Share News

వానాకాలం సీజనలోనైనా ఎత్తిపోసేనా?

ABN , Publish Date - May 19 , 2025 | 12:13 AM

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పనులు ఆలస్యమవుతున్నాయి.

వానాకాలం సీజనలోనైనా ఎత్తిపోసేనా?
బేటీతండా ఎత్తిపోతల పథకం కోసం నిర్మిస్తున్న కాల్వ

పనుల ఆలస్యంపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం

రెడ్లకుంట, రాజీవ్‌శాంతి నగర్‌, బేటీతండా, జాన్‌పహడ్‌ పథక పనులపై ఆరా

నేడు కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటన

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పనులు ఆలస్యమవుతున్నాయి. ఎప్పటికప్పుడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెల 4న కోదాడ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనుల నత్తనడకపై మంత్రి ఉత్తమ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన నాటికైనా పనులు పూర్తవుతాయా అని నిలదీశారు. అయినప్పటికీ పనుల్లో వేగం పుంజుకోలేదు. ఈ తరుణంలో మరోమారు నేడు కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్థి పనులకు శంకుస్థాపనతో పాటు ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్నారు.

(ఆంధ్రజ్యోతి-కోదాడ)

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల పథకాల కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించడంతో పాటు పనులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ పనుల్లో ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతీ నెలా పథకాల వారీగా అధికారులతో మంత్రి సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిధుల కొరత లేకున్నా పనులు జాప్యం కావడంపై మంత్రి ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. వానాకాలం సీజన నాటికి ఎత్తిపోతల నుంచి సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ సీజనలో సాగునీరందుతుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కోదాడ మండలం రెడ్లకుంట ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం రూ.47.6 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకం పూర్తయితే రెడ్లకుంట, కాపుగల్లు, నల్లబండగూడెం గ్రామాల కింద 4,460 ఎకరాలకు సాగునీరందనుంది. కాగా పనులు 10 శాతం పూర్తికావడం, పంప్‌హౌస్‌ ఏర్పాటు దశలోనే ఉన్నాయి.

మునగాల మండలం 4.25 కిలోమీటర్ల పరిధిలో ఆర్‌-9 ఎత్తిపోతల పథకం కోసం రూ.8.6 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల కింద 2,300 ఎకరాలకు సాగునీరందనుంది. పనులు నత్తనడక నడుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనంతగిరి మండలం రాజీవ్‌శాంతినగర్‌ ఎత్తిపోతల పథకం కోసం రూ.2.6 కోట్లు కేటాయించింది. 5 వేల ఎకరాలు కాల్వ కింద సాగుకానుంది. గత వరదలకు పంప్‌హౌస్‌ దెబ్బతినటంతో రైతులు సాగునందరక ఇబ్బందులు పడ్డారు. వానాకాలం సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడకుంట ఉండేందుకు మంత్రి ఉత్తమ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, పంపుహౌస్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ ఆయా పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి.

హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం వెల్లటూరు ఎత్తిపోతల పథకానికి రూ14.50కోట్లు కేటాయించింది. 25 కిలోమీటర్ల మేర కాల్వను నిర్మిస్తోంది. కాగా పనులు 30శాతం పూర్తయినట్లు సమాచారం. ఇంకా పనులు పురోగతిలోనే ఉన్నాయి. పాలకవీడు మండలం బేటీతండా ఎత్తిపోతల పథకానికి రూ.33.83 కోట్లతో 2.6 కిలోమీటర్ల మేర కాల్వలను నిర్మిస్తున్నారు. ఈ పథకం కింద 2,041ఎకరాలు సాగు కానుంది. పనులు పునాది వరకే పూర్తయ్యాయి. మూడు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

జాన్‌పహడ్‌ ఎత్తిపోతల పథకానికి రూ.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 10వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ప్రస్తుతం కాంక్రీట్‌ పనులు నడుస్తున్నాయి. ఆయా ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా చేపట్టకపోవడం, వానాకాలం సీజన్‌ దగ్గర పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు సకాలంలో పూర్తి కాకపోతే రైతుల సాగు ఇబ్బంది ఉంటుంది. దీంతో ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులపై పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, త్వరగా పూర్తి చేసి, రైతులకు ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రి ఎత్తిపోతల పథకాల పనులపై పరిశీలనకు కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాలలో సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.

నేడు బక్కమంతులగూడెంలోనూ పర్యటన

మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో రూ.2.50కోట్లతో నిర్మించిన విద్యుత సబ్‌స్టేషనను మంత్రి ఎన.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల విద్యుత కష్టాలు ఈ సబ్‌స్టేషనతో తీరనున్నాయి.

Updated Date - May 19 , 2025 | 12:13 AM