Share News

గుర్తింపు మార్చుకుని.. కుటుంబాన్ని వదులుకుని

ABN , Publish Date - May 03 , 2025 | 12:01 AM

పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

 గుర్తింపు మార్చుకుని.. కుటుంబాన్ని వదులుకుని
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కొత్తపల్లి నర్సింహ

ఆరేళ్ల క్రితం తప్పించుకున్న పెరోల్‌ ఖైదీ అరెస్టు

సూర్యాపేట క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి) : పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డు తిరుపతి 2012లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం పోలీ్‌సస్టేషన పరిధిలో ఓ వ్యక్తిని హత్యచేశాడు. ఆ కేసుకు సంబంధించి తిరుపతిని అరె్‌స్టచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా మూడవ అదనపు సెషన్స కోర్టు తిరుపతికి జీవితఖైదు విధించింది. అనంతరం తిరుపతిని పోలీసులు చర్లపల్లి జైలుకు పంపించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 ఆగస్టు 17న నెల రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా ఆరేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. చర్లపల్లి జైలు అధికారులు మఠంపల్లి పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ విభాగం సహకారంతో నిందితుడు తిరుపతి గుంటూరు జిల్లాలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బృందం అక్కడికి వెళ్లి తిరుపతిని అరెస్ట్‌ చేశారు. తిరుపతి తన అసలైన గుర్తింపును పూర్తిగా మార్చుకుని, తన కుటుంబ సభ్యులు, స్వగ్రామం నుంచి పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాడు. గుంటూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద గతం తాలూకు ఎటువంటి ఆధారాలు లేకుండా గతాన్ని పూర్తిగా దాచి ఉంచి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు కోదాడ డివిజన పోలీసులు చేసిన ప్రత్యేక కృషితో తిరుపతి పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతిని పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ బాబు, ఐటీకోర్‌ ఆర్‌ఎ్‌సఐ రాజశేఖర్‌, సిబ్బంది ఎం. రామారావు, శంభయ్య ఉన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:01 AM