తుంగతుర్తి కాంగ్రె్‌సలో ముదిరిన వర్గపోరు
ABN , Publish Date - May 17 , 2025 | 12:26 AM
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. శుక్రవారం అర్వపల్లి, మోత్కూరులో నిర్వహించిన పార్టీ సమావేశాలు పార్టీలో వర్గవిభేధాలకు, ఘర్షణకు వేదికగా నిలిచాయి.
ఉద్రిక్తతలకు దారితీసిన సమావేశాలు
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. శుక్రవారం అర్వపల్లి, మోత్కూరులో నిర్వహించిన పార్టీ సమావేశాలు పార్టీలో వర్గవిభేధాలకు, ఘర్షణకు వేదికగా నిలిచాయి. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో పాటు కుర్చీలు విసిరివేత, నెట్టువేతలకు దిగారు. అర్వపల్లిలో పోలీసుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను పంపించి వేయగా, కార్యక్రమం రద్దయ్యింది.
(ఆంధ్రజ్యోతి-అర్వపల్లి/ మోత్కూరు)
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరింది. నిన్న నిలదీతల వరకే పరిమితం కాగా నేడు తోపులాట, కుర్చీల విసిరివేసే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం పార్టీలోని బ్లాక్, మండల, గ్రామస్థాయి కమిటీల పదవులకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తతకు దారితీసి చివరకు రద్దయ్యింది. ముఖ్యనాయకులు అక్కడకు రాకుండానే సమావేశాన్ని రద్దు చేశారు. అర్వపల్లిలోని లక్ష్మీఫంక్షనహాల్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు, గ్రామకమిటీ అధ్యక్షుల పదవులకు దరఖాస్తులను స్వీకరించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే పార్టీ నియోజకవర్గ పరిశీలకులు రాకముందే ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. కుర్చీలు విసిరేసుకొని, తోపులాట జరుగుతుండగా పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు రెండు గంటల పాటు వాగ్వాదం చేసుకున్నారు. అయితే తోపులాట జరిగినప్పుడు దామోదర్‌రెడ్డి వర్గాన్ని పోలీసులు గేట్లు వేసి లోపలే ఉంచారు. ఎమ్మెల్యే వర్గాన్ని లోపలికి వెళ్లనీయకుండా రోడ్డుపైనే ఉంచారు. కొద్దిసేపటికి ఇరువర్గాలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కార్యక్రమం రద్దయ్యింది. ఇదిలా ఉండగా రెండురోజుల కిందటే సూర్యాపేటల పార్టీ పదవుల కోసం దరఖాస్తుల కూడా ముగిసింది. అయితే కావాలనే ఇక్కడ మరోసారి దరఖాస్తుల స్వీకరణను ఏర్పాటు చేశారు. అయితే గందరగోళం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. ఇదిలా ఉండగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సమన్వయం పాటించాలని, పదవులు ఎవరికి వచ్చినా ఓపికతో కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.
చొక్కాలు పట్టుకుని...
తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్‌రోడ్డులో ఉన్న ఫంక్షనహాల్లో మోత్కూరు, అడ్డగుడూరు మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా పరిశీలకుడు పులి అనిల్‌కుమార్ వివరించిన తర్వాత స్థానిక నాయకులు మాట్లాడటానికి అవకాశమిచ్చారు. అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ నారగోని అంజయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మందుల సామేల్‌ను ఎన్నికల్లో తాను డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిపించానని, ఇప్పుడు ఆయన తనను గాని, పాత కాంగ్రెస్ నాయకులనుగాని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రె్‌సలో ఉండి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా, ఆయన గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా కాంగ్రె్‌సలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సీపీఐ నాయకులతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పిసుండగా బాలెంల సైదులుతో పాటు మరికొందరు నాయకులు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఆయనకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందని, కొందరు కావాలని ఎమ్మెల్యేను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రతివిమర్శలు చేశారు. ఎమ్మెల్యే వ్యతిరేక, అనుకూల వర్గాలు నువ్వేం చేశావంటే, నువ్వేం చేశావని వాదించుకుంటూ చొక్కాలు పట్టుకుని పరస్పరం నెట్టేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలు లేపి విసురుకోవడానికి ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య కుస్తీపట్లు పెరగడంతో జిల్లా పరిశీలకుడు అనిల్, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మరికొందరు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీసి సముదాయించారు. ఆ తర్వాత మళ్లీ సమావేశం యథావిదిగా కొనసాగింది. నియోజకవర్గ, మండల కోఆర్డినేషన కమిటీలు ఏర్పాటుచేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఏడాదంతా తానే పరిశీలకుడిగా ఉంటానని, గ్రామాలకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తానని, పార్టీకోసం పని చేసే ఏ కార్యకర్తకు అన్యాయం జరుగకుండా చూస్తానని పరిశీలకుడు అనిల్ హామీ ఇచ్చారు.