Share News

నిలిచిన బుద్ధవనం అభివృద్ధి పనులు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:40 AM

ప్రపంచ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ బౌద్ధక్షేత్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టులో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

నిలిచిన బుద్ధవనం అభివృద్ధి పనులు
అసంపూర్తిగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ బౌద్ధక్షేత్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టులో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 274 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పనుల్లో కొన్ని అసంపూర్తిగా ఉండగా, మరికొన్ని కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులకు కనీసం టెండర్లు కూడా ఖరారు కాలేదు. రూ.25 కోట్ల వ్యయంతో డిజిటల్‌ మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం మహాస్థూపం ముందున్న స్థలాన్ని కూడా పర్యాటక శాఖ అధికారులు పరిశీలించి, ప్రతిపాదించారు. కానీ ఆ పనులకు సంబంధించి నేటికీ కనీసం టెండర్లు ఖరారుకాలేదు. అంతేకాకుండా రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 18 దుకాణాల సముదాయం పనులు స్లాబ్‌ లెవల్‌ వరకు వచ్చి ఆగిపోయాయి. అలాగే రూ.1.60 కోట్లతో 2500 విగ్రహ నమునాలతో నిర్మించతలపెట్టిన జర్నీ ఆఫ్‌ అశోకా స్థూపం పనులు ప్రారంభించలేదు. .రూ.130 లక్షలతో నిర్మించ తలపెట్టిన గ్రానైట్‌ పార్కిగ్‌ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం రూ.8 లక్షలతో క్లాక్‌ రూం, రూ.35 లక్షలతో వాటర్‌ ట్యాంకు పనులు పూర్తయ్యాయి. రూ.1.05 కోట్లతో వాటర్‌ ట్యాంకుకు నదిలో నుంచి పైప్‌లైన వేసే పనులు, రూ.10 లక్షలతో నిర్మించనున్న సంప్‌ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. బుద్ధవనంలో మొత్తం రూ.40 కోట్ల అభివృద్ధి పనులు చేపడతామని పర్యాటక శాఖ ఉన్నతాఽధికారులు గత ఏడాది నిర్ణయించినా నేటి వరకూ అందులో సగం పనులు కూడా పూర్తికాలేదు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న బుద్ధవనానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు, బౌద్ధ మతస్తులు, బౌద్ధ బిక్షువులు ప్రతి ఏటా పెద్దసంఖ్యలో వస్తున్నారు. అయినా పూర్తిగా బుద్ధవనాన్ని అభివృద్ధి చేయకపోవడంతో పర్యాటకులు తమకు సరిపడా వసతులు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

టెండర్లు పూర్తి కాగానే పనులు మొదలు

బుద్ధవనంలో అభివృద్ధి పనులు ఇప్పటికే కొన్ని పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. టెండర్లు ఖరారు కానీ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచి పూర్తి చేయగానే పనులు మొదలుపెడతాం. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాం.

శ్రీనివా్‌సరెడ్డి, డీఈ, పర్యాటక శాఖ

Updated Date - Apr 09 , 2025 | 12:40 AM