Share News

తెలుగు చదవలేరా?

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:29 AM

విద్యార్థులు తెలుగు కూడా చదవలేరా అంటూ కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాధవరం గ్రామంలోని మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాల, అంగనవాడీ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు.

తెలుగు చదవలేరా?
విద్యార్థులతో పాఠాలు చదివిస్తున్న కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

నివేదిక పంపించాలని డీఈవోకు కలెక్టర్‌ ఆదేశం

మునగాల రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు తెలుగు కూడా చదవలేరా అంటూ కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాధవరం గ్రామంలోని మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాల, అంగనవాడీ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు. 7వ తరగతి విద్యార్థులు తెలుగు పాఠాలు సరిగ్గా చదవలేకపోవడం, హోంవర్క్‌, నోటు పుస్తకాలు సరిగా లేకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునగాల ఎంఈవో పాఠశాలను శుక్రవారం పరిశీలించి విద్యార్థుల ఫలితాలు, ఉపాధ్యాయుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఫోనలో డీఈవో అశోక్‌ను ఆదేశించారు. విద్యార్థులు తెలుగులో రాసి, చదివే సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతిరోజూ తెలుగు, ఇంగ్లీష్‌ ఒక పేజీ రాయాలని, రెండు పేజీలు చదవాలని, మరలా రెండు నెలల తరువాత పాఠశాలకు వస్తానని, అప్పటిలోగా ప్రతి ఒక్కరూ ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించాలన్నారు. కష్టపడి చదివితేనే భవిష్యత ఉంటుందని విద్యార్థులకు సూచించారు.

పిల్లలు హుషారుగా ఉన్నారు

1వ తరగతి విద్యార్థులతో కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ తెలుగు, ఇంగ్లీష్‌ అంకెలు చదివించారు. వారితో ముచ్చటించారు. పిల్లలతోనే వారి వివరాలు అడిగి తెలుసుకుని చాలా హుషారుగా ఉన్నారని కితాబిచ్చారు. ప్రతిరోజూ ఇంటి వద్ద రెండు గంటల పాటు చదువుకోవాలని పిల్లలకు సూచించారు. అనంతరం అంగనవాడీ కేంద్రంలో పిల్లలతో ముచ్చటించారు. మంచిగా పాటలు పాడటంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, మణెమ్మ, అంగనవాడీ టీచర్లు అనిత, సదాలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 12:29 AM