Share News

హామీలకే పరిమితమైన బీటీ రోడ్డు

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:50 PM

గిరిజనులకు బీటీ రోడ్డు హామీలకే పరిమితమైంది. కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హామీలకే పరిమితమైన బీటీ రోడ్డు
ముల్కలపల్లి నుంచి బోజ్యతండా వరకు ఉన్న మట్టి రోడ్డు

మట్టి రోడ్డుతో గిరిజనుల ఇబ్బందులు

తుర్కపల్లి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు బీటీ రోడ్డు హామీలకే పరిమితమైంది. కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయిస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కీమ్యా తండా, బోజ్య తండాకు బీటీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముల్కలపల్లి గ్రామం నుంచి వయా కీమ్యా తండా మీదుగా బోజ్య తండా వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు గతంలో బీటీ రోడ్డు వేయాలని గత పంచాయతీ పాలకులు ప్రతిపాదనలు చేసినప్పటికీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మట్టి రోడ్డు సింగల్‌ రోడ్డు కావడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలు సాగించేందుకు ఇబ్భందులు పడుతున్నారు. వర్షా కాలంలో రోడ్డండా బురదమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డుపై వాహనాలు, పశువులు, గొర్రెలు, మేకలు వెళ్లేటప్పుడు దుమ్ము ధూళి ఇళ్లలోకి వస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అంతే గ్రామంలో అంతర్గత మురికి కాలువలు లేక పోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు రోడ్లపై పారుతుందని గ్రామస్థులు అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా గిరిజన తండాల్లో మురికి కాలువల నిర్మాణంతోపాటు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మురికి కాల్వల నిర్మాణం చేపట్టాలి

గిరిజన తండాల్లో అంతర్గత మురికి కాల్వలు లేకపోవడంతో వీదుల్లో మురికి నీరు వీధుల్లో ప్రవహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. మురికి కాల్వల కారణంగా ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి తండాల్లో మురికి కాల్వల నిర్మాణం చేపట్టి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

-బానోత గాసిరాం, కీమ్యాతండా(ముల్కలపల్లి)

మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలి

వర్షాలు కురిసినప్పుడు రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు చెట్ల పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి తండాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పిచాలి.

-బానోత శ్యామల, కీమ్యాతండా

Updated Date - Dec 04 , 2025 | 11:50 PM