధనలు, పూజలు కొనసాగుతాయి.

కొబ్బరికాయల ధరలకు రెక్కలు

కార్తీకమాసం కావడంతో డిమాండ్‌

రూ.35 నుంచి రూ.45 పలుకుతున్న ధరలు

భక్తులకు తప్పని తిప్పలు

పూజల్లో వినియోగించే ప్రధానమైన కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో నిత్యం ఆరాధనలు, పూజలు కొనసాగుతాయి. ఆలయాలు, క్షేత్రాలను భక్తులు విరివిగా దర్శించుకుంటారు. ఈ సమయంలో కొబ్బరికాయలకు డిమాండ్‌ మరింతగా ఉంటుంది. అయితే కొద్దికాలంగా వాటి ధరలు పెరిగిపోయాయి. గతంలో రూ.20లు పలికే కొబ్బరికాయ ధర ప్రస్తుతం రూ.35 నుంచి రూ.45 వరకు పలుకుతోంది.

(ఆంధ్రజ్యోతి-చింతపల్లి)

కార్తీకమాసంలో వేకువజామునే దేవతారాధన ప్రధానంగా ఉంటుంది. ఇంట్లో పూజలతో పాటు భక్తులు తరుచూ ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆలయాలు, క్షేత్రాల్లో సైతం ఈ మాసాంతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. పూజల్లో ప్రధానంగా వినియోగించే కొబ్బరికాయల ధరలు రెండు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరికాయలను పత్రం, పుష్పం, ఫలం తోయంగా భావిస్తుంటారు. దీంతో ఈ మాసంలో మంచి డిమాండ్‌ ఉంటుంది.

పూజలకు ప్రత్యేక మాసం

కార్తీకమాసం పూజలకు, దైవరాధనలకు ప్రత్యేకం. శివుడికి ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. దీంతో ఈ మాసంలో ఉపవాసాలతో పాటు పూజలు చేస్తుంటారు. అదేవిధంగా అయ్యప్ప, ఆంజనేయస్వామి, శివభక్తుల మాలాధారణ చేస్తుంటారు. మండలం పాటు(40 రోజులు) చేపట్టే దీక్షను ఈ మాసంలోనే చాలామంది ప్రారంభిస్తారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంటుంది. డిసెంబరులో శబరిమలలో జరిగే ప్రత్యేక పూజలకు హాజరయ్యే భక్తులు ఈ మాసంలోనే మాలధారణ చేస్తుంటారు. దీంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిస్తుంటాయి.

పెరిగిన డిమాండ్‌.. తగ్గిన దిగుబడి

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కొబ్బరికాయలు ఆంధ్రప్రదేశ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలానికి గతంలో వారానికి రెండు లారీల కొబ్బరికాయలు సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వారానికి ఒక లారీని మాత్రమే సరఫరా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు తెలుపుతున్నారు. అయితే కొద్దికాలంగా పంట దిగుబడి లేకపోవడం, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో కొబ్బరికాయల ధరలకు డిమాండ్‌ పెరిగింది. సరఫరా అయిన కొబ్బరికాయలు కూడా చిన్నవిగా ఉంటున్నాయని, కేవలం ఐదు రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో రూ.20లు పలికిన కొబ్బరికాయ ప్రస్తుతం రూ.35 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యాపారులు సిండికేట్‌ కావడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.

ధరలు కొండెక్కాయి

నిత్యం మా ఇంట్లో పూజలు చేసి అనంతరం దేవాలయాలకు వెళ్తుంటా. ఆలయానికి వెళ్లాలంటే పసుపు, కుంకుమ పువ్వులు, పండ్లు, కొబ్బరికాయతో వెళ్లి పూజలు చేస్తుంటా. నెల రోజుల క్రితం రూ.20 ఉన్న కొబ్బరికాయ ధర ప్రస్తుతం రూ.40కి చేరింది. గ్రామీణప్రాంతాల్లో రూ.40 నుంచి 45 వరకు విక్రయిస్తున్నారు. దిగుమతి చేసిన కొబ్బరికాయులు చిన్నవిగా ఉండటంతో వెంటనే కుళ్లిపోతున్నాయి.

కొండూరి శ్రీదేవి, మాజీ సర్పంచి (గొడకొండ్ల).

Updated Date - Oct 23 , 2025 | 12:41 AM