Share News

అప్పులు తీర్చేందుకు దొంగగా మారిన కారోబార్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:23 AM

అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రులకు వైద్యం నిమిత్తం అప్పులు తీర్చేందుకు ఓ కుమారుడు దొంగగా మారాడు. కారోబార్‌గా పనిచేస్తున్న గ్రామంలోనే ఏడాదిలో మూడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు.

అప్పులు తీర్చేందుకు దొంగగా మారిన కారోబార్‌
కోదాడ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

కోదాడ రూరల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రులకు వైద్యం నిమిత్తం అప్పులు తీర్చేందుకు ఓ కుమారుడు దొంగగా మారాడు. కారోబార్‌గా పనిచేస్తున్న గ్రామంలోనే ఏడాదిలో మూడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో కారోబార్‌ విషయం వెలుగుచూసింది. అతడినుంచి రూ.6 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కొండ భాస్కర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో మూడేళ్లుగా కాంట్రాక్ట్‌ కారోబార్‌గా పనిచేస్తున్నారు. గతేడాది అతడి తల్లిదండ్రులు అనారోగ్యానికి గురై మృతి చెందారు. వారికి వైద్యం చేయించేందుకు రూ.8 లక్షల దాకా భాస్కర్‌కు అప్పులయ్యాయి. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వచ్చే జీతం కుటుంబపోషణకే సరిపోవడంతో అప్పులు తీర్చలేకపోయారు. అప్పు ఇచ్చినవారి ఒత్తిడి పెరగడంతో దొంగతనాలు చేసి అప్పులు తీర్చాలని భావించాడు. అదేగ్రామంలో ఏడాదిలో మూడు ఇళ్లలో పెద్దఎత్తున బంగారం, నగదు, వెండి వస్తువులు, చోరీలకు పాల్పడ్డాడు. గ్రామపంచాయతీలో పనిచేస్తుండటంతో గ్రామస్థుల పూర్తి సమాచారం తెలిసిఉండేది. తాను చోరీకి పాల్పడాలనుకున్న వారు పనుల నిమిత్తం ఊరు దాటిన సమయంలో చోరీలకు పాల్పడేవాడు. బాధితులు పోలీసుస్టేషనకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. భాస్కర్‌ చోరీలకు పాల్పడిన క్రమంలో కొన్నినగలు విక్రయించి డబ్బును వినియోగించుకున్నాడు. ఇంట్లో దాచిఉంచిన నగలను సోమవారం కోదాడలోని గోల్డ్‌ ఫైనాన్స కంపెనీలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. దీంతో ఖానాపురం గ్రామంలో దొంగతనాలకు పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. భాస్కర్‌ నుంచి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.3 వేల నగదు, మొబైల్‌ ఫోనను స్వాధీనపర్చుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. భాస్కర్‌ను అరెస్టుచేసి కోదాడ మున్సిఫ్‌ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ ప్రతాపలింగం, ఎస్‌ఐ నవీనకుమార్‌, సిబ్బంది రామారావు, నిరంజన, ఏడుకొండలు నర్సింహారావు, పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:23 AM