Share News

సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టుల మూసివేత

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:44 AM

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులను బుధవారం నుంచి మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్‌పోస్టులను మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ

సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టుల మూసివేత
నాగార్జునసాగర్‌లో చెక్‌పోస్టును ఎత్తివేస్తున్నట్లు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ

ఉమ్మడి నల్లగొండలో మూడు చోట్ల చెక్‌పోస్టులు

రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకేనంటూ ఫ్లెక్సీల ఏర్పాటు

కోదాడ రూరల్‌ / నాగార్జునసాగర్‌ / దామరచర్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులను బుధవారం నుంచి మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్‌పోస్టులను మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ వద్ద ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టును మూసివేసి ఇక్కడ ఉన్న కార్యాలయ సామాగ్రిని ఆటోలో నల్లగొండ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. చెక్‌పోస్టును మూసివేస్తున్నట్లు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఇతరరాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ట్రాన్సపోర్ట్‌ వాహనాల చలాన్లు ఆనలైన ద్వారా చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా దామరచర్ల మండలం వద్ద ఉన్న చెక్‌పోస్టును మూసివేసి ఫర్నీచర్‌ను, సామాగ్రిని జిల్లా కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం రవాణాలావాదేవీలను పూర్తిస్థాయిలో ఆనలైన ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో చెక్‌పోస్టును మూసివేస్తున్నట్లు అసిస్టెంట్‌ ఎంవీఐ సతీష్‌ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టునూ మూసివేశారు. ఇక్కడి సామాగ్రిని, రికార్డులు, ఫర్నీచర్‌, కంప్యూటర్లను నల్లగొండ ఆర్టీఏ కార్యాలయానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణరాష్ట్రం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను అప్పటి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ రాష్ట్రంతో పాటు ఇతరరాష్ట్రాలకు చెందిన వాహనాలు తెలంగాణలోకి రావాలంటే ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చెల్లించే ట్యాక్స్‌లను ప్రభుత్వం ఆనలైనలోనూ చెల్లించే విధానం తీసుకువచ్చింది. దీంతో చెక్‌పోస్టులను ఎత్తివేత తప్పలేదని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 23 , 2025 | 12:44 AM