తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:15 AM
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హుజూర్‌నగర్‌లో గురువారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హుజూర్‌నగర్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హుజూర్‌నగర్‌లో గురువారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో బలపడదన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ సంస్థానాలను విముక్తి కల్పించడంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. చంద్రబాబు, నితీ్‌షకుమార్‌ల మద్దతుతో మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వం ఆమోదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బొమ్మకంటి ప్రభాకర్, కంబాల శ్రీనివాసు, ఉస్తెల సుజన, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి జడ శ్రీనివా్‌సయాదవ్, మేకల శ్రీనివాస్, ధనుంజయనాయుడు పాల్గొన్నారు.
చిలుకూరు: తుపాన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. చిలుకూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి రైతులకు సహాయం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇందుకు కోసం ప్రభుత్వం పంట భీమా సౌకర్యాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, జిల్లాలో తుపాన ప్రభావం అధికంగా ఉండటంతో రైతులు సాగుచేసిన వరి, పత్తి, మిర్చి పంటలు చేతికందిన సమయంలో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని, రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, నాయకులు సాహేబ్ అలీ, చేపూరి కొండలు ఉన్నారు.